
నా జీవితంలోని మధురమైన ఘట్టం.. డిగ్రీ ఫస్టియర్ లో ఉన్నప్పుడు వెళ్లిన ఎన్ఎస్ఎస్ క్యాంపు లోని పది రోజుల కాలం.. ఆ మధురానుభూతుల్ని తలచుకుని నా మనసు ఇప్పటికీ తుళ్ళి పడుతుంది. ఆ అనుభవాలు తలచుకుని ప్రతిక్షణం ఆనంద పారవశ్యంలో మునిగితేలుతుంది. ఆ పది రోజులు ఎంత తొందరగా అయిపోయాయా అనిపిస్తోంది తలుచుకున్నప్పుడు.. నిజ జీవితంలో సినిమా సంఘటనలు ఎదురైతే ఎంత థ్రిల్ ఫీల్ అవుతామో నిరూపించిన క్యాంపు అది.. హిమజ అని మా క్లాస్ మేట్. కొంచెం అందంగా ఉంటుంది. తానే అందగత్తెనని కొంచెం ఫీలింగ్ కూడా. తనను ఎవరైనా అదే పనిగా చూస్తే ప్రేమలో పడతారని ఆమె భయం. అలాంటి అమ్మాయి మా గ్రూప్‌లోనే ఉంది. (ఎన్నెస్సెస్ క్యాంపు వెళ్లిన మేము ఐదు గ్రూపులుగా విడిపోయి.. ఊళ్లో తలో భాగాన్ని పంచుకొని శ్రమదానం పనులు చేసేవాళ్లం.)
మంచి అమ్మాయే కానీ అనుమానాలు ఎక్కువ. కొంచెం ఫ్రీగా ఉంటే అందరితో బాగానే మాట్లాడుతుంది. క్లాస్‌మేట్ కాబట్టి నాతో ఫ్రీగానే ఉంది. అట్లాగే తన జీవితంలో జరిగిన కొన్ని అనుభవాలను నాతో షేర్ చేసుకుంది. ఆమెతో నేను కొంచెం కామెడీగా ఉండేవాణ్ని. ఆమె మావయ్య అని ఒకతన్ని పిలిచేది. అతను నాతో కూడా ఫ్రెండ్లీగా ఉండేవాడు. నేను అతన్ని బాబాయి అని పిలువడం మొదలెట్టాను. ఇలా పిలవడంలో ఎలాంటి దురుద్దేశమూ లేదు... అలా కొన్నిసార్లు పిలిచినా తను ఏం ఫీల్ కాలేదు. నా మంచితనం తెలుసు కాబట్టి. కానీ ఒక రోజు ఊరికి కొంచె దగ్గరగా చెలుకలో మట్టి తవ్వుతున్నప్పుడు.. తనను తేనేటీగ కరిచింది. తను బాగా ఏడుస్తుంటే నా మనస్సుకు చాలా బాధేసింది. వెంటనే ఊళ్లోకి పరిగెత్తుకెళ్లి ఓ పెద్దమ్మను అడిగాను. తేనేటీగ కుడితే మందు ఏం పెట్టాలని. ఆమె ఒక చెట్టు ఆకు పసురును పెడితే వెంటనే నొప్పి తగ్గిపోతుందని చెప్పింది. నేను వెంటనే ఆ ఆకు పసురును తీసుకొని తన దగ్గరకు పరిగెత్తుకు వెళ్లాను. తనను అప్పటికీ ఊర్లోని క్లినిక్‌కు తీసుకెళ్లారు. నేను పసురును తీసుకొని క్లినిక్కు వెళ్లాను. డాక్టర్ అన్నాడు మందు ఇచ్చాను పసురు లాంటివి అవసరం లేదని. నేను పసురు తీసుకెళ్లి ఇది పెట్టుకుంటే త్వరగా తగ్గుతుందని చెప్పాను. తన వెంట ఉన్న తోటి క్లాస్‌మేట్స్ (గర్ల్స్) నవ్వారు. పసురులాంటివి వొద్దు బాబు.. అయినా డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాం కదా.. నువ్వంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాం కదా. నీ ఒక్కడికే అంత టెన్షన్ ఎందుకు అన్నట్టు చూశారు. తను నన్ను కోపంగా చూసింది. నొప్పి ఎలా ఉంది అని అడిగినా సమాధానం ఇవ్వలేదు. ఈ పసరు పెట్టుకుంటే తగ్గిపోతుందంట అని చెప్పినా వినిపించుకోలేదు. అమ్మాయిలతో కలిసి కోపంగా వెళ్లిపోయింది.
ఆ తర్వాత కనిపించినా మొఖం తిప్పుకోవడం మొదలుపెట్టింది. మాట లేదు. ముచ్చట లేదు. ఎందుకు మాట్లాడటం లేదని అడిగాను. నాతో నేరుగా మాట్లాడకుండా పక్కకు ఉన్నవారికి చెప్తున్నట్టుగా `ఓవరాక్షన్ చేసేవారితో నేను మాట్లాడాను` అని అంది. అందులోని ద్వంద్వార్థాన్ని గ్రహించాను. నేను తనతో ప్రత్యేకంగా ప్రవర్తిస్తున్నట్టు తను భావించేదేమో. కామెడీగా ఉంటూ సరదాగా మాట్లాడాను. తనకు తేనేటీగ కుడితే తను ఏడ్వడం చూడలేక ఒక మనిషిగా పరిగెత్తుకెళ్లి ఆకు పసరు తీసుకొచ్చాను. కానీ, నేను తను పట్ల స్పెషల్ ఇంట్రస్ట్ చూపిస్తున్నట్టు తను భావించింది. నేను తనను ప్రేమిస్తున్నానని అనుకుందేమో. తను దూరం పెట్టడం మొదలెట్టింది. నేనూ తనతో మాట్లాడటం మానేశాను.
ఊరిలో శ్రమదానం పనులు ముగించుకొని ఓ రోజు పంపు ట్యాంక్ వద్దకు వచ్చాము. అప్పటి వరకు తన సబ్బుతోనే నేను మొఖం, కాళ్లు చేతులు కడుక్కొనే వాణ్ని. ఆ రోజు మాత్రం తన ఫేస్ వాష్ ఐపోగానే తన సబ్బు తీసుకొంది. నేను యథాలాపంగా సోప్ అడిగాను. ఇవ్వలేదు. పక్కన ఉన్న సీనియర్ అమ్మాయి.. అక్కడ బట్టలుతికే సబ్బు ఉంది కదా.. దానితో కడుక్కో అని టీజింగ్ చేస్తున్నట్టు అంది. హిమజ మీద కోపంతో ఆ సోపుతోనే మొఖం, కాళ్లు చేతులు కడుక్కున్నాను. తను మాత్రం పిల్లడ ఆ సబ్బుతో కడుక్కోకు. నా సోప్ ఇస్తా తీస్కో అంది. నేను కోపంతో తీసుకోలేదు.
తను ఏమనుకుందో మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది. నేను మాట్లాడకపోయినా మాట్లాడేది. నాకు కోపం వచ్చింది. `నువ్వు ఓవరాక్షన్ చేసేవారితో మాట్లాడవు కదా` అని అడిగేశాను. `నువ్విప్పుడు ఓవరాక్షన్ చేస్తలేవు కదా` అని అంది. అంటే తనతో మాట్లాడకపోతే..తనను అవాయిడ్ చేస్తేనే మాట్లాడుతదా? తనతో మాట్లాడటం ఇష్టం అనిపించలేదు.
అయినా.. కన్నా.. చిన్నా అంటూ పిలువడం మొదలుపెట్టింది. అవాయిడ్ చేసినకొద్ది మాట్లాడేది. ఓ రోజు నేను చాలా చిరాగ్గా కూచున్నాను. మా గ్రూప్‌లోనే నేను ఎంతో ఇంట్రస్ట్‌గా, శ్రద్ధగా శ్రమదానం పనులు చేసేవాడిని. ఊరికి మనవల్ల ఎంతోకొంత మేలు జరగాలి. మనం స్టూడెంట్స్ వచ్చి చేసిన పనిని ఊళ్లోవాళ్లు.. ఒక్కసారన్న జ్ఞాపకం చేసుకోవాలి అన్నట్టుగా ఉండేది నా ధోరణి. కానీ, ఆ రోజు నాకు పనిచేయబుద్ధి కాలేదు. చాలా చిరాగ్గా ఉంది. ఏం పని చేయకుండా ఓ ఇంటి అరుగు మీద ముభావంగా కూచున్నా. అప్పటివరకు పిచ్చి గడ్డిమొక్కల్ని పీకి.. నా పక్కన కొంచెం దూరంగా కూచుంది హిమజ. నేను ముభావంగా ఉండటం గమనించిందో లేదో తెలియదు. కానీ ఉన్నట్టుండి `పిల్లోడా` అని ఒకింత ప్రేమగా పిలిచింది. నేను కోపంగా ముఖం తిప్పుకున్నాను. ఈసారి కొంత గోముగా, కొంత కోపంగా `ఓ పిల్లగా ఇటు చూడు` అంది. నాకు చుర్రుమంది. `ఏంటి.. ఏంటి అన్నావు` అని కోపంగా అడిగాను. తను బెదిరిపోయి.. అటూఇటూ బిత్తరచూపులు చూసి.. `తమ్ముడా` అని పిలిచానని మాట మార్చింది.
లేదు నువ్వు తమ్ముడా అనలేదు అని నేను అడిగితే.. అంతే అన్నానని బుకాయించింది. నేను షాక్ తిన్నాను. నా గురించి తను చెండాలంగా ఊహించికున్నట్టు అనిపించింది. ఓ స్నేహితురాలిగా అభిమానించానేమో. ఓ క్లాస్‌మేట్‌గా స్నేహంగా ఉండాలనుకున్నా. తమ్ముడా అని ఎలా పిలుస్తుంది. ఒక్క క్లాస్‌లోని వాళ్లు స్నేహంగా ఉండకూడదా. స్నేహంగా ఉంటే కూడా అది ప్రేమ అవుతుందా? ప్రేమ అనేవాటికి తప్పించుకునేందుకు ఇలాంటి తమ్ముడా అనే ముసుగులు ధరించాలా? నాకు చాలా బాధేసింది. ఏదో దు:ఖం కూడా కమ్ముకున్నట్టు అనిపించింది.
ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది. కొంచెం చనువుగా మసిలితే.. స్నేహంగా ఉంటే అది ఐ లవ్యూ వరకు వెళుతుందా? నేను చదువుతున్నప్పటి రోజులు అలా ఉన్నాయేమో.. తన అనుభవాల ప్రభావమో. ఎదుటివాణ్ని అలా హఠాత్తుగా తమ్ముడా అని అనడం తనకు తప్పు అనిపించలేదేమో. ఎదుటివారి హృదయంలో ఏ దురుద్దేశమూ లేకపోయినా.. అతన్ని తమ్ముడా అని ఒక భావానికి కుదించేసి.. మన మధ్య ఉన్న కనీస స్నేహ, మావన సంబంధాలకు కూడా అర్థం లేకుండా చేసింది తను అనిపించింది.
తను నన్ను తమ్ముడా అన్నా ఫ్రెండ్ అన్నా మామూలు క్లాస్‌మేట్‌గా పరిగణించినా నేను ప్రత్యేకంగా ఏమీ బాధపడేవాణ్ని కాదు. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల వల్ల కొంత స్నేహం ఏర్పడిన తర్వాత అపార్థాలతో, అనుమానాలతో నన్ను తమ్ముడా అని పిలువడం బాధగా అనిపించింది. ఒక వ్యక్తిగా నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా అనిపించింది. నేనే సరిగ్గా కమ్యూనికేట్ కాలేదేమోనని ఆత్మపరిశీలన చేసుకున్నా. కానీ నా మనస్సులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఆ విషయం తనెప్పుడు తెలుసుకోలేకపోవచ్చు. ఆ తర్వాత మేం పెద్దగా మాట్లాడుకోలేదు. తన అపార్థాల నుంచి బయటపడే అవకాశం కూడా తనకు లేదేమో అనిపించింది. ఆ తర్వాత మరో రెండేళ్లు మేం కాలేజీ లైఫ్‌లో కలిసి చదివినప్పటికీ పెద్దగా మాట్లాడుకున్నది లేదు. కానీ ఓ రోజు హఠాత్తుగా తను నాతో మాట్లాడింది. క్లాస్ అయిపోయాక ఇద్దరం కలిసి బేకరీకి వెళ్లాం. తను రెండు ఎగ్‌పాప్స్ తిన్నది. నేను కూల్‌డ్రింక్ తాగాను. నా స్వభావం తనకు అర్థమైనా కాకపోయినా.. బుద్ధిపూర్వకంగానే నేను తనకు బాగా దూరంగా ఉండిపోయినట్టు అనిపిస్తుంది.
- శ్రీకాంత్ కాంటేకర్
Comments
Please login to add a commentAdd a comment