సినిమా రివ్యూ: ఆగడు
సినిమా రివ్యూ: ఆగడు
Published Fri, Sep 19 2014 1:09 PM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM
పాజిటివ్ పాయింట్స్:
మహేశ్ బాబు ఫెర్మార్మెన్స్
తొలి భాగం
మైనస్ పాయింట్స్:
బ్రహ్మానందం కామెడీ
కథ, కథనం
రెండవ భాగం
చిత్ర నిడివి
అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా జి.రమేశ్‌బాబు సమర్పణలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్ బాబు, తమన్నాలు జంటగా రూపొందిన 'ఆగడు' చిత్రం 19 సెప్టెంబర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రమశిక్షణ గల పోలీసాఫీసర్ గా అభిమానులను కనువిందు చేయడానికి మహేశ్ మరోసారి సిద్ధమయ్యాడు. డైలాగ్స్ మాడ్యులేషన్, డిఫరెంట్ మేనరిజంతో ఆకట్టుకుంటున్న మహేశ్... అభిమానుల్లో నెలకొన్న భారీ అంచనాలను చేరుకున్నాడా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్దాం..
శంకర్ (మహేశ్ బాబు) ఓ అనాధ. రాజారావు (రాజేంద్ర ప్రసాద్) అనే ఇన్స్ పెక్టర్ శంకర్ ను చేరదీస్తాడు. అయితే చేయని నేరం తన మీద వేసుకుని జైలు కెళ్లడమే కాకుండా, పెంపుడు తండ్రి ఆగ్రహానికి గురవుతాడు. చిన్నతనంలోనే జైలు కెళ్లిన శంకర్ ఎన్ కౌంటర్ స్పెషలిస్టు అవుతాడు. దామూ అలియాస్ దామోదర్ (సోను సూద్) అక్రమాలను అరికట్టేందుకు శంకర్ ను ఓ గ్రామానికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. దామూ అక్రమాలను శంకర్ ఎలా అరికట్టాడు? కుటుంబానికి మళ్లీ ఎలా దగ్గరయ్యాడనేది క్లుప్తంగా ఈ చిత్ర కథ.
కొత్తదనం, లాజిక్ లేకుండా రెగ్యులర్ ఫార్మాట్ తో ఉన్న ఎన్ కౌంటర్ స్పెషలిస్టు శంకర్ పాత్రను మహేశ్ బాబు పోషించారు. ఈ పాత్రలో కొత్తగా కనిపించేది డైలాగ్ మాడ్యులేషన్ తప్ప మరేమీ లేదు. వినడానికి హెవీ డైలాగ్స్ బాగున్నా.. మహేశ్ ఫెర్మార్మెన్స్ ను డామినేట్ చేశాయి. యధావిధిగా ఫైట్స్, డాన్స్, లుక్ తో మహేశ్ అభిమానులను ఆలరించాడు. మహేశ్ బాబు ప్రియురాలు సరోజగా తమన్నా కనిపించింది. సరోజ పాత్రలో నటనకు పెద్దగా స్కోప్ లేకపోవడంతో తమన్నా గ్లామర్ కే పరిమితమైంది. శృతిహసన్ ఐటమ్ సాంగ్ అనే కన్నా ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
ఢిల్లీ సూరిగా బ్రహ్మనందం రెగ్యులర్ కామెడీకే పరిమితమయ్యారు. మూస పాత్రలో కనిపించిన బ్రహ్మానందం ఆకట్టుకోలేకపోయాడు. సోను సూద్ తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. తనికెళ్ల భరణి, ఎంఎస్ నారాయణ, ఇతర పాత్రలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
టెక్నికల్ ఫెర్మార్మెన్స్:
తమన్ సారధ్యంలో రూపొందిన సంగీతం అభిమానులను మెప్పించేలా ఉంది 'ఆజా సరోజా', 'నారీ నారీ', భేల్ పూరి పాటలు మెలోడి, 'జంక్షన్ లో' సాంగ్ మాస్ బీట్ తో సాగాయి. రెగ్యులర్ గా అనిపించే బాణీలు తెరమీద కూడా అంతంత మాత్రమే అనిపించాయి. ఫోటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాలు కూడా ఫర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి.
బలమైన కథకు తోడు ఎప్పటిలాగే వినోదానికి పెద్ద పీట వేసే దర్శకుడు శ్రీను వైట్ల ఈసారి కూడా ఎలాంటి సంకోచం లేకుండా మూస ధోరణితో ఆగడు చిత్రాన్ని తెరకెక్కించాడు. తొలి భాగంలో మహేశ్ బాబు తో ఎంటర్ టైన్ మెంట్ చేయించి ఆకట్టుకోవడంలో దర్శకుడు కొంత సఫలమయ్యాడు. సెకండాఫ్ లో కథలో విషయం లేకపోవడంతో పూర్తిగా తడబడ్డారనే చెప్పవచ్చు. రెగ్యులర్ ఫార్మాట్ నమ్ముకున్న శ్రీను వైట్ల ప్రిన్స్ అభిమానులకు కొంత నిరాశనే పంచారనే చెప్పవచ్చు.
సమీక్ష:
గతంలో విజయం సాధించిన దూకుడు, గబ్బర్ సింగ్ చిత్రాల ప్రభావం 'ఆగడు'పై స్పష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. గత పోలీసు కథా చిత్రాల్లో బలమైన కథ, సెంటిమెంట్ అంశాలు ఆగడు చిత్రంలో కనిపించకపోవడం ప్రధాన లోపంగా మారింది. తొలి భాగంలో మహేశ్ నమ్ముకున్న శ్రీనువైట్ల రెండవ భాగంలో బ్రహ్మనందంతో మేనేజ్ చేద్దామనే ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పవచ్చు. ఫస్టాఫ్ లో మహేశ్ ఫెర్ఫార్మెన్స్, వినోదంతో అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టిన దర్శకుడు సెంకడాఫ్ లో మాత్ర పూర్తి స్థాయిలో ఆలరించలేకపోయారనే స్పష్టం కనిపించింది. ఈ చిత్రంలో ప్రారంభం నుంచి.. ముగింపు దాకా మహేశ్ తో చెప్పించిన డైలాగ్స్ బుల్లెట్స్ లా పేలినా.. ఓవరాల్ గా డోస్ శృతిమించిందనే చెప్పవచ్చు. మహేశ్ తో భారీ, పొడవైన డైలాగ్స్, పిట్ట కథలు కొంత వరకు సంతృప్తి కలిగించాయి. అయితే పిట్ట కథల డోస్ ఎక్కువ కావడం అభిమానులు ఉక్కిరి బిక్కిరి చేసిందనడంలో సందేహం అక్కర్లేదు. ఇక క్లైమాక్స్ లో బ్రహ్మనందంతో చేయించిన డాన్స్ ఎపిసోడ్ లో కంప్యూటర్ గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా కనిపించాయి. ముందే దసరా పండుగ జరుపుకోవాలనుకునే ప్రిన్స్ అభిమానుల్లో పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించలేకపోయారనేది స్పష్టంగా కనిపిస్తుంది. భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉన్నా.. అభిమానులకు పూర్తి స్థాయి సంతృప్తిని పంచిన చిత్రంగా 'ఆగడు' నిలువడం కష్టమే. కథ, కథనం గాలికి వదిలి.. కేవలం మహేశ్ ను నమ్ముకుని నేల విడిచి సాము చేసిన చిత్రం 'ఆగడు' అని చెప్పవచ్చు.
ట్యాగ్ లైన్: గబ్బర్ సింగ్ + దూకుడు = ఆగడు
నటీనటులు: మహేశ్ బాబు, తమన్నా, రాజేంద్ర ప్రసాద్, సోను సూద్, బ్రహ్మనందం
దర్శకుడు: శ్రీను వైట్ల
నిర్మాతలు: రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర
సంగీతం: ఎస్ఎస్ తమన్
ఫోటోగ్రఫి: కేవీ గుహన్
ఎడిటింగ్: ఎంఆర్ వర్మ
రచన: అనిల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్ వర్మ
-రాజబాబు అనుముల
Advertisement
Advertisement