ప్రతి వ్యక్తి జీవితంలో గెలుపు, ఓటములు తప్పనిసరి. అయితే కొందరిని ఓటమి ఎక్కువ కాలం పీడిస్తుంది. ఈ సమయంలో అలాంటివారిని చూసి ఇతరులు ఇక వారి పనైపోయిందనుకుంటారు. కానీ అలాంటి సమయంలోనే కొందరు ఓర్పుగా మరిన్ని ప్రయత్నాలు చేసి విజయాల బాట పడతారు. ఇలాంటివారు చరిత్రలో చాలా మంది కనిపిస్తారు. జీవితంలో ఆటుపోట్లు చవిచూసినప్పటికీ తిరిగి విజయాన్ని అందుకున్నవారి గురించి తెలుసుకుందాం..
వాల్ట్ డిస్నీ..
ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద అమ్యూజ్‌మెంట్ పార్కు అయిన డిస్నీల్యాండ్, సినీ నిర్మాణ సంస్థ డిస్నీ సహా అనేక కంపెనీలను స్థాపించింది వాల్ట్ డిస్నీ. ఈయన కూడా ప్రారంభంలో అనేక అపజయాలను ఎదుర్కొన్నాడు. పద్దెనిమిదేళ్ల వయసులో ఓ న్యూస్ పేపర్‌లో కార్టూనిస్టుగా పనిచేస్తుండేవాడు. అయితే కార్టూన్ల విషయంలో సరిగ్గా పనిచేయడం లేదని, సృజనాత్మకత లోపించిందని ఎడిటర్ డిస్నీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరుసటి ఏడాది డిస్నీ ఆ ఉద్యోగం మానేసి ఓ సంస్థను స్థాపించాడు. సరైన ఆదాయం లేదని దాన్ని కూడా వదిలేసి మరో సంస్థలో చేరాడు. తర్వాత ఓ సొంత స్టూడియో స్థాపించాడు. అది కొంతకాలం విజయవంతంగా సాగినా చివరకు దివాళా తీసింది. ఇలా ఏ వ్యాపారం సరిగ్గా సాగకపోయేసరికి ఓ హాలీవుడ్ స్టూడియో స్థాపించాడు.
ఇక్కడే ఓస్వాల్డ్ అనే లక్కీ ర్యాబిట్ క్యారెక్టర్‌ను సృష్టించాడు. ఈ సందర్భంగా తన నిర్మాతలు ఆ పాత్రను దొంగిలించి, డిస్నీతో పనిచేసే సిబ్బందిని సైతం లాగేసుకున్నాడు. అయినప్పటికీ తన దగ్గర మిగిలిన కొద్దిమంది సిబ్బందితోనే పనిచేసి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మిక్కీమౌస్ క్యారెక్టర్‌ను సృష్టించాడు. అది విజయవంతమవడంతో అప్పటినుంచి డిస్నీల్యాండ్ నిర్మాణం, ఇతర సంస్థల స్థాపన నిరాటంకంగా కొనసాగింది. మొదట ఏ వ్యాపారమూ కలిసి రాకున్నా చివరకు అంతర్జాతీయ స్థాయి డిస్నీల్యాండ్‌ను నిర్మించి చరిత్రలో నిలిచాడు వాల్ట్ డిస్నీ.
క్రిస్ గార్డెనర్..
అమెరికాలో పెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరిగా కొనసాగుతున్న క్రిస్ గార్డెనర్ బాల్యం నుంచి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి మరో వివాహం చేసుకుంది. అయితే సవతి తండ్రి క్రిస్ తల్లిని, క్రిస్‌ను, అతడి సోదరులను హింసించేవాడు. పైగా క్రిస్ తల్లిపై సవతి తండ్రి అనేక ఆరోపణలు చేయడంతో ఆమె పలుమార్లు అక్రమంగా జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అటు తల్లి జైలు పాలవడం, పెంపుడు తండ్రి పట్టించుకోకపోవడంతో క్రిస్, అతడి తోబుట్టువుల ఆలనాపాలనా చూసే దిక్కు లేకుండా పోయింది. దీంతో క్రిస్ ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు వేరే వారి ఇంట్లో ఆశ్రయం పొందాడు. ఆ తర్వాత పెద్దయ్యాక వైవాహిక జీవితం కూడా ఆటుపోట్లకు గురైంది. అతడు మెడికల్ రంగంలో సేల్స్‌మెన్‌గా పనిచేయడంతో విబేధాలొచ్చి భార్య నుంచి విడిపోవాల్సి వచ్చింది. చివరకు ఏ దిక్కూ లేకుండా పోయిన క్రిస్ చిన్నచిన్న హొటళ్లు, పార్కులు, ఎయిర్‌పోర్టులు, పబ్లిక్ టాయ్‌లెట్లలో తలదాచుకోవాల్సి వచ్చింది.
తర్వాత పొద్దంతా ఓ బ్రోకరేజ్ సంస్థలో పనిచేస్తుండేవాడు. రాత్రిపూట ఓ ఇంటి చూరు కింద నిద్రపోయేందుకు పెద్ద క్యూలో నిలబడేవాడు. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న క్రిస్ 1892లో డీన్ రైటర్ అనే బ్రోకరేజ్ సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగిగా చేరాడు. అనంతరం 1987లో గార్డెనర్ రిచ్ అండ్ కో అనే సంస్థను స్థాపించాడు. 2006లో తనకు ఆ సంస్థలో ఉన్న వాటాలో కొద్దిశాతం అమ్మడం ద్వారా క్రిస్ వందల కోట్ల రూపాయలు ఆర్జించాడు. ప్రస్తుతం ఈ సంస్థకు శాన్‌ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, చికాగోల్లో కార్యాలయాలున్నాయి. ఆయన జీవిత కథతో హాలీవుడ్‌లో సినిమా కూడా రూపొందింది.
స్టీవెన్ స్పీల్‌బర్గ్..
జురాసిక్ పార్క్, ఇండియానా జోన్స్ వంటి ప్రపంచవ్యాప్తంగా హిట్టైన సినిమాల్ని రూపొందించిన దర్శకడు స్టీవెన్ స్పీల్‌బర్గ్. సినిమా చరిత్రలోనే అద్భుతమైన సినిమాల్ని రూపొందించిన స్పీల్‌బర్గ్ విద్యార్థి దశలో యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో సినిమాకు సంబంధించిన ఓ కోర్సు చేయాలనుకున్నాడు. కానీ అతడికి అన్నింట్లోనూ సీ గ్రేడ్ మార్కులే ఉండడంతో యూనివర్సిటీలో సీటు లభించలేదు. ఇలా మొత్తం మూడుసార్లు యూనివర్సిటీ స్పీల్‌బర్గ్ అప్లికేషన్‌ను తిరస్కరించింది.
తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో చేరాల్సి వచ్చింది. స్టూడెంట్‌గా ఉండగానే ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ హాలీవుడ్ స్టూడియోతో పనిచేసే అవకాశం వచ్చింది. అనంతరం షార్ట్‌ఫిల్ములు రూపొందించి తన సత్తా చాటాడు. దీంతో హాలీవుడ్ స్టూడియోస్ స్పీల్‌బర్గ్‌తో సినిమాలు రూపొందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అలా ఓ విద్యార్థిగానే తిరస్కరణకు గురైన అతడు నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందే చిత్రాలను రూపొందిస్తున్నాడు.
బ్రియాన్ ఆక్టన్..
యాహూ, ఆపిల్ వంటి దిగ్గజ సంస్థల్లో దశాబ్ద కాలంపైగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం బ్రియాన్ ఆక్టన్ సొంతం. అయితే 2009లో ఉద్యోగం కోల్పోయాడు. ఆ సమయంలో అతడికి మరెక్కడా ఉద్యోగం లభించలేదు. చివరకు అప్పుడే ప్రారంభమైన ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు కూడా బ్రియాన్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. చివరకు అతడ్ని తీసుకునేందుకు ఏ కంపెనీ ఆసక్తి చూపకపోవడంతో తన మాజీ సహోద్యోగులైన ఆలమ్, జాన్‌కోమ్, బ్లిట్‌లతో కలిసి క్లౌడ్ మెసేజింగ్ సంస్థను స్థాపించాడు. అలా అన్నిచోట్లా తిరస్కరణకు గురవ్వడం వల్ల స్థాపనకు దారితీసిన ఆ కంపెనీ ఇప్పుడు ప్రపంచాన్ని ఏలుతోంది. అదే వాట్సాప్. చివరకు బ్రియాన్‌కు ఉద్యోగం ఇవ్వకుండా తిరస్కరించిన ఫేస్‌బుక్ సంస్థే కొంతకాలం తర్వాత బ్రియాన్ ఆధ్వర్యంలో స్థాపించిన వాట్సాప్‌ను 2014లో కొనుగోలు చేసింది. ఉద్యోగం కూడా ఇవ్వని సంస్థే అతడు స్థాపించిన సంస్థను కొనుగోలు చేసేలా చేయగలగడం విశేషం.
ఎదురుదెబ్బలను దాటుకుని..
Published Sat, Apr 9 2016 11:44 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement
Advertisement