
పెంపుడు కుక్కలతో లిజ్ గ్రూ
లండన్ : పెంపుడు కుక్కల కోసం కట్టుకున్న భర్తను తృణప్రాయంగా వదిలేసిందో భార్య. 25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని కాదని భర్తని విడిచి పెంపుడు కుక్కలతో ఇంటి బయటకు నడిచింది. ఈ సంఘటన బ్రిటన్‌లోని సఫోక్ కౌంటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సఫోక్ కౌంటీకి చెందిన లిజ్ గ్రూ(45) మైక్ అస్లామ్(53) భార్యాభర్తలు వీరికి 21 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. లిజ్ గ్రూకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే అమితమైన ప్రేమ. అందుకే పెళ్లైన తర్వాత కూడా ఇంటిని మొత్తం మూగజీవాలతో నింపేసింది. ఇంటిని మొత్తం కుక్కలు ఆక్రమించేయడంతో భర్త మైక్‌కు కోపం వచ్చింది. ఈ విషయమై ఇరువురికి తరుచూ గొడవలు జరిగేవి.
కుక్కలను ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఆమె ససేమీరా అనటంతో మైక్ తీవ్రంగా కోపగించాడు. కుక్కలు కావాలో తాను కావాలో నిర్ణయించుకోమని తేల్చిచెప్పాడు. లిజ్ మాత్రం 25 ఏళ్ల దాంపత్య జీవితం కంటే పెంపుడు కుక్కలే ముఖ్యమని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడామె వద్ద మొత్తం 30 కుక్కలు ఉన్నాయి. వాటిలో 5 కుక్కలకు చెవుడు కాగా మరో రెండు కుక్కలకు ఒక కన్ను మాత్రమే ఉంది. వాటిలో మిగిలినవి వేటకుక్కలు వీటిలో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి.
లిజ్ గ్రూ మాట్లాడుతూ.. తన తండ్రికి జంతువుల ఆహారం తయారుచేసే వ్యాపారం ఉండేదని, చిన్నప్పటి నుంచి కుక్కల మధ్యే ఎక్కువగా తన జీవితాన్ని గడిపానంది. ఈ మధ్యే కుక్కల సంరక్షణ కోసం ‘‘బెడ్‌ఫర్ బుల్లీస్’’ అనే స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేసానంది. భర్త తన పనిలో బిజీ ఉండటం వల్ల ఒంటరిగా ఉన్న తాను కుక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టినట్లు తెలిపింది. పెళ్లైన నాటి నుంచి భర్త మైక్‌కు తానేంటో తెలుసని, మరి ఎందుకు ఇలా అన్నాడో తెలియదని వాపోయింది. కుక్కల పెంపకం అన్నది టైం పాస్ కోసం చేసే పని కాదని, అంకిత భావంతో.. ప్రేమతో వాటిని చూసుకోవాలని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment