మహాబలిపురంలో మస్తీ! | 1980 south india cinema stars meet in Mahabalipuram | Sakshi
Sakshi News home page

మహాబలిపురంలో మస్తీ!

Published Wed, Nov 22 2017 1:02 AM | Last Updated on Wed, Nov 22 2017 1:02 AM

1980 south india cinema  stars meet in Mahabalipuram - Sakshi

ఎక్కడో పుట్టారు! ఎక్కడో పెరిగారు! కలిసింది మాత్రం ఇక్కడే... కళామతల్లి ఒడిలో, వెండితెర వెలుగుల్లో! అప్పట్నుంచి స్నేహంగా మెలుగుతూ మరింత ఎత్తుకు ఎదిగారు... ప్రేక్షకుల్లో ప్రేమాభిమానాల్ని సొంతం చేసుకుని పెరిగి పెద్దయ్యారు. అయినా సరే... ఏడాదికొకసారి కలవడం మాత్రం మరువలేదు. 1980లలో సౌత్‌ స్టార్లు అందరూ కలిసి ‘ఎయిటీస్‌ సౌత్‌ యాక్టర్స్‌’ పేరుతో ఓ క్లబ్‌ ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్, మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, భాగ్యరాజ, అర్జున్, జాకీ ష్రాఫ్, సీనియర్‌ నరేశ్, సత్యరాజ్, సుమన్, ప్రభు, రమేశ్‌ అరవింద్, భానుచందర్, సురేశ్‌ తదితర హీరోలతో పాటు రేవతి, రమ్యకృష్ణ, రాధిక, సుహాసిని, నదియా, రాధ, మేనక తదితర హీరోయిన్లు ఈ ఎయిటీస్‌ క్లబ్‌లో సభ్యులు. ఎనిమిదేళ్లుగా వీళ్లందరూ ‘ఎయిటీస్‌ సౌత్‌ యాక్టర్స్‌–రీయూనియన్‌’ పేరుతో ఏదొక చోట కలుస్తుంటారు. ఈ ఏడాది మహాబలిపురంలో కలిశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో గెట్‌ టుగెదర్‌ పార్టీ జరిగింది. ఈ పార్టీల స్పెషాలిటీ ఏంటంటే... ప్రతి ఏడాది ఏదొక థీమ్‌ ప్రకారం చేసుకుంటారు. అందరూ ఒకే రంగు దుస్తులు ధరిస్తారు. ఈసారి ఊదా రంగు థీమ్‌తో డ్రస్సులు ప్లాన్‌ చేసుకున్నారు. ఐ–ఫీస్ట్‌ కదూ!

ఈ తారలు గత 17వ తేదీన ఊదా రంగు దుస్తుల్లో మహాబలిపురంలో మీట్‌ అయ్యారు. తాము బస చేసిన హోటల్‌ను ఊదా రంగుతో అలంకరించారు. అలనాటి నటీమణులు సుహాసినీ, లిసీ, పూర్ణిమా భాగ్యరాజ్, ఖుష్బూ, నటుడు రాజ్‌కుమార్‌ సేతుపతిలు  గెట్‌ టుగెదర్‌కి వచ్చిన వారికి ఆహ్వానం పలికారు. అందరూ ఆనందంగా అలనాటి జ్ఞాపకాలను పంచుకుని, ఫొటోలు దిగారు. తర్వాత పాటల పోటీ నిర్వహించారు. 1960 – 70 కాలంలో విడుదలైన ప్రముఖ హిందీ పాటలను నటీనటులు రేవతి, ఖుష్బూ, సురేశ్, రమ్య, సుమలత, నరేష్, రాధిక, శరత్‌కుమార్‌ ఆలపించారు. విజేతలు రేవతి, ఖుష్బూలకు బహుమతులు అందించారు.

ర్యాంప్‌ వాక్‌: మొదటి రోజు పురుషులు, మహిళలకు ర్యాంప్‌ వాక్‌ పోటీ నిర్వహించారు. చిరంజీవి అధ్యక్షత జరిగిన ఈ షోలో పురుషుల బృందం గెలుపొందింది. రెండో రోజు ఆధ్యాత్మిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement