
ఒబామా వ్యక్తిగత ఈ మెయిల్స్ లీక్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమాబా వ్యక్తిగత ఈ-మెయిల్స్ను వీకీలీక్స్ బయటపెట్టింది. ఆయన వ్యక్తిగత ఈమెయిల్ అడ్రస్ నుంచి పంపిన సందేశాన్ని వీకీలీక్స్ బహిర్గతం చేసింది. రహస్య చిరునామా ద్వారా ఒబామా పంపిన మెయిల్స్ లో కొన్నింటిని తొలి విడతగా బయటపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయాలను వీకీలీక్స్ ట్విట్టర్ లో పేర్కొంది. కాగా bobama@ameritech.net నుంచి ఒబామా పంపిన ఏడు సందేశాలను వీకీలీక్స్ తన వెబ్ సైట్లో ప్రచురించిందంటూ న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
వీటిలో జి-20 సమావేశాలకు వెళ్లొద్దంటూ 2008 ఎన్నికల సందర్భంగా ఒబామా బృందంలోని జాన్ పొడెస్టా పంపిన మెయిల్ కూడా ఉంది. 2008 నవంబర్ 4న పొడెస్టా ఈ మెయిల్ పంపించారు. ఇప్పటికే హిల్లరీ క్లింటన్ ఈ మెయిళ్ల వ్యవహారంతో డెమోక్రటిక్ పార్టీకి తల బొప్పి కడుతోంది. ఇప్పుడు ఏకంగా ఒబామాకు సంబంధించి ఈ మెయిల్స్ బహిర్గతం కావడంతో డెమోక్రాట్లు ఆందోళనకు గురవుతున్నారు.
పొడెస్టా ప్రస్తుతం హిల్లరీ ప్రచార బృందం సారధిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు చెందిన దాదాపు 23 వేల ఈమెయిల్స్ అపహరణకు గురయ్యాయి. వీటిల్లో ఒబమాకు పంపినవే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ మెయిల్స్ వ్యవహారం లీక్ అవ్వడం వెనుక రష్యా హస్తం ఉందేమోనని వైట్ హౌస్ అనుమానిస్తోంది.