బ్రహ్మానందం, రాఘవేంద్ర రావు, కీర్తీ, వీవీ వినాయక్, ప్రగ్యా, విష్ణు, కిట్టు, నాగేశ్వరరెడ్డి, కుమార్ చౌదరి
‘‘విష్ణు–బ్రహ్మానందం కాంబినేషన్ చూస్తుంటే ‘అల్లరి మొగుడు’ సినిమా గుర్తుకు వస్తోంది. నాగేశ్వర రెడ్డి అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్. సినిమా మంచి సక్సెస్ సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు దర్శకుడు కె. రాఘవేంద్ర రావు. ‘దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం’ వంటి ఎంటర్‌టైనర్స్ అందించిన మంచు విష్ణు – జి.నాగేశ్వర రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’. పద్మజా పిక్చర్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి సమర్పణలో కీర్తీ చౌదరి, కిట్టు నిర్మించారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. తమన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ‘‘ఈ సినిమాలో కామెడీ ‘ఢీ’ సినిమా రేంజ్‌లో పండుతుంది అనుకుంటున్నాను. కుమార్ చౌదరిగారి కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు వీవీ వినాయక్.
‘‘దేనికైనా రెడీ’ సినిమా కొన్ని సమస్యలను ఎదుర్కొంది. మళ్లీ బ్రాహ్మణుల పై ఎందుకు అనుకున్నాం కానీ మంచి కథ కుదిరింది. ఈ సినిమాలో వారి గొప్పతనాన్ని చెప్పాం. తమన్ చక్కటి సంగీతం సమకూర్చారు’’ అన్నారు నాగేశ్వర రెడ్డి. ‘‘విన్నీ (విరానిక) తర్వాత నేను పెళ్లి చేసుకున్నది డైరెక్టర్ నాగేశ్వర రెడ్డిగారినే. ఇద్దరం ప్రతి విషయంలో అంతలా వాదించుకుంటాం. సినిమాకు వర్క్ చేసిన టీమ్ అందరికీ థ్యాంక్స్. మలేసియాలో జరిగిన యాక్సిడెంట్‌కు కారణం నేనే. ఆ స్టంట్ చేసి, నిర్మాతలకు నష్టం కలిగించాను. సారీ’’ అన్నారు విష్ణు. ‘‘విష్ణు కెరీర్‌లో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు’’ అన్నారు నిర్మాతలు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, ప్రగ్యా జైస్వాల్, సి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment