‘డి2’.. ‘డి3’ ఏది బెస్ట్
ఆరోగ్యం కోసం విటమిన్లు అవసరం. మొక్కల నుంచి సేకరించిన విటమిన్ ‘డి’కన్నా జంతు ఉత్పత్తుల నుంచి సేకరించిన విటమిన్ ‘డి’ఎక్కువ మేలు చేస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ రెండింటితో కలిగే ప్రయోజనం ఒకేతీరుగా ఉంటుందన్న ప్రస్తుత అంచనా సరికాదని బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సర్రే శాస్త్రవేత్తలు అంటున్నారు. మనం తిన్న ఆహారం బాగా జీర్ణమవ్వాలన్నా.. ఎముకలను గట్టిపరిచే కాల్షియం శరీరానికి ఒంట బట్టాలన్నా విటమిన్ డి తప్పనిసరి.
అయితే శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారు చేసుకోలేదు. సూర్యరశ్మి ద్వారా చర్మంలోని కణాలు విటమిన్ ‘డి3’ని తయారు చేస్తే అదికాస్తా కాలేయం.. మూత్రపిండాల్లోకి చేరి విటమిన్‘డి’గా మారుతుంది. అయితే కొన్ని మాంస ఉత్పత్తుల్లో విటమిన్ ‘డి3’, శాకాహార ఉత్పత్తుల్లో విటమిన్ ‘డి2’ రూపంలో లభిస్తుంది ఇది. ఈ నేపథ్యంలో ‘డి2’ కన్నా ‘డి3’ వల్లే శరీరానికి మేలెక్కువని ఓ పరిశోధన ద్వారా సర్రే శాస్త్రవేత్తలు తేల్చారు. దక్షిణాసియాకు చెందిన దాదాపు 335 మందిపై పరిశోధనలు జరిపారు. ‘డి3’ అందించిన వారిలో విటమిన్ ‘డి’దాదాపు 75% ఎక్కువ కాగా.. ‘డి2’ తీసుకున్న వారిలో 34% మాత్రమే ఉందని గుర్తించారు.