లక్నోలోని విద్యుత్ దహనవాటిక వద్ద కరోనా బాధితుల మృతదేహాలతో క్యూలో ఉన్న అంబులెన్సులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా రోజురోజుకీ ఉధృతరూపం దాలుస్తోంది. వరసగా మూడోరోజు లక్షకు పైగా కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటల్లో 1,31,968 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,30,60,542కి చేరుకుంది. ఇక ఒకే రోజు 780 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా మొత్త మరణాల సంఖ్య 1,67,642కి చేరుకున్నట్టు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల రోజులుగా వరసగా కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 9,79,608కి చేరుకుంది. మహారాష్ట్రలో అత్యధికంగా 56,286 కేసులు నమోదు కాగా, ఛత్తీస్‌గఢ్‌లో 10,652, ఉత్తరప్రదేశ్‌లో 8,474 కేసులు నమోదయ్యాయి.
వారియర్స్‌కి కరోనా కాటు
కరోనా వారియర్స్‌నీ ఆ మహమ్మారి వదలడం లేదు. దేశ రాజధానిలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో వారం రోజుల వ్యవధిలో 22 మంది డాక్టర్లు సహా 32 మంది కరోనా బారిన పడ్డారు. ఏప్రిల్ 1, 9 మధ్య కాలంలో వైద్యులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో 25శాతం మంది కరోనా టీకా రెండు డోసులు తీసుకున్నవారే. ఢిల్లీలో సర్ గంగా రామ్ ఆస్పత్రిలో 37 మంది వైద్యులకు కరోనా సోకిన మర్నాడే నిమ్స్ వైద్యులకూ కరోనా పాజిటివ్‌గా తేలింది.
మహారాష్ట్రలో లాక్‌డౌన్ తప్పదేమో
గత కొద్ది రోజులుగా 50 వేలకు పైగా కేసులతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితులు ముంచుకొస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బాధితులతో ఆస్పత్రుల్లో రద్దీ పెరిగిపోతూ ఉండడంతో ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల్ని పెంచడానికి రెండు నుంచి మూడు వారాలు లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ప్రభుత్వం ఎదుర్కోలేని పక్షంలో పూర్తి స్థాయి లాక్‌డౌన్ గురించి ఆలోచిస్తామన్నారు. కరోనా రోగులు పెరిగిపోయి, ఆస్పత్రుల్లో పడకలు చాలక, మందులు లేక పరిస్థితులు చెయ్యి దాటిపోతే అప్పుడు లాక్‌డౌన్ మినహా మార్గం లేదని అన్నారు.
ఒమర్ అబ్దుల్లాకు పాజిటివ్
నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాకు కరోనా వైరస్ సోకింది. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు శుక్రవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న రెండు రోజుల్లోనే ఆయనకు వైరస్ సోకింది. ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
టీకా ఎగుమతులు ఆపండి
కోవిడ్–19 టీకా డోసుల ఎగుమతుల్ని వెంటనే నిలిపివేయాలంటూ రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. దేశంలో అవసరమైన అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ సేకరణ, పంపిణీ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలకే ఎక్కువ అధికారాలు కట్టబెట్టాలన్నారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ప్రభావిత వర్గాలకు నేరుగా ఆర్థిక సాయం అందించాలన్నారు. ‘‘వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి అవసరమైన వనరులు టీకా తయారీ సంస్థలకు సమకూర్చాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదే విధంగా ఇక్కడ మన ప్రాణాలను పణంగా పెట్టి వ్యాక్సిన్ డోసుల్ని ఎగుమతి ఎందుకు చేయాలి ? వాటిని వెంటనే నిలిపివేయండి. వ్యాక్సిన్ అవసరమైన వారందరికీ వెంటనే ఇవ్వడం ప్రారంభించండి’’అని రాహుల్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment