లాస్ ఎంజెల్స్‌ని వణికిస్తున్న కార్చిచ్చు
వాషింగ్టన్: అమెరికాను ప్రకృతి వణికిస్తోంది. మొన్నటివరకూ హార్వీ హరికేన్ హూస్టన్ నగరాన్ని అతలాకుతలం చేస్తే.. తాజాగా లాస్ ఏంజెల్స్ అడవుల్లో కార్చిచ్చు విజృంభిస్తోంది. లాస్ ఏంజెల్స్ అడవుల్లో ఏర్పడ్డ ఈ కార్చిచ్చు.. అక్కడి చరిత్రలోనే అతి పెద్దదిగా పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. వేల సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలిస్తున్నారు.
కార్చిచ్చు వ్యాపించిన రెండు రోజుల్లోనే 8 వేల ఎకరాల అడవి అగ్ని ఆహుతి అయిందని అటవీశాఖ చెబుతోంది. ఇక్కడ వేడి తీవ్రత 100 డిగ్రీలుగా ఉంది. దీంతో అడవుల్లో ఉండే జంతువులు, పక్షలు, చెట్లు సైతం మాడిపోతున్నాయి. ప్రాణరక్షణ కోసం జంతువులు సురక్షిత ప్రాంతాల్లోకి పరుగులు తీస్తున్నాయి. కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారులు సైతం వేడికి తట్టుకోలేక పగిలిపోతున్నాయి. మంటలను అదుపు చేసేందుకు వందల సంఖ్యలో హెలికాప్టర్లు ప్రయత్నిస్తున్నాయి.