![Chiranjeevi Faces Backlash Over Controversial Remarks On Legacy](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/chiranjeevi_dangal1.jpg.webp?itok=y_8rNDsH)
‘మగ పిల్లాడు అయితేనే కుస్తీ పోటీల్లో గోల్డ్ మెడల్ తెస్తాడని ఆలోచిస్తూ ఉండేవాడిని..కానీ ఒక్క విషయం అర్థం కాలేదు. కొడుకు తెచ్చిన, కూతురు తెచ్చిన గోల్డ్ గోల్డే కదా’.. దంగల్ సినిమాలో ఆమిర్ ఖాన్ చెప్పే డైలాగ్ ఇది. ఈ ఒక్క డైలాగ్‌తోనే అసలు కథంతా జరుగుతుంది. చివరికి తన కూతుర్ల ద్వారా మల్ల యుద్ధంలో బంగారు పతాకాలు సాధిస్తాడు. ఇది రియల్‌గా జరిగిన కథ. ఇలాంటి కథలు ప్రస్తుత సమాజంలో చాలా జరుగుతున్నాయి. అన్ని రంగాల్లోనూ మగవాళ్లతో సమానంగా రాణిస్తున్నారు. నిజం చెప్పాలంటే కొన్ని రంగాల్లో మగవాళ్లను మించి పోతున్నారు కూడా. అయినా కూడా కొన్ని చోట్ల లింగ వివక్ష కొనసాగుతుంది. వారసత్వం అంటే మగవాళ్లే అనే అపోహలు ఇంకా కొందరిలో ఉన్నాయి. అలాంటి వారికి బుద్ది చెప్పాల్సిన సినీ ‘పెద్ద’ చిరంజీవి(Chiranjeevi) కూడా ఇప్పుడు వారసత్వం కొనసాగించేందుకు కొడుకు కావాలంటున్నారు.
కొడుకు ఉంటేనే వారసత్వమా? కూతురు లెగసీని కంటిన్యూ చేయలేదా? చిరంజీవికి సైతం ఈ వివక్ష ఎందుకు? ప్రపంచాన్ని పక్కకి పెట్టినా సరే.. ఆయన ఇంట్లోనే లెజండరీ లేడీస్ ఉన్నారు. కోడలు ఉపాసన వ్యాపార రంగంలో దూసుకెళ్తోంది. పెద్ద కూతురు నిర్మాతగా రాణిస్తోంది. తమ్ముడు కూతురు నిహారిక అటు యాక్టింగ్‌తో పాటు నిర్మాతగానూ దూసుకెళ్తోంది. సొంత ఇంట్లోనే ఇంతమంది సక్సెస్ సాధించిన ఆడవాళ్లు ఉంటే.. ‘ఒక్క మగపిల్లాడిని కనరా?’ అని చరణ్‌ని కోరాల్సిన అవసరమేంటి?
ఆచి తూచి మాట్లాడాల్సిందే..
సెలెబ్రిటీలు చేసే పనులు, మాట్లాడే మాటలను సామాన్యులు అనుసరిస్తారు. మంచి చేస్తే మెచ్చుకోవడం..చెడు చేస్తే ‘ఛీ’అని తిట్టడం కామన్. అందుకే సెలెబ్రిటీలు ఆకర్షనీయంగా మాట్లాడడం కాదు ఆచితూచి మాట్లాడాలి. లేదంటే చిరంజీవి లాగే అందరూ ట్రోల్ అవుతారు. వాస్తవానికి చిరంజీవి సరదగానే ఆ మాటలు అన్నాడు. అక్కడ విన్నవాళ్లు ఎవరీకి తప్పుగా అనిపించలేదు. కానీ నేషనల్ మీడియాలో సైతం చిరు వ్యాఖ్యలను తప్పుపట్టింది. పురుషాహంకారంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటూ నెటిజన్స్ మెగాస్టార్‌పై ఫైర్ అయ్యారు. ఇక్కడ మీడియాను తప్పపట్టలేం. ఆయన అన్న మాటలనే వార్త రూపంలో ఇచ్చింది. ఇలాంటి వ్యాఖ్యలే సామాన్యులు అంటే పెద్దగా పట్టించుకోరు. చిరంజీవి లాంటి ప్రముఖుల నోట ఇలాంటి మాటలు రావడం నిజంగా బాధాకరమే.
మనవరాళ్లే మాణిక్యాలైతారేమో!
చిరంజీవికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు చరణ్ ఉన్నాడు. పెద్ద కూతురుకు సుష్మితాకు, చిన్న కూతురు శ్రీజకు ఇద్దరేసి చొప్పున కుమార్తెలు ఉన్నారు. ఇక చరణ్-ఉపాసన దంపతులకు కూడా కూతురే పుట్టింది. ఇంట్లో చరణ్ మినహా మిగతావాళ్లంతా ఆడ పిల్లలేకావడంతో చిరంజీవి అలాంటి వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇక్కడ మెగాస్టార్ ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మనవారాళ్లు కూడా ఆయనను మించి రాణిస్తారేమో. దంగల్ సినిమా మాదిరే వివిధ రంగాల్లో చరిత్ర సృష్టిస్తారేమో. కొడుకు ఉంటే లెగసీ కంటిన్యూ అవుతుందనే అపోహ నుంచి ‘మాస్టారు’ బయటకు రావాలి.
Comments
Please login to add a commentAdd a comment