అ..ఆ.. అందంగా ఉండే కథ
- పవన్‌కల్యాణ్
‘‘ హీరో నితిన్ నాకు తమ్ముడి లాంటివాడు. ‘ఇష్క్’ సినిమా టైమ్‌లో నితిన్ నా దగ్గరకొచ్చి, ఆ చిత్ర ఆడియో ఫంక్షన్‌కి రమ్మన్నాడు. అప్పుడు నాలాగే తనకూ హిట్స్ లేక బాధపడుతున్నాడని తెలిసింది. తమ్ముడికి ఇబ్బంది ఉంటే అండగా ఉంటాం కదా. అందుకే ఆ ఆడియో ఫంక్షన్‌కి వెళ్లా. ‘ఇష్క్’ విజయం వాళ్లందరి కష్టం. అలాగే ఈ సినిమా మరింత గొప్ప విజయం సాధించాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ముఖ్యతారలుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో కె.రాధాకృష్ణ నిర్మించిన చిత్రం ‘అ..ఆ’. ఈ చిత్రం పాటల వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ పవన్‌కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంతకు ముందు ఆయన సినిమా పాటల సీడీని ఆవిష్కరించారు. పవన్ కల్యాణ్ మాట్లాడే ముందు తనదైన శైలి మాటల చాతుర్యంతో ఆయన్ని ఆహ్వానిస్తూ, త్రివిక్రమ్ మైకు అందించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘మిక్కీ పాటలకు నాకు డ్యాన్స్ చేయాలనిపించింది. నా ‘గోకులంలో సీత’కు త్రివిక్రమ్ అసిస్టెంట్ రైటర్. ‘తొలిప్రేమ’ డబ్బింగ్ టైమ్‌లో, ‘చిరునవ్వుతో’ రీరికార్డింగ్ చూశా. చాలా బాగా డైలాగ్స్ రాశారనిపించింది. అప్పటికి ఆయనతో పరిచయం లేదు. ఆ తరువాత జరిగిన మా పరిచయం స్నేహంగా అల్లుకుంది.
త్రివిక్రమ్ నిజజీవితంలో విలువలు పాటించే వ్యక్తి. హీరోలకు ఎంత పేరు వచ్చినా దానికి కారణం రచయిత, అతను రాసిన కథ, డైలాగ్స్ అని నా నమ్మకం. త్రివిక్రమ్ లాంటి రచయిత ఉన్నందుకు తెలుగు పరిశ్రమ గర్విస్తుంది. ‘అ.. ఆ’ చాలా అందంగా ఉండే కథ. ‘అత్తారింటికి దారే ది’కి ముందే ఈ కథ నాకు తెలుసు’’ అని చెప్పారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ - ‘‘జీవితంలో ఎంత ముందుకెళ్లినా మూలాలను మర్చిపోకూడదు. ఆ మూలాలను వెతుక్కునే ప్రయత్నమే ‘అ..ఆ’. చిన్నప్పటి నుంచి ఇప్పటి దాకా నేను చేసిన ప్రయాణం... ఊళ్ళో వన్ బై టీ తాగుతూ స్నేహితులతో కబుర్లు చెప్పిన క్షణాలు - ఇవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటే తీయగా ఉంటాయి.
రాసేసిన డైరీ చదవాలని అనుకుంటారు. ఈ చిత్రకథ నేను చాలా రోజుల క్రితం రాసేసిన డైరీ. మళ్లీ చదువుకోవాలనిపించి, ‘అ..ఆ’గా తీశాను. ఇది కథ ఉన్న సినిమా అని నమ్మి చేశారు నితిన్, సమంత. ఈ సినిమాలో నాగవల్లి పాత్రలో అనుపమ చాలా కాలం గుర్తుండిపోతుంది. నేను కథ చెబుతుంటేనే మిక్కీ ‘గోపాల..’ పాట ట్యూన్ ఇచ్చేశారు. తెలుగు పాటకు మళ్లీ గౌరవం తీసుకురాగలిగిన రచయితల్లో సీతారామశాస్త్రి గారి తర్వాత రామజోగయ్య శాస్త్రి ఒకరు’’ అన్నారు.
నితిన్ మాట్లాడుతూ- ‘‘త్రివిక్రమ్ గారితో పనిచేసిన క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటా. ‘జయం’ ఆడిషన్స్‌కి తేజగారు నన్ను ఆఫీస్‌కు పిలిచినప్పుడు, పవన్ కల్యాణ్‌గారు ‘తొలి ప్రేమ’, ‘బద్రి’ చిత్రాల్లో వేసిన స్టెప్స్‌ను, ‘తమ్ముడు’లో కల్యాణ్‌గారు చేసిన ‘శాకుంతలక్కయ్యా’ సీన్‌ని చేసి చూపిస్తే, అభినందించారు. ఆ విధంగా 2002లో కల్యాణ్‌గారు నా తొలి బ్రేక్‌కు కారణమయ్యారు. ఫ్లాప్స్‌లో ఉన్నప్పుడు ‘ఇష్క్’ ఆడియోకు కల్యాణ్‌గారు వచ్చారు. ఆ సినిమా హిట్టయ్యి, నా రెండో బ్రేక్‌కి కారణమయ్యారు. ఇప్పుడీ సినిమా ఆడియో ఫంక్షన్‌కు వచ్చారు. ఇదీ హిట్టే’’ అని ఉద్వేగంగా అన్నారు.