మహిళలకు స్వర్గధామంగా మారుస్తా
మహిళలు అమెరికాలో ఎంచక్కా పనిచేసుకోవచ్చని, ఇంతకుముందెన్నడూ లేనంతగా మహిళలకు అమెరికాను స్వర్గధామంగా మారుస్తానని ఆ దేశా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. భారతీయ అమెరికన్లయిన నిక్కీ హేలీ, సీమా వర్మలతో సహా తన మహిళా సహచరులందరినీ పొగడ్తలలో ముంచెత్తారు. మహిళా సాధికారతపై వైట్‌హౌస్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా ఉన్న నిక్కీ హేలీ అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఒబామా యంత్రాంగంలో కీలకమైన ఆరోగ్యశాఖను నిర్వహిస్తున్న భారతీయ అమెరికన్ సీమా వర్మ, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తదితరులు కూడా ఈ చర్చాకార్యక్రమంలో పాల్గొన్నారు. తన కేబినెట్‌లో చాలా అద్భుతమైన మహిళా నాయకులు ఉన్నారని ట్రంప్ ఈ సందర్భంగా అన్నారు. అడ్మినిస్ట్రేటర్ లిండా మెక్‌మహాన్ చాలాకాలంగా తనకు మంచి స్నేహితురాలని, ఆమె వ్యాపారంలో అద్భుతాలు సృష్టించారని చెప్పారు. అలాగే సీమావర్మ, బెస్టీ డీవాస్.. ఇలా అందరినీ ప్రశంసలలో ముంచెత్తారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థలో మహిళలు పనిచేయడానికి, విజయాలు సాధించడానికి, ఇంతకు ముందెన్నడూ లేనంత ఎత్తుకు ఎదగడానికి వీలుగా తన యంత్రాంగం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. ఇదే సమయంలో తల్లులు, కుటుంబాలు తమ పిల్లల సంరక్షణకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా చేస్తామన్నారు. అమెరికాలో ప్రతి కూతురూ తనను తాను నమ్ముకునేలా, తన భవిష్యత్తు మీద నమ్మకం కలిగి ఉండేలా, తన మనసు చెప్పినట్లు వింటూ తన కలలను వాస్తవం చేసుకునేలా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.