ప్రఖ్యాత హాలీవుడ్ సినిమా పండగ ఆస్కార్ వచ్చే ఏడాది జరిగేలా లేదని టాక్ వినిపిస్తోంది. కరోనా ప్రభావం వల్లే ఈ వాయిదా అట. ప్రతి ఏడాది ఫిబ్రవరి నెలలో లేదా మార్చి మొదటివారంలో ఆస్కార్ అవార్డ్స్ జరుగుతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలను నిర్వహించాలని ఆల్రెడీ అవార్డు కమిటీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే ఆస్కార్ అనుకున్న తేదీకి జరగకపోవచ్చని తెలుస్తోంది. ఆస్కార్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి సినిమా నామినేట్ అవ్వాలంటే ఆ సినిమా కచ్చితంగా థియేటర్‌లో రిలీజ్ అయ్యుండాలి.
కనీసం వారం రోజుల థియేట్రికల్ రన్ ఉంటేనే ఆ సినిమాను ఆస్కార్ కమిటీ ఎంపికకు పరిగణిస్తారు. అయితే థియేటర్లో విడుదల కాకపోయినా ఆస్కార్‌కి ఆస్కారం ఉందని ఆ మధ్య కమిటీ పేర్కొన్నట్లుగా వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ లేదట. కచ్చితంగా థియేటర్‌లో విడుదలైన సినిమాలనే పరిగణనలోకి తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం కరోనా వల్ల థియేటర్స్ మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. ఇలాంటి సమయంలో ఆస్కార్‌కి చిత్రాలను ఎలా ఎంపిక ఎలా చేస్తారు? అనేది ప్రశ్న. దాంతో ఆస్కార్ అవార్డ్ వేడుక కొత్త తేదీకి మారడం ఖాయం అని హాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment