సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి సమూహ వ్యాప్తి దశకు చేరుకుందని తొలుత ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌లో కోవిడ్-19 సమూహ వ్యాప్తి (పబ్లిక్ ట్రాన్స్‌మిషన్) దశకు చేరుకోలేదని, అక్కడ క్లస్టర్ కేసులు అధికంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సమూహ వ్యాప్తి జాబితాలో భారత్‌ను పేర్కొంటూ తమ నివేదికలో తప్పిదం చోటుచేసుకుందని డబ్ల్యూహెచ్‌ఓ అంగీకరించింది.
డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించిన నివేదికలో భారత్‌కు సంబంధించిన కాలమ్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అని పేర్కొనగా, చైనాలో క్లస్టర్ కేసులు నమోదవుతున్నట్టు పేర్కొంది. దీనిపై డబ్ల్యూహెచ్‌ఓ వివరణ ఇస్తూ నివేదికలో దొర్లిన పొరపాటును సవరించింది. మరోవైపు భారత్‌లో కరోనా మహమ్మారి మూడో దశ లేదా సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్) దశలో ఉందనే వార్తలను భారత్ తోసిపుచ్చింది.
భారత్‌లో ఇప్పటివరకూ 6412 పాజిటివ్ కేసులు నమోదుకాగా 199 మంది మరణించారు. గత 24 గంటల్లో 33 మంది మృత్యువాతన పడ్డారు. దేశంలో మూడువారాల పాటు లాక్‌డౌన్ అమలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వైరస్ కేసులు మందగించాయని అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు కోరిన మీదట కేంద్రం ఈ దిశగా యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment