
టోక్యో : పుట్టినప్పుడు కేవలం 268 గ్రాముల బరువుతో పుట్టి ప్రపంచంలోని అతి చిన్న బాలుడిగా రికార్డుకెక్కిన చిన్నోడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అన్ని అవరోధాలను అధిగమించి 3,238 గ్రాముల మేర శరీర బరువును పెంచుకుని క్షేమంగా ఆసుపత్రినుంచి డిశ్చార్చ్ అయ్యి పిల్ల కాదు పిడుగు అని నిరూపించుకున్నాడు. ఈ చిన్నోడు పూర్తి ఆరోగ్యంతో గత బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని జపాన్ టైమ్స్ నివేదించింది.
టోక్యోలోని కీయో యూనివర్శిటీ సమాచారం ప్రకారం ప్రపంచంలోనే అతి చిన్నోడు గత ఏడాది ఆగస్టులో పుట్టాడు. తల్లి 24 వారాల గర్భంతో ఉన్న సమయంలో ఎలాంటి ఎదుగుదల లేకపోవడంతో సిజేరియన్ ఆపరేషన్ చేశారు. ఆ సమయంలో అతని బరువును గమనించిన వైద్యులు ఆ శిశువు బతికి బట్టకడతాడనే ఆశని దాదాపు వదిలేశారు. అయితే సుమారు 7 నెలల పాటు రకరకాల చికిత్సలు, ఆపరేషన్లు చేసి బాలుడిని ఎట్టకేలకు బతికించారు. 2009 జర్మనీలో 274 గ్రాముల బరువున్న శిశువు పుట్టి అప్పట్లో వాల్డ్ లోనే ‘అతి చిన్నోడి’ గా పాపులర్ అయిన బేబీ బాయ్ ఉదంతాన్ని ఈ లేటెస్ట్ ‘ చిన్నారి ‘ బ్రేక్ చేశాడు.
సాధారణంగా నెలలు నిండకుండా, తక్కువ బరువుతో పుట్టే శిశువుల్లో అవయవాలు సరిగ్గా ఏర్పడని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అంటు వ్యాధులు లాంటి సమస్యలతో బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని వైద్యులంటున్నారు. ఈ జపాన్ చిన్నోడు ఇప్పుడు హెల్దీగా ఉండడం సంతోషకరమని డాక్టర్లు అంటున్నారు. ఇది భవిష్యత్తు ఆశలను మరింత ఆశాజనకంగా ఉంచుంతోందని డా. తకేషు అరిమిత్సు పేర్కొన్నారు.
కాగా ప్రపంచంలో అత్యంత తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని ఐయోవా గుర్తిస్తుంది. జర్మనీలో 274 గ్రాముల బరువుతో ఒక బాలుడు జన్మించగా, జర్మనీలోనే 2015లో 252 గ్రాముల బరువుతో ఒక పాప పుట్టింది. ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 300 గ్రాముల లోపు బరువుతో పుట్టిన 23 శిశువులు క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఇందులో నలుగురు మాత్రమే అబ్బాయిలని ప్రకటించడం విశేషం.