తిరుపతి తొక్కిసలాటలో మృతిచెందిన రజనీ భర్త లక్ష్మారెడ్డి ఆవేదన
తల్లి మృతదేహం చూసి సొమ్మసిల్లిన కుమారుడు
మద్దిలపాలెం: ‘అప్పటి వరకు ఇద్దరం కలిసి క్యూలో జాగ్రత్తగా ఉన్నాం. రద్దీగా ఉండటంతో లైనులో నుంచి బయటకు వెళ్లిపోదాం అనుకున్నాం. అదే సమయంలో రద్దీ అధికమవడంతో గేట్లు తెరిచారని చెప్పారు. ఒక్కసారిగా భక్తులు ముందుకు కదలడంతో తొక్కిసలాట జరిగింది. క్షణాల్లో నా భార్య రజనీ ప్రాణాలు కోల్పోయింది..’ అని గుడ్ల లక్ష్మారెడ్డి విలపించారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో విశాఖపట్నంలోని మద్దిలపాలేనికి చెందిన గుడ్ల లక్ష్మారెడ్డి భార్య రజనీ మరణించిన విషయం తెలిసిందే.
మద్దిలపాలెంలోని వారి ఇంటి వద్ద రజనీ మృతదేహానికి శుక్రవారం పలువురు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి తిరుపతి క్యూలైనులో జరిగిన ఘోరం గురించి వివరిస్తూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ‘క్యూలో ఉన్న ప్రతి ఒక్కరు 10వ తేదీన దర్శనం టికెట్ల కోసమే ఆరాటపడ్డారు. ఆ ఆరాటమే తొక్కిసలాటకు కారణమై భక్తుల ప్రాణాల మీదకు తీసుకొచి్చంది. మేం ఇద్దరం కలిసి జాగ్రత్తగా లైనులో వెళుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో విడిపోయాం. ఇంతలో రజనీ కోసం చూసే సరికి కనిపించలేదు.
ఆ క్షణంలో అక్కడ ఏం జరుగుతుందో అర్థంకాలేదు. తేరుకుని చూసేసరికి రజనీ కనిపించకుండాపోయింది. తొక్కిసలాటలో తప్పిపోయిన రజనీ కోసం తీవ్రంగా వెతికా. ఎక్కడా జాడలేదు. నా ఫోన్ కూడా రజనీ బ్యాగులో ఉండిపోయింది. దీంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ ఫోన్ నుంచి కాల్ చేస్తున్నా పనిచేయలేదు. ఏం జరిగిందో తెలియదు... రెండు గంటల తర్వాత రజనీని ఆస్పత్రిలో చేరి్పంచారని సమాచారం అందింది.
ఆ ఆస్పత్రి ఎక్కడుందో తెలియదు. చివరకు ఆటోలో అక్కడి చేరుకున్నా. వెళ్లి చూసే సరికి నా భార్య విగతజీవిగా పడి ఉంది. రజనీ ఒంటిపై ఒక్క గాయం కూడా లేదు. తొక్కిసలాటలో ఊపిరాడక చనిపోయిందనుకుంటున్నా...’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
అమ్మా... వద్దన్నా వినలేదు...
‘అమ్మా ఇప్పుడు వద్దు.. మరోసారి వెళ్లొద్దాం..’ అని కొడుకు హర్షవర్థన్ ఫోన్‌లో చెప్పినా రజనీ వినలేదని లక్ష్మారెడ్డి చెప్పారు. ‘చుట్టుపక్కలవారికి సుమారు పదిసార్లు వైకుంఠ ఏకాదశి దర్శనానికి వెళ్లిన అనుభవం ఉండడంతో వారితో కలిసి మేం తొలిసారి వెళ్లాం. పది మంది గ్రూపుగా వెళ్లగా, ఆదిలక్ష్మి అనే మహిళకు తొక్కిసలాటలో గాయాలయ్యాయి. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది..’ అని ఆయన తెలిపారు.
అమెరికా నుంచి వచ్చి.. అమ్మ వద్ద సొమ్మసిల్లి..
అమెరికా నుంచి హుటాహుటిన వచి్చన రజనీ కుమారుడు హర్షవర్థన్ రెడ్డి... తల్లి భౌతికకాయాన్ని చూసి సొమ్మసిల్లిపోయాడు. బంధువులు సపర్యలు చేయడంతో కొద్దిసేపటి తర్వాత తేరున్నాడు. తల్లి మృతదేహం వద్ద విలపిస్తూ హర్షవర్ధన్ కూర్చున్న తీరు అందరినీ కలచివేసింది.
కాగా, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, కాంగ్రెస్ నాయకులు దండి ప్రియాంక తదితరులు రజనీ మృతదేహం వద్ద నివాళులర్పించారు. రజనీ తమ్ముడు అమెరికా నుంచి శనివారం విశాఖ వస్తారని, అతను రాగానే అంత్యక్రియలు నిర్వహిస్తామని లక్ష్మారెడ్డి తెలిపారు.
ఊహించుకుంటేనే భయమేస్తోంది
» మాకు పీడకలను మిగిల్చింది
»మా ప్రాణాలను మేమే కాపాడుకోవాల్సి వచ్చిoది
» తొక్కిసలాటలో క్షతగాత్రుల మనోగతం
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వేచి ఉండగా జరిగిన తొక్కిసలాటను ఊహించుకుంటేనే భయమేస్తోందని క్షతగాత్రులు తెలిపారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులు మాట్లాడుతూ.. తొక్కిసలాట సందర్భంగా భక్తుల అరుపులు, కేకలు, ఆర్తనాదాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయని చెప్పారు. అక్కడ తొక్కిసలాటకు గల కారణం, సహాయక చర్యలు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై వారు ఏమన్నారంటే.. – తిరుపతి తుడా/తిరుపతి కల్చరల్
తొక్కిసలాటకు ఆ తాడే కారణం
వైకుంఠ ద్వారదర్శనం కోసం మా ఊరి నుంచి 450మంది ఇంటిల్లిపాది బుధవారం తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నాం. క్యూలైన్లలోనికి భక్తులను వదలకుండా పద్మావతి పార్క్‌లోకి పంపించేశారు. భక్తులతో పార్క్ నిండిపోయింది. రాత్రి 8గంటల సమయంలో టోకెన్లను జారీ చేస్తున్నట్లు హఠాత్తుగా ప్రకటించారు. పార్క్ గేట్లను ఒక్కసారిగా తీయడంతో వేలాది మంది పరుగులు పెడుతూ గేటు వద్దకు దూసుకొచ్చారు.
అయితే గేటుకు రెండువైపులా రెండడుగుల ఎత్తులో కట్టి ఉన్న తాడును తొలగించకుండానే గేటును తెరిచారు. దీంతో ముందు వరుసలో ఉన్న మహిళలు తాడుకు తగులుకుని బోర్లా పడిపోయారు. వెనుక నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో అంతమంది ప్రాణాలు కోల్పోయారు. తాడు లేకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదు. – వెంకటేశ్, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్య జిల్లా
మా వాళ్లను మేమే కాపాడుకున్నాం
క్యూలైన్లలోకి వెళ్లేందుకు పార్క్ గేటు తెరవడంతో భక్తులు గుంపులుగా పరుగులు పెడుతూ దూసుకొచ్చారు. ముందుగా విశాఖ ప్రాంతానికి చెందిన భక్తులు తాడుకు తగులుకుని కింద పడిపోయారు. ఆ వెనుకే∙ఉన్న మాపైకి వందలాది మంది దూసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. కిందపడ్డ మా వాళ్లను కాపాడుకునేందుకు 20 నిమిషాలు పట్టింది. సకాలంలో 108 రాకపోవడంతో ఆటోల్లో ఆస్పత్రులకు తీసుకెళ్లాం. – చిన్నరాజు, క్షతగాత్రురాలి భర్త, నరసాపురం, అన్నమయ్య జిల్లా
నా జీవితంలో అదో పీడకల
కళ్ల ముందే భక్తులు కుప్పకూలిపోయారు. ముందు వరుసలో ఉన్న మహిళా భక్తులు కిందపడిపోయారు. వారిపై పదుల సంఖ్యలో భక్తులు పడ్డారు. కిందపడిన వారిలో నేనూ ఒకడిని. నా పై సుమారు 20మంది పడిపోయారు.
వారిని పట్టించుకోకుండా వెనక నుంచి వచ్చే వారు తొక్కుకుంటూ వెళ్లిపోవడంతో 50మందికిపైగా గాయాలయ్యాయి. ఆరుగురు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్వయంగా అనుభవించిన ఈఘటన పీడకలగా మిగిలిపోతుంది. – చిన్న అబ్బయ్య, క్షతగాత్రుడు, రామసముద్రం, అన్నమయ్యజిల్లా
భక్తులను నమ్మించి దగా చేశారు
సామాన్య భక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని టీటీడీ యాజమాన్యం నమ్మించి వారిని మోసం చేసింది. టికెట్ ఉన్నవారికే తిరుమలకు ప్రవేశం, స్వామిదర్శనం అంటూ నమ్మపలికారు. ఫలితంగా భక్తులు స్వామి దర్శన భాగ్యం కోసం అధిక సంఖ్యలో తిరుపతికి చేరుకున్నారు. ప్రచారానికి తగిన విధంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. – ఎ.మధు, జై హిందూస్థాన్ పార్టీ,రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు.
వైకుంఠానికే పంపారు
వైకుంఠ ఏకాదశి నాడు స్వామి వారి దర్శన భాగ్యం కల్పిoచాలని కోరిన భక్తులను టీటీడీ వారిని నేరుగా వైకుంఠానికి పంపింది. టీటీడీలో ఏటా వైకుంఠ ఏకాదశి దర్శనం కల్పించడం ఆనవాయితీగా వస్తున్నా అదే అనుభవంతో ఏర్పాట్లు, పర్యవేక్షణ కొరవడడంతో భక్తులకు తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే భక్తులు మరణించారు. –ఎం.నీలకంఠ, హిందూ చైతన్య సమితి అధ్యక్షుడు.
నేరుగా దేవుని దగ్గరకే పంపిన టీటీడీ
శ్రీవారిని చూపాలని కోరిన భక్తులకు టీటీడీ నేరుగా దేవుని దగ్గరకు పంపడం అమానుషం. వైకుంఠ దర్శన టోకన్ల జారీలో భక్తుల పట్ల టీటీడీ, పోలీసులు చులకనగా మాట్లాడడం విడ్డూరం. తొక్కిసలాట సందర్భంగా భక్తులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడమేకాక ఎవరు రమ్మన్నారంటూ వ్యాఖ్యానించడం దుర్మార్గం. – తుమ్మ ఓంకార్, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షుడు.
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆరుగురు భక్తులు మృతి చెందారు. భక్తులు తిరుమలకు రావాలంటే భయపడే పరిస్థితిని టీటీడీ యాజమాన్యం తీసుకొచ్చిoది. టీటీడీ యాజమాన్యం నిర్లక్ష్యమే ఇందుకు కారణం. – దిలీప్‌కుమార్, తిరుమల, తిరుపతి సంరక్షణ సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment