
రూ.1000 కోట్ల క్లబ్‌లో మరో సినిమా
ముంబయి: ‘బాహుబలి 2’ తర్వాత మరో భారతీయ సినిమా రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఆమిర్ ఖాన్ నటించిన ’దంగల్’ ఈ సినిమా ఈ ఘనత సాధించింది. ‘బాహుబలి 2’ తర్వాత రూ. 1000 కోట్ల వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. ఈ నెల 5న చైనాలో విడుదల చేయడంతో ‘దంగల్’ కలెక్షన్లు మెరుగుపడ్డాయి. ఈ సినిమాకు చైనా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురుస్తోంది. పది రోజుల్లోనే 382.69 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ (భారత్) సినిమాగానూ నిలిచింది.
హర్యానాకు చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫొగట్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం భారత్‌లోనూ ఘన విజయం సాధించింది. ‘బాహుబలి 2’ విడుదల ముందు వరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా కొనసాగించింది. ‘బాహుబలి 2’ వచ్చిన తర్వాత దంగల్ రెండో స్థానానికి పరిమితమైంది.