ఇక వాట్సాప్ లోకి ఎన్ని కొత్త ఫీచర్లో!
ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ మొబైల్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ తో మరింత మెరుగయింది. తాజా అప్ డేట్ లో వాట్సాప్ లోని చిన్న చిన్న సాంకేతిక అంశాలను సరిచేయడమే కాకుండా చాలావరకు కొత్త మార్పులను జోడించారు. మొబైల్ యూజర్లు మరింత సులువుగా ఫొటోలు, పీడీఎఫ్, వర్డ్ ఫైల్స్ పంపించుకునేందుకు వీలుగా లెటేస్ట్ అప్ డేట్ లో ఫీచర్స్ చేర్చారు.
వాట్సాప్ లో ఫొటో షేరింగ్ ఫీచర్ మరింత మెరుగవ్వనుంది. ఇక కేవలం మొబైల్ స్టోరేజ్ లోని ఫొటో ఆల్బమ్స్ మాత్రమే కాదు.. గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ వంటి ఆన్ లైన్ వేదికల్లో ఉన్న ఫొటోలను సైతం ఇప్పుడు వాట్సాప్ లో మిత్రులకు షేర్ చేయవచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఆ యాప్స్ మన మొబైల్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవడమే.
ఇక ఫైల్స్ పంపించుకోవడానికి ఈ-మెయిల్ పైనే ఆధారపడాల్సిన అవసరమే లేదు. వర్డ్స్, పీడీఎఫ్ డాక్యుమెంట్స్ నేరుగా వాట్సాప్ లోనే మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ లలో ఉన్న డాక్యుమెంట్స్ ను కావాలంటే మిత్రులకు పంపవచ్చు. వాట్సాప్ లో వీడియో ఫీచర్ క్వాలిటీని కూడా మెరుగుపరిచారు. ఇప్పుడు కావాలంటే వీడియోను జూమ్ చేసుకొని అందులోని యాక్షన్స్ క్లియర్ గా చూడొచ్చు. ఐఫోన్లలో వాట్సాప్ బాగా స్టోరేజ్ స్పేస్ తీసుకుంటున్న నేపథ్యంలో దీనిని కూడా కాస్తా మెరుగుపరిచారు. వాట్సాప్ 2.12.15 వెర్షన్ అప్ డేట్ ను ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఫోన్లలో నేరుగా వేసుకోవచ్చు.