స్మోకింగ్ మానేశాక ఏం చేస్తున్నారంటే...
'పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్న కవి మాటలు వినేందుకు సొంపుగా అనిపించినా, ధూమపానానికి బానిసలైనవారంతా చివరికి అనారోగ్యాలు దరి చేరేసరికి అలవాటును మానుకోవాలని ప్రయత్నిస్తారు. అందులో కొందరు ఎలాగో నానా తంటాలు పడి సిగరెట్లు తాగడం మానేస్తారు. కానీ వారు అంతటితో ఆగకుండా మరో దారి వెతుక్కుంటున్నారని, ముఖ్యంగా ఇండియన్స్ సిగరెట్లు, బీడీల్లాగే శరీరానికి హాని చేసే పొగాకుకు అలవాటు పడుతున్నారని తాజా సర్వేలు చెప్తున్నాయి.
సిగరెట్లు, బీడీలు తాగే అలవాటును మానుకున్న చాలామంది భారతీయులు పొగాకుతో తయారు చేసే ఇతర హానికర వస్తువులకు బానిసలౌతున్నారని ఓ అంతర్జాతీయ సర్వే వెల్లడించింది. ధూమపానం మానేసిన భారతీయుల్లో 44 శాతంమంది ఇతర టుబాకో వస్తువులకు దగ్గరౌతున్నారని, అవికూడ సిగరెట్లు, బీడీల్లాగే అనారోగ్యకారకాలని చెప్తున్నారు. 50.8 శాతం పురుషులు, 8.7 శాతం మహిళలు పొగలేని టుబాకో వస్తువులైన పొగాకు, ఖైనీ, పాన్ మసాలా, జర్దా, గుట్కాలను అలవాటు చేసుకుంటున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది.
దేశంలోని 29 రాష్ట్రాలు, రెండు యూనియన్ టెర్రిటరీస్ లోని 15 ఏళ్ళకు పైబడిన సుమారు 70 వేలమందిపై సర్వే నిర్వహించగా వారిలో 44.4 శాతం మంది సాదా పొగాకు, ఖైనీ, పాన్ మసాలా, జర్దా, గుట్కాలను తీసుకుంటున్నట్లు తెలిసింది. మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కి చెందిన సెంటర్ ఫర్ హెల్త్ సైన్స్ లోని అచ్యుత మెనన్ ద్వారా ఈ సర్వే నిర్వహించారు. టుబాకో ధూమపానం కంటే అత్యంత ప్రమాదకరమని, పొగలేని టుబాకో వస్తువులు, నికోటిన్ పదార్థాలను సైతం బ్యాన్ చేసి, ప్రజల్లో అవగాహన కల్పించాలని అచ్యుత మెనన్ సెంటర్ ప్రిన్సిపాల్ ఆర్.కె. థంకప్పన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పనికోసం ఒకప్రాంతంనుంచీ మరో ప్రాంతానికి వలసలు వెళ్ళే వర్కర్లు ఎక్కువగా ఈ పొగలేని టుబాకో వస్తువులకు బానిసలౌతున్నారని, వారిలో ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని థంకప్పన్ అన్నారు. ముఖ్యంగా ఇండియాలో 20.6 కోట్ల మంది పొగలేని టుబాకో వస్తువులను వినియోగిస్తున్నట్లు, పొగతాగే 11.12 కోట్ల మంది కన్నా వీరు అధికంగా ఉన్నట్లు సర్వేల్లో తేలింది. పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా ఎంతో మంది ధూమపానానికి బానిసలౌతున్నారని, ముఖ్యంగా పొగ లేని టుబాకో వస్తువులవల్ల కూడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని సీనియర్ ప్రాజెక్ట్ ఫెల్లో, అధ్యయన కో ఆథర్ జీ కె మిని తెలిపారు.