11 ఏళ్ల వయసులో ఆ బుర్రకథ చూసి ఇన్‌స్పయిరయ్యా
‘అల్లూరి సీతారామరాజు’కి 40 ఏళ్లు
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ఒక హిస్టరీ... ఒక వండర్... ఒక మిరాకిల్. మళ్లీ మళ్లీ చేయలేని అపూర్వ ప్రయత్నం. సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయి. తొలి తెలుగు సినిమా స్కోప్ - ఈస్ట్‌మన్ కలర్ చిత్రం. సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆ సినిమా విడుదలైంది. కృష్ణ, విజయనిర్మల దగ్గర ఈ చిత్రం గురించి ప్రస్తావిస్తే ఆ జ్ఞాపకాల ప్రవాహంలోకి వెళ్లిపోయారు.
‘‘అప్పుడు నాకు పదకొండేళ్లు. ఎన్టీఆర్ నటించిన ‘అగ్గిరాముడు’ సినిమాకు వెళ్లా. అందులో ఓ బుర్రకథ చూసి నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అది అల్లూరి సీతారామరాజుకి సంబంధించినది. ఆ తర్వాత ప్రజానాట్యమండలి వారి ‘అల్లూరి సీతారామరాజు’ నాటక ప్రదర్శనకు అనేకసార్లు వెళ్లాను. సీతారామరాజుగా గరికపాటి రాజారావుగారి నటన చూసి మైమరచిపోయా. అలా నా హృదయంలో ఆ పాత్ర సజీవంగా నిలిచిపోయింది. 1968లో ‘అసాధ్యుడు’ చేశాను. అది నా పన్నెండో సినిమా. అందులో ఓ అంతర్నాటకంలో నేను అల్లూరి సీతారామరాజు వేషం వేశాను. నాలో ఏదో పులకింత. ఎప్పటికైనా ఆయన కథతో సినిమా చేయాలన్న బీజం పడింది. ఏయన్నార్‌తో ‘దేవదాసు’ తీసిన డీఎల్ నారాయణగారు నాతో ఓ సినిమా చేయడానికి వచ్చారు. ఆయన అంతకుముందే శోభన్‌బాబుతో ‘అల్లూరి సీతారామరాజు’ చేస్తానని ప్రకటించి, ఎందుకో మానుకున్నారు. నేనా విషయం ప్రస్తావించి, ఆ సినిమా నాతో చేయమని అడిగాను. ఆర్థికంగా తన వల్ల కాదన్నారాయన. మీకంత ఆసక్తి ఉంటే మీరు చేసుకోవచ్చని, అప్పటి వరకూ తను సేకరించి పెట్టుకున్న మెటీరియల్ అంతా నాకు ఇచ్చేశారు. దర్శకుడు వి.రామచంద్రరావు, రచయిత త్రిపురనేని మహారథి, నా సోదరుడు జి.హనుమంతరావుతో ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించాను. నా వందో సినిమాగా ఇదే చేయాలనుకున్నా. అప్పట్లో నా సినిమాలన్నీ నవయుగ వాళ్లు పంపిణీ చేసేవారు. వాళ్లు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపలేదు. తారకరామ డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చారు. మొత్తానికి ‘అల్లూరి సీతారామరాజు’ మొదలుపెట్టాం. అప్పుడు నా వయసు 31 ఏళ్లు. చింతపల్లి అడవుల్లో షూటింగ్ చేశాం. దాదాపు 400 మందికి అక్కడే విడిది ఏర్పాటు చేశాం. సినిమా పూర్తి చేయడానికి రెండు నెలలు పట్టింది. 20 లక్షల రూపాయల వరకూ ఖర్చయ్యింది. తెలుగు సినిమా చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ‘విజయా’ చక్రపాణిగారు సినిమా చూసి, ఇక నిన్ను ప్రేక్షకులు చాలాకాలం ఇతర పాత్రల్లో చూడలేరు అన్నారు. ఆయన అన్నట్టుగానే ‘పాడిపంటలు’ సినిమా వరకూ మళ్లీ నాకు హిట్టు రాలేదు. శ్రీశ్రీ గారు రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయ పురస్కారం లభించింది. ఎన్టీఆర్‌గారు కూడా సినిమా చూసి నన్నెంతో మెచ్చుకున్నారు. ఇలా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా చాలా చెప్పొచ్చు. మహారథి, వీఎస్సార్ స్వామి, ఆది నారాయణరావు ఇలా చాలామంది సాంకేతిక నిపుణుల కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎన్నో సంఘటనలు... ఎన్నో మధుర జ్ఞాపకాలు... 40 ఏళ్లయినా నా మదిలో చెక్కు చెదరలేదు.’’
ఈ సినిమా కోసం కృష్ణ గారు చాలా కష్టపడ్డారు. మహారథి గారు ఓ తపస్సు లాగా డైలాగ్స్ రాశారు. క్లైమాక్స్‌లో కృష్ణ గారు డైలాగులు చెప్పిన తీరు చూసి నేను ఏడ్చేశాను. మాకెన్నో తీపి గుర్తులు మిగిల్చిన సినిమా ఇది.
- విజయ నిర్మల