అందంగా లేనా..?
చూసే కంటిని బట్టే అందం ఉంటుందంటారు. విభిన్న జాతులు, సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన ఈ ప్రపంచంలో ఏది అందమో ఎలా చెప్పగలం? మేకప్, ఫొటోషాప్‌లు అందానికి మరిన్ని మెరుగులు దిద్దే సాధానాలుగానే కాక.. ఆ అందాన్నే సృష్టించే స్థాయికి చేరిన తరుణంలో అందాన్ని కొలిచే కొలబద్ధ లేదా ఓ ప్రమాణం ఏదైనా ఉందా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. కానీ ఇవే ప్రశ్నలతో ఎస్తేర్ హోనిగ్ అనే జర్నలిస్టు ‘బిఫోర్ అండ్ ఆఫ్టర్’(ముందు-తర్వాత) అనే ఓ శోధనా ప్రాజెక్టు చేపట్టింది.
అందానికి కొలబద్ధలు దేశదేశానికీ ఎలా మారిపోతాయో తెలుసుకోవడానికి.. 25 దేశాల్లోని 40 మంది ఫొటోషాప్ నిపుణులను సంప్రదించింది. ‘నన్ను అందంగా తయారు చేయండి’ అంటూ తన ఫొటో పంపింది. వచ్చిన ఫొటోలు చూసి ఆశ్చర్యపోవడం ఆ అమ్మడి వంతైంది. ప్రతి ఫోటోషాప్ నిపుణుడూ తమ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆమె ఫొటోకు నగిషీలు చెక్కి అందంగా తయారుచేసి పంపించారు. మరి ఈ ఫొటోల్లో ఎవరు అందగత్తె అంటే ఎలా చెప్పగలం?