అరబెల్లా సమాధి, అరబెల్లా సమాధిపై నిర్మించిన సెయింట్ మేరీస్ చర్చి ఇదే
మచిలీపట్నం టౌన్ (మచిలీపట్నం): షాజహాన్ చక్రవర్తి తన ప్రియురాలైన ముంతాజ్ జ్ఞాపకార్థం ఆగ్రాలో తాజ్‌మహల్‌ను నిర్మిస్తే బందరు పట్టణంలో బ్రిటీష్ మేజర్ జనరల్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా రాబిన్‌సన్ కోసం అదే రీతిలో తమ ప్రేమకు ప్రతిరూపంగా 1815వ సంవత్సరంలో ఓ సుందర మందిరాన్ని నిర్మించారు. తాజ్‌మహల్‌లో లేని ఓ విశేషాన్ని అరబెల్లా మందిరంలో ఉంది. అరబెల్లా మృతదేహం దెబ్బతినకుండా ఈజిప్ట్ మమ్మీ తరహాలో ఏర్పాట్లుచేశారు. ఓ అందమైన గాజు పెట్టెలో మృతదేహాన్ని భద్రపరిచి భూమిలో ఓ అరను ఏర్పాటు చేసి దానిలో ఉంచాడు. ప్రియురాలిని చూడలనుకున్నప్పుడు గోడకు ఉన్న ఒక కొయ్య చిలుకను అమర్చి, దానిని తిప్పితే భూమి లోపలి అరలో పెట్టి పైకి వచ్చేలా అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు.
మందిరం కథ ఏమిటంటే..
మేజర్ జనరల్ పీటర్ మచిలీపట్నంలో నాటి ఆంగ్లేయ సైన్యాధికారిగా పనిచేశారు. వారి వద్ద కెప్టెన్‌గా పనిచేస్తున్న రాబిన్‌సన్ కుమార్తె అరబెల్లాను పీటర్ ప్రేమించి వివాహం చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనికి అరబెల్లా తండ్రి రాబిన్‌సన్, మతాధికారులు అంగీకరించలేదు. అయినా వారిద్దరూ సహజీవనం చేశారు. ఈ దశలో పీటర్, రాబిన్‌సన్ మధ్య కలతలు పెరిగాయి. తండ్రి, ప్రియుడి మధ్య విభేదాల నేపథ్యంలో మానసిక ఒత్తిడితో ఆరోగ్యం దెబ్బతిని 1809 నవంబర్ 6వ తేదీన పీటర్ ఒడిలోనే ఆమె శాశ్వతంగా కన్నుమూసింది. పీటర్ కన్నీటి నడుమ అరబెల్లా మృతదేహాన్ని వివాహ వస్త్రాలతో అలంకరించి అంతిమ వీడ్కోలు జరిపించాడు. అరబెల్లా పాపపు స్థితిలో మరణించిదనే నెపంతో నాటి పరిశుద్ధ యోహాను ఆవరణలో, బందరు కోటలోని ఆంగ్లేయుల శ్మశానవాటికలో మృతదేహాన్ని సమాధి చేసేందుకు పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆనందపేట సమీపంలో అరబెల్లా మృతదేహాన్ని భద్రపరిచాడు.
ప్రేయసి జ్ఞాపకాలు మదిని తట్టినప్పుడల్లా అరబెల్లా మృతదేహాన్ని బయటకు తీసి, తీరని దుఃఖంతో కుమిలిపోయేవాడు. మరణించిన అరబెల్లాను చర్చిలోకి అనుమతించకపోయినా ఆమె మృతదేహాన్ని ఉంచిన చోటే సెయింట్ మేరీస్ చర్చిని నిర్మించాడు. అరబెల్లాను తన ప్రియమైన స్నేహితురాలిగా వర్ణిస్తూ పీటర్ ఓ శిలాఫలకాన్ని సమాధి గోడపై అమర్చాడు. ఆయన మద్రాసుకు బదిలీపై వెళ్తు ఈ పరిశుద్ధ సెయింట్ మేరీస్ చర్చిని ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించాడు. 1819 నుంచి మతాధికారులు ఆ చర్చిలో అందరూ ప్రార్ధనలు జరుపుకునేలా అనుమతిచ్చారు. ప్రేయసి దూరమైన బాధతో 1819లో పీటర్ మద్రాసులో మృతిచెందాడు. ఆయన పేరుతో మద్రాసులో ఉద్యానవనం ఏర్పాటు చేసి, ఒక రోడ్డుకు ఆయన పేరు పెట్టారు. పరిశుద్ధ మేరీ చర్చిలో పనిచేస్తున్న పనిమనిషి అనుకోకుండా గోడకు అమర్చిన కొయ్య చిలకను తిప్పడంతో సమాధిపై ఉన్న రాయి తొలగి అరబెల్లా మృతదేహం పైకి రావడాన్ని హఠాత్తుగా చూసి మరణించింది. ఈ విషయం తెలిసిన అప్పటి కలెక్టర్ ఆ ఆరను శాశ్వతం మూయించారు. ప్రస్తుతం చర్చి కూడా మూతపడింది.
Comments
Please login to add a commentAdd a comment