ఢిల్లీ చాణక్యపురిలో మంచినీటి ట్యాంకు వద్ద కనిపించని భౌతిక దూరం
న్యూఢిల్లీ/ముంబై/ఇండోర్/అహ్మదాబాద్: దేశంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరణాలు, పాజిటివ్ కేసులకు అడ్డుకట్ట పడడం లేదు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కరోనాతో 32 మంది తుదిశ్వాస విడిచారు. రాజస్థాన్‌లో 8 మంది, మహారాష్ట్రలో ఏడుగురు, ఢిల్లీలో ఆరుగురు, మధ్యప్రదేశ్‌లో నలుగురు, పశ్చిమబెంగాల్‌లో ముగ్గురు, గుజరాత్‌లో ఇద్దరు, తమిళనాడులో ఒకరు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు చనిపోయారు. కొత్తగా 1,076 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటిదాకా మొత్తం మరణాల సంఖ్య 452కు, పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. దేశంలో యాక్టివ్ కరోనా కేసులు 11,616 కాగా, 1,766 మంది చికిత్సతో కోలుకున్నారు. భారత్‌లో 76 మంది విదేశీయులు కరోనా బారిన పడ్డారు.
వేతనం ఇవ్వలేదని రాళ్ల దాడి..
జీతాలు రాకపోవడంతో మహారాష్ట్రలో ఓ నిర్మాణ సంస్థకు చెందిన కార్మికులు ఆగ్రహానికి గురయ్యారు. తమ సంస్థ కార్యాలయంపై రాళ్లతో దాడి చేశారు. దీంతో నలుగురు పోలీసులు గాయపడ్డారు. షోలాపూర్ జిల్లా జునోనీ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
మహారాష్ట్రలో అత్యధిక మరణాలు
కరోనా సంబంధిత మరణాలు ఇప్పటిదాకా 452 కాగా, మహారాష్ట్రలోనే 194 మరణాలు చోటుచేసుకున్నాయి. మధ్యప్రదేశ్‌లో 57 మంది, ఢిల్లీలో 38 మంది, గుజరాత్‌లో 38 మంది, తమిళనాడులో 15 మంది, పంజాబ్‌లో 13 మంది, ఉత్తరప్రదేశ్‌లో 14 మంది, కర్ణాటకలో 13 మంది, రాజస్తాన్‌లో 11 మంది, పశ్చిమబెంగాల్‌లో 10 మంది మరణించారు. కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్రదే మొదటిస్థానం. ఈ రాష్ట్రంలో 3,205 కేసులు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఐసోలేషన్ క్యాంపు నుంచి పారిపోయిన వ్యక్తుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు కరోనా వైరస్ జన్యు పరివర్తనను డీకోడ్ చేశారు.
6.2 రోజుల్లో కేసులు రెట్టింపు
కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ సత్ఫలితాలు ఇస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెండింతలు కావడానికి లాక్‌డౌన్‌కు ముందు 3 రోజులు పట్టగా, ప్రస్తుతం 6.2 రోజులు పడుతోందని చెప్పారు. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ డబ్లింగ్ రేటు జాతీయ సగటు కంటే తక్కువగానే ఉందని తెలిపారు. కరోనా సోకినవారిలో 80 శాతం మంది కోలుకుంటున్నారని అన్నారు. ఐదు లక్షల ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టింగ్ కిట్లు గురువారం చైనా నుంచి వచ్చాయని చెప్పారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. మార్చి 15 నుంచి 31 వరకు దేశంలో కరోనా వృద్ధి రేటు 2.1 శాతం కాగా, ఏప్రిల్ 1వ తేదీ తర్వాత 1.2 శాతానికి పడిపోయిందని ఆరోగ్య శాఖ అధికారుల తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడంతోనే ఇది సాధ్యమైందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment