ట్రంప్-కిమ్ జోంగ్ ఉన్
సాక్షి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య తిట్లు, శాపనార్ధాలతో ఏడాదిగా సాగిన ‘బంధం’ త్వరలో వారిద్దరి శిగరాగ్ర సమావేశంతో ఎలా మారుతుంది? అనే ప్రశ్న ఎన్నెన్నో ఊహాగానాలకు అవకాశమిస్తోంది. బుల్లి రాకెట్ మనిషి అని తనను ట్రంప్ అంటే, బుర్ర పనిచేయని మదుసలి అని ట్రంప్‌ను కిమ్ నిందించిన చరిత్ర ఇప్పటిదే. ట్విటర్ ద్వారా ఒకరినొకరు తిట్టుకుంటూ ప్రపంచానికి వినోదం పంచారు. ఈ నేపథ్యంలో వారిద్దరూ వేసవిలో జరిపే భేటీ తన ఘనతేనని ట్రంప్ భావిస్తుంటే, కిమ్ తన తొలి ప్రతిపాదనతోనే ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతోందని సంబరపడుతున్నారు. కిమ్ ప్రతిపాదనను ట్రంప్ ముందుంచిన దక్షిణ కొరియా తన ‘మధ్యవర్తిత్వం’ వల్లే ఇద్దరు పొగరుబోతు నేతల మధ్య సమావేశం సాధ్యమైందని అనుకుంటోంది.
1950-53 మధ్య జరిగిన కొరియా యుద్ధం ముగిసినాగాని సాంకేతికంగా ఇంకా ఆగలేదు. దశాబ్దాలుగా ఉద్రిక్తత కొరియా ద్వీపకల్పాన్ని పీడిస్తోంది. చైనా వంటి కొన్ని మిత్ర దేశాలు మినహా ఇతర ప్రపంచంతో సంబంధం లేని ఉత్తర కొరియాను ‘ఏకాకి’గా భావిస్తారు. అణ్వాయుధాల తయారీనే ఆత్మరక్షణకు మార్గంగా ఎంచుకున్న ఉత్తర కొరియా భద్రతకు హామీ ఇచ్చి, దాని దారి నుంచి మళ్లించడానికి ఉపకరిస్తే ఈ సమావేశం విజయవంతమైందని పరిగణించవచ్చు. అయితే, ఈ శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు వెనుక చెప్పుకోదగ్గ కృషి లేకపోవడంతో అది సత్ఫలితాలిస్తందనే ఆశ పెద్దగా లేదు.
అణ్వాయుధాల తొలగింపే లక్ష్యం!
కొరియా ద్వీపకల్పం నుంచి అణ్యాయుధాలు పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని అమెరికా, ఉత్తర కొరియా అగ్రనేతలు చెబుతున్నారు. కిమ్ ఏకపక్షంగా ట్రంప్ చెప్పినట్టు నిరాయుధీకరణ అమలు చేయాలని అమెరికా కోరుతోంది. అమెరికా తన శత్రు వైఖరి విడనాడాలని, దక్షిణ కొరియాను అణ్వాయుధాల దాడి నుంచి కాపాడడానికి అగ్రరాజ్యం ఏర్పాటు చేసిన అణ్వాయుధ నిరోధక గొడుగును తొలగించాలని ఉత్తర కొరియా డిమాండ్ చేస్తోంది. ఇదంతా జరిగేది సమీప భవిష్యత్తులో ఈ భేటీలో సాధ్యమైతేనే. ట్రంప్‌తో భేటీకి కిమ్ లిఖితపూర్వకంగా ఆహ్వానం పంపలేదని తెలుస్తోంది. సోమవారం ఉత్తర కొరియా రాజధానిలో కిమ్‌ను కలిసిన దక్షిణ కొరియా జాతీయ భద్రతా డైరెక్టర్ చుంగ్ యూ-యాంగ్ చర్చల ఫలితంగా ఇద్దరు నేతల సమావేశంపై ప్రతిపాదన ముందుకు సాగింది. ట్రంప్‌తో జరిపే సమావేశం నుంచి తాను ఏమి ఆశిస్తున్నదీ కిమ్ వెల్లడించలేదు. మరో పక్క ట్రంప్ కూడా కొన్ని షరతులు పెడుతున్నారు. భేటీ సమయంలో కిమ్ క్షిపణి పరీక్షలు జరపకూడదనీ, ఈ భేటీలో ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే ఉత్తర కొరియాపై ఆంక్షలు తొలగిస్తామని ట్రంప్ తెగేసి చెప్పారు.
మొండి ఘటాల మీటింగ్ ఎక్కడ? ఎలా?
ట్రంప్-కిమ్ తొలి సమావేశంలో ఏం మాట్లాడతారనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. భేటీకి సమయం, వేదిక నిర్ణయించలేదని వైట్‌హౌస్ ప్రకటించింది. 1972లో బీజింగ్‌లో చైనా నేత మావో జెడాంగ్, అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ సమావేశం, 1985లో జెనీవాలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్, సోవియెట్ యూనియన్ నేత మిహాయిల్ గోర్బోచేవ్ జరిపిన శిఖరాగ్ర భేటీతో ట్రంప్-కిమ్ తొలి సమావేశాన్ని పోల్చడం విశేషం. ఇద్దరు దుందుడుకు నేతల భేటీ నిర్వహించడానికి అవసరమైన అధ్యయనం, సామర్ధ్యం ట్రంప్ సర్కారుకు ఉన్నాయా? అనేది కీలక ప్రశ్న. ట్రంప్ పోకడలు నచ్చని అనుభవజ్ఞులైన కొరియా నిపుణులు వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయారు. అమెరికా విదేశాంగ శాఖతో సంబంధం లేకుండా ఇంతటి కీలక భేటీపై చర్చలు, ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆఫ్రికా పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిలర్సన్కి ట్రంప్-కిమ్ సమావేశం గురించి చెప్పినట్టు కూడా కనిపించడం లేదు. ఉత్తర కొరియాతో సంప్రదింపులకు ఇప్పట్లో అవకాశం లేదని గురువారం ఆయన అన్నారంటే ఆయన పరిస్థితిని అర్ధంచేసుకోవచ్చు.
రియల్ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీలకు దారితీసే ఒప్పందాలు చేసుకోవడం ట్రంప్‌కు నల్లేరు మీద నడకలా సాగింది. ఈ అనుభవంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో కిమ్ విషయంలో కూడా ఆయన ఎవరినీ సంప్రదించకుండా ముందుకు సాగుతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అనేక రియల్ఎస్టేట్ ఒప్పందాలు వికటించి ఆయన కంపెనీలు ఖాయిలా పడినన సందర్భాలున్నాయనే విషయం మరిచిపోకూడదని కూడా వారు హెచ్చరిస్తున్నారు. 2011లో అధికారంలోకి వచ్చిన కిమ్ ట్రంప్ అధ్యక్షునిగా ఎన్నికైనప్పటి నుంచి క్షిపణి, అణు పరీక్షలతో అమెరికాను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే అణ్వాయుధాలున్నాయంటూ బెదిరిస్తున్నారు. ఇదంతా చివరికి అమెరికా అధినేతతో సమావేశమై అగ్రరాజ్యం నుంచి రాయితీలు సాధించడానికేనని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి లక్ష్యం నెరవేరుతుందో మే నెలలో జరిగే శిఖరాగ్ర సమావేశం నిర్ణయిస్తుంది. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment