ఆ రోజులు నాకెంతో నేర్పాయి! | 7 years of Deepika Padukone: 7 films that defined her career | Sakshi
Sakshi News home page

ఆ రోజులు నాకెంతో నేర్పాయి!

Published Tue, Nov 11 2014 3:50 AM | Last Updated on Tue, Oct 2 2018 3:40 PM

ఆ రోజులు నాకెంతో నేర్పాయి! - Sakshi

ఆ రోజులు నాకెంతో నేర్పాయి!

జీవితంలో కష్టసుఖాలు, ఎగుడుదిగుళ్ళు సహజం. మరీ ముఖ్యంగా ప్రతి శుక్రవారం అదృష్టం మారిపోయే సినీ ప్రపంచంలో అవి మరీ ఎక్కువ. అపజయాలు ఎదురై, కెరీర్ బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహనంతో వేచిచూడాలే తప్ప, మానసికంగా కుంగిపోకూడదు. సరిగ్గా ఆ మాటే చెబుతున్నారు - ఇప్పుడు హిందీ చిత్ర సీమలో హాట్ లేడీగా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనే. ‘‘ఈ రంగంలో ఉన్నప్పుడు ఒక నటిగా ఇటు విజయాలు, అటు పరాజయాలు - రెండూ ఎదురవుతాయి.

కొన్నిసార్లు అంతా ‘ఆహా... ఓహో...’ అన్నట్లు ఉంటే, మరికొన్నిసార్లు ఎంత కష్టపడినా తగినంత ఫలితం దక్కదు. నాకూ ఈ రెండు దశలూ అనుభవంలోకి వచ్చాయి. దేవుడి దయ వల్ల ప్రస్తుతం సినీ రంగంలో నా జోరు కొనసాగుతోంది. అయితే, నా సినిమాలు బాగా ఆడని రోజుల నుంచి నేనెంతో నేర్చుకున్నా’’ అని దీపిక చెప్పారు. ‘‘ఏ పని చేసినా సరే, పూర్తి స్థాయిలో కృషి చేసి, ఆ తరువాత సహనంతో వేచి చూడాలి. అలా చేస్తుంటే, క్రమంగా సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.

ముఖ్యంగా పరాజయాల్లో ఉన్నప్పుడు ఇదే కీలక సూత్రం’’అని ఈ అందాల భామ వివరించారు. షారుఖ్ ఖాన్ సరసన గత ఏడాది ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో, ఈ ఏడాది ‘హ్యాపీ న్యూ ఇయర్’లో అలరించిన దీపిక ఒకప్పుడు విమర్శలను ఎదుర్కొన్నవారే! మోడలింగ్ నుంచి సినీ రంగానికి వచ్చి, ‘ఓం శాంతి ఓం’ ద్వారా తెరంగేట్రం చేసిన ఈ వయ్యారిభామ అప్పట్లో చిత్రాల ఎంపిక మొదలు నాసిరకం డ్యాన్సింగ్ నైపుణ్యాలు, భావాలు సరిగ్గా పలికించలేకపోవడం లాంటి అనేక విషయాల్లో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ, క్రమంగా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ‘గోల్డెన్ లెగ్’ అభినేత్రిగా పేరు తెచ్చుకున్నారు. అపజయాలు ఎదురైనప్పుడు సహనంతో కృషి సాగించి, ఇప్పుడు వరుస విజయాల బాటలో ఉన్న దీపిక చెప్పిన సక్సెస్‌ఫుల్ సహన సూత్రం ఏ రంగంలోని వారికైనా వర్తిస్తుంది కదూ!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement