Status Report
-
సీబీఐ అక్కర్లేదు.. తెలంగాణ హైకోర్టులో సిట్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో తమ దర్యాప్తు సజావుగానే సాగుతోందని, సీబీఐ అవసరం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT) తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. పేపర్ లీకేజ్ కేసులో దర్యాప్తు రిపోర్ట్‌ను మంగళవారం హైకోర్టుకు సమర్పించింది సిట్. ఆ స్టేటస్ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించింది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఆధారంగా.. మొత్తం 250 పేజీల రిపోర్ట్‌తో పాటు ఎంక్లోజర్స్ను సైతం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది సిట్. ‘‘పేపర్ లీక్ కేసులో.. రూ.40 లక్షల నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించాం. పేపర్ కొనుగోలు చేసిన 15 మందిని అరెస్ట్ చేశాం. శంకర్ లక్ష్మిని సాక్షిగా పరిగణించాం. సాక్షులు, నిందితులు, టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిషన్ మెంబర్‌ను సైతం ప్రశ్నించాం. వాళ్ల నుంచి సేకరించిన స్టేట్మెంట్స్ ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించాం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చాం. కానీ, పొలిటికల్ లీడర్స్ నుంచి ఎలాంటి కీలక సమాచారం అందలేదు. గతంలో ఎన్నో సెన్సేషన్ కేసుల్ని డీల్ చేశాం. ఈ పేపర్ లీక్ కేసును సైతం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి.. ఈ కేసు విచారణలో సీబీఐ అవసరం లేదు. కేసులో కీలకమైన ఎఫ్ఎస్ఎల్(FSL) రిపోర్ట్ రావాల్సి ఉంది. అది వస్తే.. కేసులో మరింత పురోగతి సాధించొచ్చు అని హైకోర్టుకు సమర్పించిన కేసు స్టేటస్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొంది. ఇదీ చదవండి: బండి సంజయ్ మూడు సింహాల ప్రమాణంపై రియాక్షన్ -
ల్యాబ్‌లు పెరిగినా టెస్ట్‌ల సంఖ్య పరిమితం..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారికి లాక్డౌన్ అమలుతో పాటు ప్రభుత్వం చేపట్టిన పలు చర్యలను వివరిస్తూ హోంమంత్రిత్వ శాఖ సోమవారం సర్వోన్నత న్యాయస్ధానానికి స్టేటస్ రిపోర్ట్ సమర్పించింది. ఏప్రిల్ 12 వరకూ చేపట్టిన చర్యలతో కూడిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ ఏడాది జనవరిలో ఒకే ఒక్క ల్యాబ్ అందుబాటులో ఉండగా ఏప్రిల్ 9 నాటికి కరోనా వైరస్ టెస్టులు చేయతగిన సామర్ధ్యంతో కూడిన 139 ల్యాబ్‌లు దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయని ఈ నివేదికలో పేర్కొంది. ఇక గత మార్చి 31న హోంమంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్లో 118 టెస్టింగ్ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 9 వరకూ పలు ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చినా కరోనా పరీక్షల సామర్థ్యం రెండు నివేదికల్లోనూ రోజుకు 15,000 టెస్ట్‌లుగానే పేర్కొనడం గమనార్హం. దేశంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైనప్పటి నుంచీ టెస్టింగ్ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని తాజా అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ నివేదికలను పరిశీలిస్తే ప్రభుత్వ లేబొరేటరీలతో పాటు ప్రైవేట్ ల్యాబ్‌ల్లోనూ టెస్టింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్టు వెల్లడైంది. మార్చి 31న దాఖలైన అఫిడవిట్లో 47 ప్రైవేట్ ల్యాబ్‌లను టెస్ట్‌ల కోసం అనుమతిస్తున్నట్టు పేర్కొనగా, ఏప్రిల్ 9న ప్రైవేట్ ల్యాబ్‌ల సంఖ్య 67గా పేర్కొన్నారు. అయితే రోజువారీ కరోనా పరీక్షల సంఖ్యలో మాత్రం పెరుగుదల చోటుచేసుకోలేదు. ఇక 52,094 వెంటిలేటర్లకు ఆర్డరిచ్చామని, వీటిలో 10,500 వెంటిలేటర్లు ఏప్రిల్ 30 నాటికి, 18,000 వెంటిలేటర్లు మే 30 నాటికి సరఫరా అవుతాయని, 20,000కు పైగా వెంటిలేటర్లు జూన్ 30 నాటికి సరఫరా అవుతాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో కేంద్రం పేర్కొంది. చదవండి : ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంలో ఊరట -
‘భారత్ ఆ దశకు చేరుకోలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి సమూహ వ్యాప్తి దశకు చేరుకుందని తొలుత ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌లో కోవిడ్-19 సమూహ వ్యాప్తి (పబ్లిక్ ట్రాన్స్మిషన్) దశకు చేరుకోలేదని, అక్కడ క్లస్టర్ కేసులు అధికంగా ఉన్నాయని స్పష్టం చేసింది. సమూహ వ్యాప్తి జాబితాలో భారత్‌ను పేర్కొంటూ తమ నివేదికలో తప్పిదం చోటుచేసుకుందని డబ్ల్యూహెచ్ఓ అంగీకరించింది. డబ్ల్యూహెచ్ఓ వెల్లడించిన నివేదికలో భారత్‌కు సంబంధించిన కాలమ్‌లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని పేర్కొనగా, చైనాలో క్లస్టర్ కేసులు నమోదవుతున్నట్టు పేర్కొంది. దీనిపై డబ్ల్యూహెచ్ఓ వివరణ ఇస్తూ నివేదికలో దొర్లిన పొరపాటును సవరించింది. మరోవైపు భారత్‌లో కరోనా మహమ్మారి మూడో దశ లేదా సమూహ వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్మిషన్) దశలో ఉందనే వార్తలను భారత్ తోసిపుచ్చింది. భారత్‌లో ఇప్పటివరకూ 6412 పాజిటివ్ కేసులు నమోదుకాగా 199 మంది మరణించారు. గత 24 గంటల్లో 33 మంది మృత్యువాతన పడ్డారు. దేశంలో మూడువారాల పాటు లాక్డౌన్ అమలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా వైరస్ కేసులు మందగించాయని అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ను మరికొంత కాలం పొడిగించాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులు కోరిన మీదట కేంద్రం ఈ దిశగా యోచిస్తోంది. చదవండి : ట్రంప్ హెచ్చరికలు.. డబ్ల్యూహెచ్ఓ స్పందన -
'పోలవరం ప్రాజెక్టుపై పూర్తి సమాచారం ఇవ్వండి'
ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన స్టేటస్ రిపోర్టు, నిర్మాణ చిత్రాల పూర్తి సమాచారాన్ని అందజేయాలని సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు లేవనెత్తిన అభ్యంతరాలపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఒడిశా తరపు న్యాయవాది సుప్రీకోర్టుకు తన వాదనలు వినిపిస్తూ.. బచావత్ అవార్డుకు బిన్నంగా ప్రాజెక్టు స్వరూపాన్ని మార్చారని, ప్రాజెక్టు ముంపుపై కనీస ముంపుపై కనీస అధ్యయనం కూడా చేయలేదని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టుపై తమకెలాంటి అభ్యంతరాలు లేవని కానీ మణుగూరు ప్లాంట్, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలో కోరింది. పోలవరం ప్రాజెక్టు యధావిధిగా కొనసాగుతుందని, ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేవని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. వీరి వాదనలు విన్న సుప్రీంకోర్టు ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. కాగా రెండు వారాల్లోగా పోలవరం నిర్మాణానికి సంబంధించిన సమాచారం అందజేస్తామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ తరపు న్యాయవాది పేర్కొన్నారు. అనంతరం కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. -
మాల్యా లేకుండా విచారించలేం!
కేంద్రానికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను తమ ముందు ఎప్పుడు హాజరుపరిస్తే అప్పుడే కేసు విచారణ జరపుతామని సుప్రీంకోర్టు కేంద్రానికి తేల్చి చెప్పింది. అప్పటివరకు ముందుకెళ్లలేమని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. తమ ముందు ఎప్పుడు ప్రవేశ పెడతారో చెప్పాలని ఆదేశించింది. మాల్యా అప్పగింతకు సంబంధిం చి లండన్‌లో సంప్రదిం పులు జరుగుతున్నా యని, కేంద్ర ప్రభుత్వం కూడా అతడిని అత్యున్నత న్యాయస్థానం ముందుంచడానికి ప్రయత్నిస్తున్నదని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ ఇచ్చిన వివరణను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ఈ సందర్భంగా కేంద్రం తరుఫున దాఖలు చేసిన ‘స్టేటస్ రిపోర్టు’ను ఏజీ కోర్టు ముందుంచగా... ‘మాల్యా లేకుండా వీటిని మేము విశ్లేషించలేము. మీరు అతన్ని హాజరు పరచాలి. అప్పుడే విచారణ కొనసాగించ గలం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాపై ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్షార్షియం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సమయంలో ఈ నెల 10 లోపు తమ ముందు హాజరవ్వాలని మాల్యాకు నోటీసులిచ్చింది. కాగా, రూ.9వేల కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకులను ముంచేసిన మాల్యాను తమకు అప్పగించాలని ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ కోరిన విషయం తెలిసిందే. -
ఆ మహిళ టీవీ స్టార్లా ప్రవర్తించింది
ఇటుకతో దాడి వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్య ఆమె ఒక్కో చానల్లో ఒక్కోలా మాట్లాడారు ఆగస్టు 5లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా ఢిల్లీ సర్కారు, పోలీసులకు ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో సోమవారం ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ చంద్రపైకి ఇటుక విసిరిన వ్యవహారంలో ఆ మహిళ టీవీ స్టార్ వలె ప్రవర్తించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దాడికి గురైన మహిళ ఒక్కో టీవీ చానెల్లో ఒక్కో విధంగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. మహిళపై హెడ్ కానిస్టేబుల్ దాడి కేసును ఢిల్లీ హైకోర్టు బుధవారం తనంతట తానుగా విచారణకు స్వీకరించింది. నగరంలో పెరుగుతున్న రోడ్‌రేజ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం ప్రజలు కూడా తమ బాధ్యతను అర్థం చేసుకొని, వాటిని నెరవేర్చాలని అభిప్రాయపడింది. ఈ కేసుపై ఆగస్టు 5 లోగా స్టేటస్ రిపోర్టు సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఢిల్లీ సర్కారును, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో నిందితుడైన హెడ్ కానిస్టేబుల్‌ను ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించారు. అతను ప్రస్తుతం 14 రోజుల న్యాయ నిర్భంధంలో ఉన్నాడు. ప్రచారంలోకి మరో ఆడియో రికార్డింగ్: ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి గతంలో ప్రచారంలోకి వచ్చిన ఓ వీడియో రికార్డింగుకు తోడుగా ఇప్పుడో ఆడియో రికార్డింగ్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆడియో రికార్డింగులో మహిళ పోలీసు కానిస్టేబుల్‌ను దుర్భాషలాడడం, లెసైన్స్ చూపించడానికి నిరాకరించడం, చలాన్ రుసుమును కానిస్టేబుల్ చేతికి ఇవ్వబోనని, పోలీసు కానిస్టేబుల్ మహిళను కోర్టు చలాన్ విధిస్తానని చెప్పడం, చిన్న పిల్ల ఏడుపు మొదలైనవి రికార్డయ్యాయి. ఈ రికార్డింగు మహిళ గతంలో చెప్పిన మాటలకు కొంత భిన్నంగా ఉండడంతో మహిళ ఆరోపణలపై అనుమానాలు తలెత్తాయి. ఆడియో క్లిప్‌లో రూ. 200 లంచం అడిగినట్లు వినిపించలేదు. కానీ ఇది లంచం అడిగిన తరువాత చేసిన రికార్డింగ్ అని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.