సాక్షి, ఆసిఫాబాద్: ఇంటర్నెట్ సమస్య ‘ఆసరా’ లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తోంది. డిసెంబర్ నెల పూర్తయినా ఇంకా పింఛన్ డబ్బులు చేతికందకపోవడంతో వృద్ధుల్లో టెన్షన్ పెరుగుతోంది. పింఛన్‌పైనే పూట గడిపేవారు..మందులు అవసరం ఉన్న వారు, ఇతరాత్ర పనులకు నానా పాట్లు పడుతున్నారు. ఏజెన్సీలో ఆదివాసీ, లంబాడా ఆందోళనల నేపథ్యంలో గత పదిహేను రోజులుగా జిల్లాలో ఇంటర్నెట్ సేవలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాలన్నీ ఇంటర్నెట్‌పైనే ఆధారపడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉండగా, వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడం సమస్యగా మారింది. ప్రతినెలా పంపిణీ చేసే ‘ఆసరా’ పింఛన్లు కూడా ఇంటర్నెట్‌పైనే ఆధారపడి ఉండడంతో డిసెంబర్ నెల పింఛన్లు నిలిచిపోయాయి. ప్రతినెలా ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేసి, కలెక్టర్ల ఆమోదం పొంది, పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పంపిణీ కార్యక్రమం పూర్తయ్యాక అందుకు సంబంధించిన అక్విటెన్స్‌లను పంపిణీ చేసిన సిబ్బంది ఉన్నతాధికారులకు అందజేస్తారు. ప్రతీ నెల ఒకటి నుంచి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు డిసెంబర్ నెల పింఛన్లు పంపిణీ జరగకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
లబ్ధిదారుల పాట్లు
జిలాల్లోని 15 మండలాల్లో 50,017 మంది ఆసరా లబ్ధిదారులుండగా వీరికి ప్రతినెలా రూ.5.59 కోట్లు పంపిణీ చేస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.1000, వికలాంగులకు రూ.1500 అందిస్తున్నారు. వీరికి ప్రతి నెలా గ్రామపంచాయతీలు, పోస్టాఫీసుల ద్వారా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. నెలనెలా వచ్చే పింఛన్‌పైనే అధిక శాతం లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారు. వీరు తమకు అవసరమున్న మందులు, నిత్యావసరాలు పింఛన్ డబ్బులతోనే వెల్లదీస్తున్నారు. నెల రోజులుగా పింఛన్ అందకపోవడంతో లబ్ధిదారులు పాట్లు పడుతున్నారు. ప్రతినెలా మొదటి వారంలోనే పింఛన్లు పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించినా ఎక్కడా అమలు కావడం లేదు. ఇంటర్నెట్ సమస్య పింఛన్ల పంపిణీకి అవరోధంగా మారింది.
ఇంటర్నెట్ సమస్య వల్లే జాప్యం
ఇంటర్నెట్ సమస్య వల్లే ఆసరా పింఛన్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
– వెంకట్, డీఆర్‌డీవో, ఆసిఫాబాద్
పదిహేను రోజులుగా తిరుగుతున్న
పింఛన్ కోసం పదిహేను రోజులుగా పోస్టాఫీసు చుట్టూ తిరుగుతున్న. సార్లేమో లైన్లు లేవంటున్నరు. ఎప్పుడస్తయో చెప్పలేమంటున్నారు. పింఛన్ డబ్బులు రాకపోవడంతో పూటగడవడం ఇబ్బందైతుంది.
– తామిడె పెంటుబాయి, టీఆర్‌నగర్, ఆసిఫాబాద్
పింఛన్ మీదనే బతుకుతున్నం
నాకు గత కొన్ని సంవత్సరాలుగా నెలనెలా రూ.వెయ్యి పింఛన్ వస్తుంది. నా భార్య, నేను పింఛన్ మీదనే బతుకుతున్నం. ఈ నెల పింఛన్ ఇప్పటి వరకు పంపిణీ కాలేదు. రోజూ గ్రామపంచాయతీ ఆఫీసు చుట్టు తిరుగుతున్న. నెట్ లేదంటున్నరు.
– బోయిరె నారాయణ, కోమటిగూడ, వాంకిడి
తిండికి కష్టమైతంది
నాకు చిన్నప్పుడే అగ్ని ప్రమాదంలో చేతివేళ్లు కాలిపోయాయి. నెలనెలా వచ్చే ఆసరా పింఛన్‌పైనే బతుకు. పింఛన్ డబ్బుల కోసం వారం రోజులుగా పోస్టాఫీసు చుట్టూ తిరుతున్నా డబ్బులు రాలేదంటున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో తిండికి కష్టమైతంది. చుట్టు పక్కల ఉన్న బంధువులు పెడ్తే తింటున్న.
– వైరాగడే భీంబాయి, చెక్‌పోస్టుకాలనీ, ఆసిఫాబాద్
Comments
Please login to add a commentAdd a comment