ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్
జెరూసలెం: ప్రపంచమంతా సౌర విద్యుత్‌పై దృష్టిని కేంద్రీకరించాలని పర్యావరణ శాస్త్రవేత్తలు పిలుపునిస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ చేపట్టిన అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. పది లక్షల చదరపు మీటర్లలో 55 వేల సోలార్ ప్యానెళ్లను ఉపయోగించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇంజనీర్లు, కార్మికులు ఇప్పుడు తలమునకలై ఉన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 240 మీటర్ల ఎత్తుగల సోలార్ టవర్‌ను నిర్మిస్తున్నారు. ఇంత ఎత్తుగల సోలార్ టవర్‌ను నిర్మించడం ప్రపంచంలో ఇదే మొదటిసారని ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ‘జీఈ రెన్యువబుల్ ఎనర్జీ’ సంస్థ తెలియజేసింది.
దక్షిణ ఇజ్రాయెల్‌లోని అషేలిమ్ ప్రాంతానికి సమీపంలో నెగేవ్ ఎడారిలో ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అతి పెద్ద సోలార్ ప్యానెళ్లను ఉపయోగించడమే కాకుండా కేబుళ్లకు బదులుగా వైఫై నెట్‌వర్క్‌ను ఉపయోగించడం ఈ ప్రాజెక్ట్‌లో మరో విశేషం. భారీ క్రేన్ల సహాయంతో సోలార్ ప్యానెళ్లను అమరుస్తున్నారు. 2017 సంవత్సరం నాటికి ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని, 320 జీడబ్లూహెచ్ సామర్ధ్యంగల ఈ ప్రాజెక్ట్ ద్వారా 1,20,000 గృహాలకు సౌర విద్యుత్‌ను సరఫరా చేయవచ్చని ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లు తెలిపారు.