
ప్రతీకాత్మక చిత్రం
‘‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’’ ఈ మూడు మాటల్ని ఎదుటి వ్యక్తికి చెప్పటానికి అల్లాడిపోయేవారు చాలా మందే ఉన్నారు. తమ ప్రేమను చెప్పగానే ఆవతలి వ్యక్తి ఎలా స్పందిస్తారన్నదే ఓ పెద్ద ప్రశ్న! చాలా మందిని కలవరపెట్టేది కూడా ఈ పశ్నే. ‘‘ నువ్వు అవునంటే ఆకాశంలోకి.. కాదంటే పాతాళంలోకి’’ అన్నట్లు ఆలోచిస్తుంటారు. ప్రేమలో గెలిచినవారి సంగతి పక్కన పెడితే.. ఒడిపోయిన, ముఖ్యంగా ఆదిలోనే తిరస్కరణకు గురైన వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది. కొంతమంది మానసికంగా దెబ్బతిని ఆత్మహత్య చేసుకోవటమో, ప్రయత్నించటమో, తమను తాము తరుచు బాధించుకోవటమో చేస్తుంటారు. మరికొంతమంది ఆ బాధనుంచి బయటపడలేక, ఎలా బయటపడాలో తెలియక కృంగిపోతుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే..
1) జ్ఞాపకాలను చెరిపేయండి
ప్రేమ చేసిన గాయం మానాలంటే అందుకు సంబంధించిన జ్ఞాపకాలను పూర్తిగా చెరిపేయటం ప్రధానం. ముందుగా భౌతికమైన వాటిని వారికి సంబంధించినవి ఏవైనా( వారిని గుర్తు చేసేవి)వాటిని కంటికి కనిపించనంత దూరంగా ఉంచండి.
2) బిజీగా ఉండండి
మనం ఎప్పుడైతే ఖాళీగా ఉంటామో అప్పుడు ఎదుటి వ్యక్తి ఆలోచనలు మనల్ని చుట్టుముట్టి వేధిస్తుంటాయి. అందుకని ఎప్పుడూ ఏదో పనిలో నిమజ్ఞమై ఉండండి. ఒంటరిగా కాకుండా మిత్రులతో, కుటుంబసభ్యులతో సమయం గడపటానికి ప్రయత్నించండి.
3) ప్రతికూల(నెగిటివ్) ఆలోచనలు
ఎట్టి ప్రరిస్థితిలో ప్రతికూల ఆలోచనలు చేయకండి. అలాంటి ఆలోచనలే మనల్ని ఇబ్బందుల పాలు చేస్తాయి. ఆ బాధనుంచి బయటపడగలమనే ధృడ సంకల్పంతో ఎల్లప్పుడూ ఉండండి.
4) వ్యాయామం
మనసు గట్టిపడాలంటే ముందుగా మన శరీరాన్ని ధృడంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఆరోగ్యవంతమైన శరీరమే ఆరోగ్యవంతమైన ఆలోచనలు చేయగలదు. వ్యాయామం చేయటం ద్వారా శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి రోజుకు కనీసం ఓ అరగంటేనా వ్యాయామం చేయటం మంచిది.
5) మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి
మనల్ని మనం ప్రేమించుకోవటం అన్నది ప్రధానం. ఇతరులు మన మనసును బాధపెట్టారని, మనల్ని మనం బాధించుకోవటం మంచిది కాదు. కోరుకున్న వ్యక్తి ప్రేమే జీవితం కాదు! వారి ప్రేమ మన జీవితంలో ఓ చిన్న భాగంగా గుర్తించాలి. జీవితం వారి ప్రేమతోటే ముగియదని, మరొకరి రూపంలో మన ముందు ప్రత్యక్షమవుతుందని తెలుసుకోవాలి. మనల్ని మనం పూర్తిగా ప్రేమించినపుడే ఎదుటివ్యక్తిని సంపూర్తిగా ప్రేమించగలము.
6) కొంచెం నవ్వండి !
ఇలాంటి సమయంలో నవ్వు నాలుగు వందల విధాల మేలు! అని కచ్చితంగా చెప్పొచ్చు. నవ్వు మానసికంగానే కాదు శారీరకంగానూ మనిషికి ఎంతో మేలు చేస్తుంది. నవ్వినపుడు ముఖంలో కదిలే కండరాల కారణంగా కొన్ని నరాలు ప్రభావితమవుతాయి. తద్వారా మనకు ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. ఏదో పోగొట్టుకున్న వారిలా ప్రతిక్షణం దిగాలుగా ఉండకుండా కొద్దిగా నవ్వటానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నమే నవ్వులకు మనల్ని మరింత దగ్గర చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment