ఆదాయంపై ఎత్తు, బరువు ప్రభావం
లండన్ః పర్సనాలిటీని బట్టే ఫలితాలుంటాయంటున్నారు తాజా పరిశోధకులు. పొట్టిగా ఉన్న పురుషులు, లావుగా ఉన్న మహిళలపై సామాజిక, ఆర్థిక, విద్య, వృత్తి పరమైన ప్రభావాలు చూపుతాయంటున్నారు అధ్యయనకారులు. అంతేకాదు వారి ఆదాయంపై కూడా శరీరాకృతి ప్రభావం పడే అవకాశం ఉంటుందంటున్నారు.
కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగల్గుతారంటారు. దానికి వ్యక్తిత్వం, భావజాలం కూడా, ఓక్కోసారి సహకరిస్తుంటాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు తెలిపాయి. అయితే మాట తీరు మాత్రమే కాదు.. పొట్టి పొడుగులు, లావు సన్నాలు కూడా వారి సామాజిక జీవితంపై ప్రభావం చూపిస్తాయంటున్నాయి తాజా అధ్యయనాలు. ఒక వ్యక్తి సామాజిక, ఆర్థిక స్థితులతోపాటు... ముఖ్యంగా మహిళల శరీర ద్రవ్యరాశి సూచిక అనేక అంశాలు నిర్ణయించడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని చెప్తున్నారు బ్రిటన్ ఎక్సెటర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ తిమోతి ఫ్రేలింగ్. తమ అధ్యయనాలను బిఎంజె జర్నల్ లో నివేదించారు.
వ్యక్తి సామాజిక ఆర్థిక స్థితికి కారణభూతమౌతున్న బాడీమాస్ ఇండెక్స్ పాత్రను పరిశోధకులు పరీక్షించారు. బ్రిటన్ బయోబ్యాంక్ డేటాబేస్ లోని 40 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న సుమారు లక్షా ఇరవై వేలమంది జీవ సంబంధ సమాచారాన్ని సేకరించిన అధ్యయనకారులు... మెండెల్ ర్యాండమైజేషన్ గా పిలిచే సాంకేతికతను ఉపయోగించి వ్యక్తుల ఎత్తు, శరీర ద్రవ్యరాసి సూచికల ప్రభావాలు, జన్యు పరమైన వైవిధ్యాలను విశ్లేషించారు. పాఠశాల, డిగ్రీస్థాయి విద్య ముగిసిన సమయం, ఉద్యోగం, తరగతి, వార్షిక కుటుంబ ఆదాయం, సామాజిక లేమి వంటి ఐదు ప్రధానాంశాలతో పురుషులు, మహిళలపై విడివిడిగా పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా స్థూలకాయులైన మహిళలపై సామాజిక, ఆర్థిక ప్రభావం పడుతోందని, అదే పొడుగ్గా ఉండే పురుషులకు అనుకూలంగా ఉన్నట్లు పరిశోధనల్లో నిర్థారించారు.