ఇది కుక్కా.. గుర్రమా?
ఖడ్గమృగంలా కనిపిస్తున్న ఈ పిట్‌బుల్ పేరు హల్క్, 17 నెలలకే 80 కిలోల బరువుండి గుర్రంలా ఎదుగుతూ ఇప్పటికే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కుక్కగా పేరు గడించింది. దీనికి హల్క్ కన్నా మంచి పేరు పెట్టగలమా? మార్వెల్ కామిక్స్ పబ్లికేషన్స్ ప్రచురిస్తున్న పుస్తకాల్లో కామిక్ సూపర్ హీరో పేరు హల్క్ గురించి పిల్లలకైతే కచ్చితంగా పరిచయం చేయక్కర్లేదు. కదనానికి కాలుదువ్వే పిట్‌బుల్‌ను వేట కోసం ఉపయోగిస్తారు తప్ప, సాధు జంతువులా సాధారణంగా ఎవరూ పెంచుకోరు. కానీ, న్యూహాంప్‌షైర్‌లోని మార్లాన్, లీసా గ్రెన్నన్ దంపతులు మాత్రం అలాగే పెంచుకుంటున్నారు. ఈ పిట్‌బుల్ తోకాడిస్తూ తమతో తిరగడమే కాకుండా తమ మూడేళ్ల పిల్లాడు జార్డన్‌ను గుర్రంలా ఎక్కించుకొని తిప్పుతోందని ఆ దంపతులు చెబుతున్నారు.
బుల్‌డాగ్, టెర్రియర్స్‌ను సంకరం చేయడం ద్వారా ఈ పిట్‌బుల్ జాతి కుక్కలు పుట్టుకొచ్చాయి. ఒకప్పుడు పలు దేశాల్లో వీటితో బుల్ ఫైట్ చేయించేవారు. అందుకోసమే వీటిని పెంచేవారు. బ్రిటన్‌లో ఈ ఫైట్‌ను ముందుగా నిషేధించారు. జంతుకారుణ్య సంస్థల కారణంగా కాలక్రమేణా పలు దేశాల్లో పిట్‌బుల్ ఫైట్లను నిషేధించారు. పిల్లాడిని ఆడించడం తప్ప మరే పనిలేని ఈ హల్క్ మాత్రం పూటకు మూడు, నాలుగు కిలోల ఎద్దు మాంసం తింటుందట. ఇంకా ఎదిగే వయస్సున్నందున ఇది ఇంకా ఎంత ఎత్తు ఎదుగుతుందో?