సల్లూభాయ్.. సినిమా చూపించు!
షారుక్ ఖాన్‌కు దూరమైన తర్వాత ఆమిర్‌తో సల్మాన్ అనుబంధం మరింత దృఢంగా మారింది. ఒకరి చిత్రానికి మరొకరు ప్రమోషన్ చేసే స్థాయికి వీరి స్నేహం చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆమిర్ ‘ధూమ్-3’ చిత్రానికి బిగ్‌బాస్ కార్యక్రమం ద్వారా సల్మాన్ ఫ్రీ పబ్లిసిటి ఇచ్చిన సంగతి తెలిసిందే. సల్లూభాయ్ చేసిన సహాయానికి ప్రతిగా... త్వరలో విడుదల కాబోతున్న సల్మాన్ ‘జైహో’ చిత్రం ప్రమోషన్‌లో భాగం అయ్యేందుకు ఆమిర్ కూడా సమాయత్తం అవుతున్నారు.
తాజాగా ట్విటర్‌లో ఆమిర్ పోస్టింగ్ ఆసక్తిని కలిగించింది. ‘సల్లూభాయ్.. నీ సినిమాను విడుదలకు ముందే చూపించు. నాకోసం ఓ ప్రీమియర్ షోను ఏర్పాటు చేయవచ్చుగా’ అని అని ట్వీట్ చేశారు ఆమిర్. దానికి సల్లూభాయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. సల్మాన్, డైసీ షాలు నటించిన ‘జైహో’ చిత్రం జనవరి 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకాబోతోంది. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో చిరంజీవి హీరోగా రూపొందిన ‘స్టాలిన్’ చిత్రం ఆధారంగా తెరకెక్కింది.