ఇటుకతో దాడి వ్యవహారంపై హైకోర్టు వ్యాఖ్య
ఆమె ఒక్కో చానల్‌లో ఒక్కోలా మాట్లాడారు
ఆగస్టు 5లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాల్సిందిగా
ఢిల్లీ సర్కారు, పోలీసులకు ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: గోల్ఫ్ లింక్స్ ప్రాంతంలో సోమవారం ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ సతీష్ చంద్రపైకి ఇటుక విసిరిన వ్యవహారంలో ఆ మహిళ టీవీ స్టార్ వలె ప్రవర్తించారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దాడికి గురైన మహిళ ఒక్కో టీవీ చానెల్‌లో ఒక్కో విధంగా మాట్లాడారని అభిప్రాయపడ్డారు. మహిళపై హెడ్ కానిస్టేబుల్ దాడి కేసును ఢిల్లీ హైకోర్టు బుధవారం తనంతట తానుగా విచారణకు స్వీకరించింది. నగరంలో పెరుగుతున్న రోడ్‌రేజ్ కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన న్యాయస్థానం ప్రజలు కూడా తమ బాధ్యతను అర్థం చేసుకొని, వాటిని నెరవేర్చాలని అభిప్రాయపడింది. ఈ కేసుపై ఆగస్టు 5 లోగా స్టేటస్ రిపోర్టు సమర్పించాల్సిందిగా న్యాయస్థానం ఢిల్లీ సర్కారును, ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఈ కేసులో నిందితుడైన హెడ్ కానిస్టేబుల్‌ను ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఉద్యోగం నుంచి తొలగించారు. అతను ప్రస్తుతం 14 రోజుల న్యాయ నిర్భంధంలో ఉన్నాడు.
ప్రచారంలోకి మరో ఆడియో రికార్డింగ్:
ఇదిలా ఉండగా ఈ కేసుకు సంబంధించి గతంలో ప్రచారంలోకి వచ్చిన ఓ వీడియో రికార్డింగుకు తోడుగా ఇప్పుడో ఆడియో రికార్డింగ్ ప్రచారంలోకి వచ్చింది. ఈ ఆడియో రికార్డింగులో మహిళ పోలీసు కానిస్టేబుల్‌ను దుర్భాషలాడడం, లెసైన్స్ చూపించడానికి నిరాకరించడం, చలాన్ రుసుమును కానిస్టేబుల్ చేతికి ఇవ్వబోనని, పోలీసు కానిస్టేబుల్ మహిళను కోర్టు చలాన్ విధిస్తానని చెప్పడం, చిన్న పిల్ల ఏడుపు మొదలైనవి రికార్డయ్యాయి. ఈ రికార్డింగు మహిళ గతంలో చెప్పిన మాటలకు కొంత భిన్నంగా ఉండడంతో మహిళ ఆరోపణలపై అనుమానాలు తలెత్తాయి. ఆడియో క్లిప్‌లో రూ. 200 లంచం అడిగినట్లు వినిపించలేదు. కానీ ఇది లంచం అడిగిన తరువాత చేసిన రికార్డింగ్ అని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆ మహిళ టీవీ స్టార్‌లా ప్రవర్తించింది
Published Thu, May 14 2015 12:06 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement