ఎనిమిదేళ్ల కింద ఎలాగో.. ఇప్పుడు అంతే: ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌నకు ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందనలు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ (డెమొక్రటిక్) ఓటమిపై వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడారు. అమెరికన్లంతా ఎప్పుడూ ఐక్యంగానే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. 'మనమంతా మొదట అమెరికన్లం, ఆ తర్వాతే పార్టీలు ముఖ్యం. తమ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఎన్నికల్లో ప్రచారం చేసిన తీరు సంతృప్తి కలిగించింది' అని ఒబామా పేర్కొన్నారు.
ట్రంప్, తనకు ఎలాంటి పోలికలు లేవని.. ఇద్దరం భిన్న తరహా వ్యక్తులం అని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఎనిమిదేళ్ల కిందట తాను మాజీ అధ్యక్షుడు బుష్ నుంచి ఏ విధంగా అధికారం స్వీకరించానో.. ప్రస్తుతం అదే తరహాలో ట్రంప్ బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. ఏ పార్టీ, ఏ వ్యక్తి గెలిచారన్నది ముఖ్యంకాదు.. ప్రతిరోజు సూర్యుడు ఉదయించక మానడు అన్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా తాజా ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే డోనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసి అధ్యక్షుడు ఒబామా అభినందించిన విషయం తెలిసిందే. గురువారం శ్వేత సౌదానికి రావాల్సిందిగా నూతన అధ్యక్షుడిని ఆహ్వానించారు. అధికార బదిలీకి సంబంధించిన అంశాలపై భేటీ అయి ఒబామా, ట్రంప్ చర్చించనున్నారు.