
డ్రగ్ డీలర్లను హత్య చేయిస్తున్నదెవరు?
ఫిలిప్పీన్స్ ప్రజలకు నిక్ నేమ్‌లు సర్వ సాధారణం. కొందరిని చిన్నప్పటి నుంచే నిక్ నేమ్‌లతో పిలిచే అలవాటుండగా, కొందరికి యవ్వనంలో వారు చేసే పనులను బట్టి నిక్ నేమ్‌లు వస్తాయి. అలాగే ఫిలిప్పీన్స్ జాతీయ పోలీస్ చీఫ్ రొనాల్డ్ డెలా రోసాను కూడా 'బాటో' అనే నిక్‌నేమ్‌తోనే అక్కడి పోలీసులు, ప్రజలు పిలుస్తున్నారు. బాటో అంటే వారి భాషలో రాయి అని అర్థం. అంటే రాయిలాగా చెక్కు చెదరని వ్యక్తి లేదా బండ అని కూడా అర్థం చేసుకోవచ్చు.
ఇంతకు చెప్పేది ఏమిటంటే.. డ్రగ్ మాఫియాపై తెరవెనక నుంచి తూటాల వర్షం కురిపిస్తున్నది ఈ 'బాటో'యేనట. 'చట్టాలను చేతుల్లోకి తీసుకోండి.. డ్రగ్ డీలర్లు కనిపిస్తే కాల్చేయండి!' అంటూ వివాదాస్పద పిలుపునిచ్చిన ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీకి ఈ బాటో చాలా దగ్గరివారు. డ్రగ్ మాఫియాను సమూలంగా నాశనం చేయడమే తన లక్ష్యమని బాటో చెబుతున్నారు. తాను మాజీ మిలటరీ వ్యక్తినని, ఫిలిప్పీన్స్ మిలటరీ అకాడమీ నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్నానని, తన శరీరం గట్టిగా రాయిలా ఉండటంతో పైఅధికారులు తనను బాటో అని పిలిచేవారని, అప్పటినుంచి ఆపేరు నిక్‌నేమ్‌గా నిలిచిపోయిందని పోలీసు చీఫ్ మీడియాకు తెలిపారు. గుండ్రంగా తళతళలాడే బట్టతలతో విశాలమైన ఛాతీతో దిట్టంగా రాయిలాగా కనిపిస్తారు బాటో. తన జన్మస్థలం కూడా బారంగే బాటో అంటూ నవ్వారు.
దేశాధ్యక్షుడు డూటర్టీకి తాను మూడు దశాబ్దాల నుంచి చాలా సన్నిహితుడనని, తమ ఇద్దరి మధ్య నేరుగా మాట్లాడుకునేందుకు ప్రత్యేక టెలిఫోన్ కనెక్షన్ కూడా ఉందని, తాము ఒకరికొకరు విశ్వాసపాత్రలమని బాటో తెలిపారు. 'నా సామర్ధ్యం ఏమిటో ఆయనకు తెలుసు. ఆయనకు ఏంచేసి పెట్టాలో నాకు తెలుసు. మేము మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. టెలిపతి ద్వారా ఆయన ఆలోచనలు నాకు తెలుస్తాయి. నా ఆలోచనలు ఆయనకు తెలుస్తాయి. ప్రపంచంలో ఇంతవరకు ఆయనంత గొప్ప అధ్యక్షుడిని నేను చూడలేదు' అని బాటో వ్యాఖ్యానించారు.
డూటర్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 300 మందికి పైగా డ్రగ్ సరఫరాదారులను వీధుల్లో కాల్చి చంపడం పట్ల ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక నుంచి ఈ హత్యలు చేయిస్తున్న పోలీసు పాత్రధారి ఎవరని అంతా వెతకడం మొదలుపెట్టారు. దాంతో బాటోకు ప్రాధాన్యం పెరిగింది. ఈ ఎన్‌కౌంటర్లను అమెరికా అధికారులు ప్రశ్నించినందుకే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను డూటర్టీ బండబూతులు తిట్టిన విషయం తెల్సిందే.