మాల్యా లేకుండా విచారించలేం!
కేంద్రానికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాను తమ ముందు ఎప్పుడు హాజరుపరిస్తే అప్పుడే కేసు విచారణ జరపుతామని సుప్రీంకోర్టు కేంద్రానికి తేల్చి చెప్పింది. అప్పటివరకు ముందుకెళ్లలేమని జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్‌ల ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. తమ ముందు ఎప్పుడు ప్రవేశ పెడతారో చెప్పాలని ఆదేశించింది. మాల్యా అప్పగింతకు సంబంధిం చి లండన్‌లో సంప్రదిం పులు జరుగుతున్నా యని, కేంద్ర ప్రభుత్వం కూడా అతడిని అత్యున్నత న్యాయస్థానం ముందుంచడానికి ప్రయత్నిస్తున్నదని అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్ ఇచ్చిన వివరణను ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
ఈ సందర్భంగా కేంద్రం తరుఫున దాఖలు చేసిన ‘స్టేటస్ రిపోర్టు’ను ఏజీ కోర్టు ముందుంచగా... ‘మాల్యా లేకుండా వీటిని మేము విశ్లేషించలేము. మీరు అతన్ని హాజరు పరచాలి. అప్పుడే విచారణ కొనసాగించ గలం’అని ధర్మాసనం స్పష్టం చేసింది. భారీగా రుణాలు తీసుకుని ఎగ్గొట్టి ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాపై ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్షార్షియం వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గత విచారణ సమయంలో ఈ నెల 10 లోపు తమ ముందు హాజరవ్వాలని మాల్యాకు నోటీసులిచ్చింది. కాగా, రూ.9వేల కోట్ల రుణాలు తీసుకుని బ్యాంకులను ముంచేసిన మాల్యాను తమకు అప్పగించాలని ఇటీవలే బ్రిటన్ ప్రభుత్వాన్ని భారత్ కోరిన విషయం తెలిసిందే.