గెలుపు తంత్రం అదే!! | What is Donald Trump's strategy for winning elections? | Sakshi
Sakshi News home page

గెలుపు తంత్రం అదే!!

Published Thu, Nov 10 2016 3:34 AM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM

గెలుపు తంత్రం అదే!! - Sakshi

గెలుపు తంత్రం అదే!!

అమెరికా ఎన్నికల ఫలితం ‘మితవాద సాంస్కృతిక పునరుజ్జీవనం’లో భాగమే
 ప్రపంచీకరణ పరిణామాలు, మార్పులపై ‘తెల్ల అమెరికన్ల’ ఆగ్రహం
వలసలపై వ్యతిరేకత, మహిళా సాధికారతపై విముఖత, ఉగ్రవాద భయం
వారి మనోభావాలకు, ఆగ్రహానికి ప్రచారంలో అద్దం పట్టిన డొనాల్డ్ ట్రంప్

 
 ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం’ అనే నినాదంతో బరిలోకి దిగిన ట్రంప్ అంచనాలనూ తలకిందులు చేశారు. వలసల, మహిళల, ప్రపంచీకరణ వ్యతిరేకి, ముస్లిం వ్యతిరేకి, క్యాథలిక్ వ్యతిరేకి - అన్నిటికీ వ్యతిరేకిగా పేరుపడ్డ ట్రంప్.. ఆ ధోరణిని బాహాటంగా ప్రదర్శించే దుందుడుకు స్వభావిగా, డర్టీ కామెంట్లతో నోటిదురుసు వ్యక్తి డొనాల్డ్.. ప్రపంచంలో ప్రజాస్వామిక, లౌకిక విలువలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో ఎలా నెగ్గారనే ప్రశ్నకు సమాధానాలు వెతుకుతున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ గెలుపు వెనుక ఆర్థిక కారణాలకన్నా సాంస్కృతిక కారణాలే ఎక్కువగా ఉన్నాయని..  ఆయన విజయం కాకతాళీయమేమీ కాదని, ప్రపంచ వ్యాప్తంగా బలపడుతున్న ‘మితవాద సాంస్కృతిక పునరుజ్జీవనం’లో భాగమేనని పలువురు నిపుణులు విశ్లేషిస్తున్నారు.  - సాక్షి, నేషనల్ డెస్క్
 
 భారతదేశంలో బీజేపీ, బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీ గెలుపు, హంగరీలో ఫిడిస్జ్ - హంగేరియన్ సివిక్ అలయన్‌‌స విజయం, పోలండ్‌లో లా అండ్ జస్టిస్ నెగ్గడం.. రష్యా, టర్కీ, ఫిలిప్పీన్‌‌స దేశాలూ అధికారస్వామ్యం దిశగా పయనించటం నుంచి.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ తీర్పునిచ్చిన ‘బ్రెక్జిట్’ వరకూ - ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో మితవాద సాంస్కృతిక పునరుజ్జీవనం బలపడుతోందనేది పరిశీలకుల అంచనా. మితవాద రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ట్రంప్‌కు ‘తెల్ల అమెరికన్లు’ పట్టంకట్టడం ఆ పాశ్చాత్య మితవాద పునరుజ్జీవనానికి కొనసాగింపేనని అంచనా వేస్తున్నారు.
 
  పలువురు సామాజిక, రాజకీయ పరిశీలకుల విశ్లేషణల ప్రకారం.. శతాబ్దం కిందట సుడిగాలిలా చెలరేగిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఆలోచనా ధోరణులతో పశ్చిమ దేశాల్లోనే మొదలైన విప్లవాత్మక లౌకిక ప్రజాస్వామిక ఉద్యమం ప్రపంచాన్ని చుట్టేయడంతో 60వ దశకంలో ప్రపంచం సంక్షుభిత పరిస్థితులను ఎదుర్కొంది. ఆ సంక్షోభాలను అధిగమించి లౌకిక ప్రజాస్వామ్యం అన్ని దేశాల్లోనూ వేళ్లూనుకుంది. ప్రపంచీకరణ.. పాశ్చాత్య ప్రపంచంలో మితవాద భావజాలం గల ప్రజానీకం, అవకాశాలను పొందలేని వెనుకబడిన వర్గాలు.. తమ విశిష్ట ఉనికిని కోల్పోతున్నట్లుగా, పరాయివారి వల్ల అన్యాయానికి గురవుతున్నట్లుగా భావిస్తున్నారు. ట్రంప్ వెనుక నిలుచున్నది ఈ వర్గానికి చెందిన ‘తెల్ల అమెరికన్లే’.
 
  తెల్లవారు కాని విదేశీయులు, విజాతీయులు తమ దేశంలోకి వచ్చి ఉద్యోగాలు, ఉపాధి చూసుకుంటూ తమతో సమానంగా నివసించటం, తమను మించి అభివృద్ధి చెందుతుండటం ఒకవైపు.. తమకు అవకాశాలు సన్నగిల్లడానికి కారణం ఈ వలసలేనని మరోవైపు.. ‘శ్వేత’ సౌధంలో ఒక ‘నల్లజాతీయుడు’, అందునా ‘ముస్లిం ఉగ్రవాదం’ తమకు పెనుముప్పుగా పరిణమించిన తరుణంలో ఒక ‘ముస్లిం’ దేశాధ్యక్షుడిగా ఉండటం.. రెండో తరగతి పౌరులుగా ఉండాల్సిన మహిళలు సమాన హక్కులు పొందడమే కాదు.. తమకు సర్వాధినేతగా పదవి చేపట్టడానికి ఒక మహిళ సంసిద్ధమవడం వంటి పరిణామాలు మరోవైపు..
 
 ముప్పేటగా కలగలసి ‘తెల్ల అమెరికన్లు’ ట్రంప్ వెనుక నిలిచేలా చేశాయి. ట్రంప్ ఇదే భావజాలాన్ని తనకు అనుకూలంగా మలచుకున్నారు. నిజానికి ట్రంప్‌ను గెలిపించిన ‘తెల్ల అమెరికన్లు’ ఎక్కువగా చదువుకోని శ్రామిక వర్గీయులు. ట్రంప్ కుబేరుడైనా..ఈ ‘తెల్ల’ అమెరికన్లు వారు ఆయనను తమ వాడిగానే భావించారు. ఇక మహిళలను వినియోగ వస్తువుగానే ఎక్కువగా పరిగణించే ట్రంప్.. ఎన్నికల ప్రచారంలో బాహాటంగా మహిళలను కించపరుస్తూ ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ‘తెల్ల అమెరికన్ మహిళలు’ ఆయనను వ్యతిరేకించలేదు. నల్ల అమెరికన్లను ట్రంప్ చిన్నచూపు చూసినా కూడా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థికి గతంలో కన్నా ఈసారి ఎక్కువ నల్ల జాతి ఓట్లే లభించాయి.
 
 మెక్సికన్ల వల్ల దేశంలో నేరాలు పెరిగిపోతున్నాయని, వారు అమెరికాలోకి రాకుండా మెక్సికో సరిహద్దులో గోడ కట్టేస్తానని ట్రంప్ ప్రకటించినా కూడా.. మెక్సికన్ అమెరికన్ల ఓట్లు కూడా ఆయన సంపాదించుకోగలిగారు. ఇందుకు ప్రధాన కారణం.. తమకు తెలిసిన, తమకు నచ్చిన ‘తమ సొంత అమెరికా’ రూపురేఖలు మారిపోతుండటానికి సంబంధించిన తమ మనోభావాలను, ఆగ్రహావేశాలను ట్రంప్ తన మాటలు, చేతల్లో ప్రతిబింబించటమే. వాస్తవానికి.. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం బరిలోకి దిగినప్పటి నుండీ ట్రంప్ ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నారు.
 
  ట్రంప్ చుట్టూ కమ్ముకున్న వివాదాలు ఎంత తీవ్రమైనవంటే.. నామినేషన్ రేసులో ఒకసారి, ఆ తర్వాత నామినేషన్ పొందాక అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి.. ఆయన పోటీ నుంచి తప్పుకోవాలంటూ సొంత పార్టీ అగ్రనేతలు, అధినాయకత్వమే బలంగా, బాహాటంగా ఒత్తిడి చేసిన పరిస్థితి. కానీ.. ‘అమెరికాను మళ్లీ గొప్పగా చేద్దాం’ అన్న నినాదమే ఒక మంత్రంగా.. ‘తెల్ల అమెరికన్ల’ను ట్రంప్ వెనుక సంఘటితం చేస్తోన్న విషయాన్ని ఆ సర్వేలు పసిగట్టలేకపోయాయని విశ్లేషకుల అంచనా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement