త్వరలో నియోజకవర్గాల యాత్ర | CM KCR To Tour In Gajwel Constituency Today | Sakshi
Sakshi News home page

త్వరలో నియోజకవర్గాల యాత్ర

Published Thu, Jan 18 2018 2:44 AM | Last Updated on Sat, Sep 29 2018 4:44 PM

CM KCR To Tour In Gajwel Constituency Today  - Sakshi

గజ్వేల్‌ సమీపంలోని సంగాపూర్‌లో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం మోడల్‌ కాలనీ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్‌. చిత్రంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి

సాక్షి, మెదక్‌: ‘‘ఎవరేమన్నా అనుకోనీ... కొద్దిరోజుల్లో నేను నియోజకవర్గాల యాత్ర చేస్తున్నా. నియోజకవర్గాల్లో రెండేసి రోజులు పర్యటిస్తా.. ప్రజలతోనే ఉంటా’’అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. నియోజకవర్గ పర్యటనల్లో భాగంగా త్వరలో గజ్వేల్‌ నియోజకవర్గంలో పర్యటిస్తానని తెలిపారు. తూప్రాన్‌లో ఒక రోజంతా ఉండి పట్టణ అభివృద్ధిపై చర్చిస్తానన్నారు. అందరితో కలసి భోజనం చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం మెదక్‌ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌ తూప్రాన్‌లో రూ.11 కోట్లతో నిర్మించి న 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు.

ఆస్పత్రి లోపలకు వెళ్లి అంతా కలియదిరిగి చూశారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారంతా పేదలేనని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు అవసరమైతే ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆస్పత్రి ఆవరణలో టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలనుద్దేశించి కేసీఆర్‌ ప్రసంగించారు. తాను దేశ సేవలో ఉండటం వల్లే తూప్రాన్‌ వచ్చేందుకు ఆలస్యమైనట్లు తెలిపారు. తూప్రాన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి స్థానిక నేతలు తనకు తెలియజేస్తున్నట్లు వివరించారు.

తూప్రాన్‌లో 50 పడకల ఆస్పత్రి ప్రారంభించడం ఎంతో అనందంగా ఉందన్నారు. తూప్రాన్‌ పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తూప్రాన్‌ పట్టణంలో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే కమ్యూనిటీ హాల్‌కు రూ. కోటి నిధులతోపాటు డిగ్రీ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతకుముందు కేసీఆర్‌ తూప్రాన్‌ పర్యటనకు గంట ఆలస్యంగా వచ్చారు. హైదరాబాద్‌ నుంచి 11.30 గంటలకు తూప్రాన్‌ చేరుకోవాల్సి ఉండగా 12.30 గంటలకు చేరుకున్నారు.

సీఎం రాక ఆలస్యం అవుతున్న నేపథ్యంలో వేదపండితులు ముహూర్తం దాటిపోతుందని ఆస్పత్రి లోపల, వెలుపల గుమ్మడికాయ, టెంకాయలు కొట్టారు. సీఎం వచ్చాక ఆస్పత్రి ప్రారంభించడంతోపాటు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్‌ పర్యటన నేపథ్యంలో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన ఎంఆర్పీఎస్, టీడీపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు.

కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి మురళీ యాదవ్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు బాబూమోహన్, రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, వేముల ప్రశాంత్, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాష్ట్ర రోడ్డు రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ తూముకుంట నర్సారెడ్డి, రాష్ట్ర ఫుడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎలక్షన్‌ రెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ భూమిరెడ్డి, కలెక్టర్లు వెంకట రాంరెడ్డి, మాణిక్కరాజ్‌ కణ్ణన్, గడా ఓఎస్‌డీ హన్మంతరావు, ఆర్డీఓ మధు తదితరులు పాల్గొన్నారు.

గజ్వేల్‌లో పనుల పరిశీలన
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ బుధవారం పరిశీలించారు. మెదక్‌ జిల్లా పర్యటన ముగించుకొని గజ్వేల్‌ చేరుకున్న సీఎం ముం దుగా అధునాతన హంగులతో నిర్మిస్తున్న వెజ్‌ అండ్‌ నాన్‌వెజ్‌ మార్కెట్‌ నిర్మాణాలను చూశారు. మార్కెట్‌ భవన నిర్మాణాలు, రైతులకు ఉపయోగాలు మొదలైన అంశాలతో ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

అనంతరం నిర్మాణంలో ఉన్న వంద పడకల ఆస్పత్రిని చూసి అక్కడి నుంచి డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. అయితే మండల కేంద్రం మర్కూక్‌లో ఏర్పాటు చేసిన గ్రామసభకు వెళ్లాల్సి ఉన్నా అర్ధంతరంగా పర్యటనను వాయిదా వేసుకొని ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్లి అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం నల్లగొండ జిల్లా పర్యటనకు బయలుదేరారు.

గజ్వేల్‌లో ఎంఆర్పీఎస్‌ నాయకులు సీఎం కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారించారు. మర్కూక్‌ గ్రామ సభలోనూ వారు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందని, కొండపోచమ్మ సాగర్‌ నిర్వాసితులకు పరిహారం పెంచాలని రైతులు డిమాండ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని నిఘా వర్గాలు పేర్కొనడం వల్లే సీఎం గ్రామసభ వాయిదా పడినట్లు సమాచారం. సీఎం వెంట వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేంద్‌రెడ్డి, ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి ఉన్నారు.

నేతి విద్యాసాగర్‌ మాతృమూర్తికి సీఎం నివాళి
నకిరేకల్‌: శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ మాతృమూర్తి దివంగత రాధమ్మకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళి అర్పించారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెలికాప్టర్‌ ద్వారా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చేరుకున్నారు. ముందుగా నేతి రాధమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నేతి విద్యాసాగర్, కుటుంబీకులను పరామర్శించారు. 20 నిమిషాలపాటు విద్యాసాగర్‌ ఇంట్లోనే గడిపారు. అక్కడే అల్పాహారం స్వీకరించారు. సాయంత్రం ఐదు గంటలకు హెలికాప్టర్‌ ద్వారా మళ్లీ హైదరాబాద్‌కు పయనమయ్యారు.


                 తూప్రాన్‌లో 50 పడకల ఆస్పత్రిని ప్రారంభించి వైద్య పరికరాలను పరిశీలిస్తున్న కేసీఆర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement