సాక్షిప్రతినిధి, ఖమ్మం : జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. గ్రామ పంచాయతీలకు ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ముహూర్తం నిర్ణయించడంతో రాజకీయ పార్టీల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. అధికార టీఆర్‌ఎస్‌తో సహా అన్ని పార్టీలు పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అధికార పార్టీ ఒకడుగు ముందుకేసి పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేసింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంచాయతీ ఎన్నికల్లో పార్టీ విజయ కేతనం ఎగురవేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం, కార్యకర్తల్లో మనోధైర్యం కల్పించేందుకు బుధవారం రెండు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. కార్యకర్తలు ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సంకేతాలిచ్చారు. అలాగే స్థానిక సమరం ఈసారి హోరాహోరీగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్న ఆయా రాజకీయ పక్షాలు కార్యకర్తలకు చేరువయ్యేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ మాత్రం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఇతర పార్టీల్లో బలమైన నాయకులుగా ఉండి.. రాజకీయంగా కొంత నిరాశావాదంతో ఉన్న నేతలపై దృష్టి సారించింది. మండల, గ్రామస్థాయిలో అధికార పార్టీ వైపు మొగ్గుచూపే నేతలతో సమాలోచనలు జరపాలని ఇప్పటికే ముఖ్య నేతలకు పార్టీ నాయకులు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే నేలకొండపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బుధవారం జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి తుమ్మల సమక్షంలో టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని ద్వితీయ శ్రేణి నాయకులకు, జిల్లా నేతలకు ఎప్పటికప్పుడు నొక్కిచెబుతున్న మంత్రి తుమ్మల.. పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులు ఎలా సన్నద్ధం కావాలో.. ఏయే అంశాలపై దృష్టి సారించాలో.. అభివృద్ది కార్యక్రమాలను గ్రామాలవారీగా టీఆర్‌ఎస్ చేపట్టిన తీరును విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు.
వ్యూహాల్లో నిమగ్నం..
గత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జిల్లాలో పెద్దగా స్థానాలు గెలవనప్పటికీ.. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మంత్రి తుమ్మలతోపాటు టీడీపీ నుంచి అలాగే ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండలస్థాయి కీలక నేతలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పంచాయతీ ఎన్నికను ప్రత్యక్షంగా నిర్వహించినా.. పరోక్షంగా నిర్వహించినా.. గ్రామాల్లో తిరుగులేని విధంగా ఎన్నికల వ్యూహం ఉండేలా చర్యలు చేపట్టాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఇక కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమకు బలమున్న ప్రాంతాల్లో కీలక స్థానాలను గెలుచుకుని జిల్లాలో తమకు గల పట్టు నిరూపించుకున్నాయి. ఇదే క్రమంలో ఈసారి వామపక్ష పార్టీలతోపాటు కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీలు మళ్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నాయి. సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాల్లో జరిగిన టీఆర్‌ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశాల్లో మంత్రి తుమ్మలతోపాటు పాల్గొన్న ప్రతి నేత పంచాయతీ ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా తమ ప్రసంగాలను కొనసాగించడం, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించడంతో పంచాయతీ ఎన్నికల సమరానికి టీఆర్‌ఎస్ ముందుందన్న సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసినట్లయిందన్న భావన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఎన్నికలకు సమయం ఇంకా నెల రోజులున్నప్పటికీ మంత్రి తుమ్మలతోపాటు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, బానోతు మదన్‌లాల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆయా నియోజకవర్గాల్లో తమ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశమై.. పంచాయతీ ఎన్నికలు, స్థానిక సమస్యలు ఇతర అంశాలపై సుదీర్ఘ సమాలోచనలు జరుపుతున్నారు. పంచాయతీ ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన గ్రామ, మండలస్థాయి నాయకులు ఇతర పార్టీల్లో ఎవరెవరున్నారనే అంశంపై టీఆర్‌ఎస్ ఆరా తీసే పనిలో నిమగ్నమైంది. ఆయా రాజకీయ పక్షాల్లో వారి పరిస్థితి తమవైపు మొగ్గు చూపేందుకు గల సానుకూల అంశాలను పరిశీలించే బాధ్యతను మండల, నియోజకవర్గ స్థాయి నాయకులకు పార్టీ నాయకత్వం అప్పగించినట్లు టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతో జిల్లాలోని అనేక తండాలు గ్రామ పంచాయతీలుగా మారనున్నాయి.
కొత్త జీపీలు ఏర్పడితే ఆయా గ్రామ పంచాయతీల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంశంపై ఆయా రాజకీయ పార్టీలు ఇప్పటికే అంచనా వేస్తున్నాయి. తమకు తండాల్లో ఉన్న పట్టుపై ఏ పార్టీకి ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా ఏ సమయంలోనైనా మోగే అవకాశం ఉండటంతో గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అధికారులు మరింత వేగవంతం చేస్తున్నారు. మరుగుదొడ్లు, అంతర్గత రహదారులు, పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సమాయత్తమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment