మాట్లాడుతున్న రాములు, పక్కన శివారెడ్డి
ఖమ్మంవ్యవసాయం : చిన్న తరహా వ్యాపారాల కోసం పలు రకాలుగా రుణం తీసుకొని, ఆ అప్పులను చెల్లించలేని వారి కోసం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) రుణ పరిష్కార్ పథకాన్ని ప్రవేశపెట్టిందని బ్యాంక్ ఖమ్మం రీజినల్ మేనేజర్ సీహెచ్ రాములు తెలిపారు. బుధవారం బ్యాంక్ రీజినల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. రుణాలు చెల్లించ లేక ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ పథకాన్ని బ్యాంక్ ప్రవేశపెట్టిందని, చిన్న తరహా వ్యాపారులు, లఘు పరిశ్రమలు, చేతి వృత్తులు, వ్యవసాయేతర రుణాలు పొందిన వారు, ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా ముద్ర, జేఎల్‌జీ, లఘు వికాస, సాధారణ క్యాష్ క్రెడిట్ వంటి పథకాల ద్వారా రుణాలు తీసుకొని ఆ రుణాలు చెల్లించలేని వారికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
2017 అక్టోబర్ 1వ తేదీ నాటికి బ్యాంక్ పుస్తకాల్లో మొండి బకాయిలుగా పేర్కొన్నవారికి ఈ పథకాన్ని అమలు చేయనున్నామని, ఖమ్మం రీజియన్ పరిధిలో 72 బ్యాంక్ బ్రాంచ్‌లు ఉన్నాయని, ఈ బ్రాంచ్‌ల్లో రుణ పరిష్కార్ పథకం పరిధిలో రూ.7 కోట్ల మొండి బకాయిలు ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు ఈ పథకంలో అధికంగా ఉన్నారని, ఈ వర్గాల వారికి ఈ పథకం ద్వారా ఎంతో ప్రయోజనం ఉందని, వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
చెల్లింపు ఇలా
- రుణ పరిష్కార్ పథకంలో ప్రయోజనం పొందాలనుకునేవారు తమకు ఖాతా ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి పథకానికి సంబంధించిన దరఖాస్తును పొందాలి.
- ధరఖాస్తు చేసుకున్న నాటి వరకు (బకాయిపడిన మొత్తంలో) వడ్డీ, ఫీజులతో కలిపి 30 శాతం రాయితీ పోను మిగిలిన మొత్తంలో 25 శాతం దరఖాస్తుతోపాటు 25 శాతం చెల్లించాలి.
- మిగిలిన మొత్తం సెటిల్‌మెంట్‌కు అనుమతి మంజూరైన నెల లోపు, లేదా 29 మార్చి 2018 వరకు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు తేదీ వరకు వడ్డీ, ఇతర ఫీజులు చెల్లించాలి.
- ఈ పథకం ద్వారా బ్యాంక్ నిబంధనలకు లోబడి 30 శాతం రాయితీ లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాలని రాములు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ చీఫ్ మేనేజర్ బీవీ శివారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment