ఆమె ఆఫీస్ ముగించుకుని గేట్ నుంచి బయటకి వస్తోంది. అది వర్షాకాలం కావడంతో సాయంత్రం ఆరు గంటలకే చీకట్లు కమ్ముకున్నాయి. వేగంగా వీస్తున్న గాలికి తోడు చిన్నగా వర్షపుజల్లు కూడా తోడైంది. బస్టాప్ ఆమె ఆఫీస్ ముందే! అతను ఆ బస్టాప్‌లో వెయిట్ చేస్తున్నాడు. ఆమె బ్యాగ్లో ఏదో సర్దుకుంటూ నెమ్మదిగా ఆ వర్షంలో నడచి వస్తూ ఎవరో పిలిచినట్టు తల పైకి ఎత్తి చూసింది. ఎదురుగా కాస్త దూరంలోఅతను.
చూడగానే అతనికి పడిపోయింది అనుకుంటా, అందుకే అతన్ని ఎలాగైనా చూడడానికి 10 రోజుల నుంచి నానా అవస్థలు పడుతూ ముందుకు, పక్కకి చూస్తోంది. ఇప్పుడు అతను కొంచం పక్కకి నిలబడి ఉండటం వల్ల తన ముఖం ఆమెకి సరిగ్గా కనిపించడం లేదు. ఇంతలో బస్సు వచ్చింది. ఆ బస్సు ఎక్కి వెళ్ళిపోతాడేమో అనుకుంది. కానీ అతను బస్సు కోసం కాకుండా ఇంక దేనికోసమో ఎదురుచూస్తూ ఫోన్లో మాట్లాడుతున్నాడు.
ఫోన్ మాట్లాడుతూ ఐనా తన ముఖం ఆమె వైపుగా తిప్పుతాడేమో అని ఆశతో తన వైపే చూస్తోంది. గాలికి చెరిగిపోతూ, రేగిపోతూ ఉన్న జుట్టు తప్ప ఆమెకి ఇంకేం కనిపించడం లేదు. అతని పర్సనాలిటీ, ఆ హెయిర్ స్టైల్కి పడిపోయింది. ఆ ఫోన్లో మాట్లాడుతున్న మనిషి 'రాను' అని చెప్పినట్టున్నారు, అందుకే అతను నడక మొదలుపెట్టాడు.
ఆమె ఆ బస్టాప్ కాకుండా, ఎదురుగా ఉన్న బస్టాప్కి వెళ్ళాలి. అందులోనూ అతను అటువైపుగా నడుస్తున్నాడు. అందుకే ఆమె కూడా అతని వెంట నడక మొదలుపెట్టింది.ఈసారి అతని వెనుకభాగం తప్ప ఆమెకి ఇంకేదీ కనిపించడంలేదు. ఒక్కసారైనా వెనక్కి చూస్తాడు అనే ఆశతో ఆమె అతని వెనుక నడుస్తూ ఉంది. కానీ పక్కన జీబ్రా క్రాసింగ్ రావడంతో ఆమెకి గుర్తొచ్చినట్టుంది తాను ఎదురుగా ఉన్న బస్టాప్కి వెళ్ళాలి అంటే రోడ్ దాటాలి అని.
నిరాశగా అతన్ని మళ్ళీ ఒకసారి వెనుకనుంచి చూసి రోడ్ క్రాస్ చేస్తోంది. ఆమె పక్కకి చూసింది. పక్కనే అతను. కానీ ఇప్పుడు కూడా ఆమెకి అతని ముఖం పూర్తిగా కనిపించడం లేదు. ఇద్దరు రోడ్ క్రాస్ చేసాక ఓ పది మీటర్ల దూరంలో ఉంది బస్టాప్. అతను, తనని అనుసరిస్తూ ఆమె, చెప్పాలంటే అతనికంటే వేగంగా నడుస్తోంది.
అలా ఐనా ముందుకెళ్లి, వెనక్కి తిరిగి తనముఖం చూడచ్చు అనేమో! కానీ అది కుదరట్లేదు. ఈలోపు బస్సు రానే వచ్చింది. ఆమెకి అతని ముఖం ఎంతకీ కనిపించకపోవడంతో నిరాశగా బస్సు ఎక్కింది. బస్సు ఎక్కిందనేకానీ ఆమె ధ్యాస అంతా అతని పైనే ఉంది. అలా ఏదో ఆలోచించేలోపు ఆమె దిగాల్సిన స్టాప్ వచ్చేసింది. ఈసారి అదేస్టాప్లో అతను కూడా దిగాడు. ఆమె ముఖం 1000 వాట్స్ బల్బ్లా వెలిగింది, ఈసారి ఐతే ఖచ్చితంగా చూడాలి అనునుకుని చూసింది కానీ, బాగా చీకటిగా ఉండడంతో అతని ముఖం సరిగ్గా కనిపించలేదు.
సరే ఇక వెళ్దాం అని ఆమె అనుకున్న టైంలో అతని ముఖం బస్సు నుంచి వస్తున్న లైట్ వల్ల చాలాహుందాగా, మంచి మేని మెరుపుతో కనిపించింది. గత 10 రోజులుగా ప్రయత్నిస్తుంటే లేనిది ఒక్కసారిగా అతను కనిపించడంతో ఆమెకి ఆనందం ఒకవైపు, ఆశ్చర్యం ఒకవైపు. అతను రోడ్ క్రాస్ చేస్తుంటే, అతని వెంబడించి ఆమె కూడా రోడ్ దాటింది. బాగా చీకటి. దానికి తోడు చిన్న తుంపరులుగా పడుతున్న వర్షం వల్ల ఆమె , తాను వెళ్లాల్సిన రోడ్ వైపు తన నడక సాగించింది.
'ఓయ్, నీకోసం నేను వస్తుంటే నువ్వు అలా వెళ్ళిపోతావేంటి' అనే మాటలు వినపడగానే అటుగా తిడరగంతో ఎదురుగా అతను. ఏమీ అర్థం కాని చూపుతో అలా అయోమయంగా నిలబడి ఉన్న ఆమెను, 'నీకోసం రోజూ మీ ఆఫీస్ దగ్గర నిలబడి, నువ్వు వచ్చేవరకు. వెయిట్ చేసి, నిన్ను ఫాలో అవుతుంటే ., ఏం పట్టనట్టు అలా వెళ్ళిపోతావ్ ఏంటి?' అని అడిగాడు. ఆమె సిగ్గుతో అలా తలెత్తకుండా నవ్వింది.
Comments
Please login to add a commentAdd a comment