సాక్షి, చెన్నై: విశ్వనటుడిని ఇకపై వెండి తెర పై చూడలేమా? అవుననే అనిపిస్తోంది ఆయన మాటలు చూస్తుంటే. కమల్ ఇటీవల రాజకీయాలకు దగ్గరవుతున్న విషయం తెలిసిందే. అవినీతిని ఎత్తిచూపుతున్న కమల్ రాజకీయవాదుల్లో ముఖ్యంగా పాలక పార్టీ నేతల్లో అలజడి పుట్టిస్తున్నారు. ఇక తన రాజకీయరంగప్రవేశం తథ్యం అని ప్రకటించి ప్రకంపనలు సృష్టిస్తున్నారు.
ఇటీవల ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పూర్తిగా రాజకీయరంగప్రవేశం చేసిన తరువాత నటనకు స్వస్తి చెబుతానని, పూర్తి కాలాన్ని రాజకీయాలకే కేటాయిస్తానని పేర్కొన్నారు. మీ సినిమాల్లోని ఏ పాత్రను రాజకీయజీవితానికి స్ఫూర్తిగా తీసుకుంటారన్న ప్రశ్నకు ఉన్నాల్ ముడియుం తంబి ( తెలుగులో రుద్రవీణ) చిత్రంలో ప్రజలకు అండగా నిలిచి, అవినీతిపై పోరాడిన ఉదయమూర్తి పాత్రలాగా తన రాజకీయ జీవితం ఉంటుందని తెలిపారు.