‘‘ఆదికి మంచి హిట్ రావాలని చాలామంది కోరుకుంటున్నారు. ఆ కోరికను ‘గరం’ నెరవేరుస్తుంది’’ అంటున్నారు ఆది. మదన్ దర్శకత్వంలో ఆయన నటించిన ‘గరం’ నేడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యూత్, మాస్, ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునే లవబుల్ ఎంటర్‌టైనర్ ఇదని ఆది పేర్కొన్నారు. ‘సాక్షి’తో ఆయన చెప్పిన ముచ్చట్లు...
మీదేమో ‘పక్కింటి అబ్బాయి’ ఇమేజ్. మరి... మీకు ‘గరం’ టైటిల్ ఎలా సూటబుల్ అనుకున్నారు?
యాక్చువల్‌గా ఈ సినిమాకి ముందు ‘పక్కింటి అబ్బాయి’ టైటిల్ పెడదామనుకున్నాం. మరీ సాఫ్ట్‌గా ఉందని పెట్టలేదు. ‘గరం’ టైటిల్‌తో సినిమా చేసినప్పటికీ ఫ్యామిలీస్‌కి ఇంకా దగ్గరైపోతాను. క్యారెక్టర్ అలా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు వరాలబాబు. వంద మందిలో 80 మంది కుర్రాళ్లు వరాలబాబులా ఉంటారు. అందుకని యూత్‌కి కూడా ఇంకా దగ్గరవుతాను.
ఆది బాగా యాక్ట్ చేస్తాడు.. బాగుంటాడనే పేరు తెచ్చుకున్నప్పటికీ రావాల్సిన స్థాయి మీకింకా రాలేదేమో అనిపిస్తోంది..?
ఒకే సినిమాతో చిరంజీవిగారు, మహేశ్‌బాబు, రామ్‌చరణ్ అయిపోవాలంటే కష్టం. మా డాడీ, రవితేజ గారు కష్టపడి స్లోగా ఎదిగినవాళ్లే. ఇప్పుడు నాకొచ్చిన స్థాయికి నేను హ్యాపీగానే ఉన్నాను. వాస్తవానికి ఇలా సినిమా సినిమాకీ మెల్లిగా ఎదగడమే కరెక్ట్ అని నా ఫీలింగ్. ఓవర్‌నైట్ స్టార్‌డమ్ అనేది వచ్చినంత వేగంగానే వెళ్లిపోతుంది. ‘ఆది బాగా చేస్తాడు.. బాగుంటాడు’ అనే పాజిటివ్ ఒపీనియన్ తెచ్చుకోవడం అనేది నా కెరీర్‌కి బలమైన బేస్‌మెంట్‌లాంటిది. స్క్రిప్ట్ సెలక్షన్‌లో కొన్ని తప్పులు చేస్తున్నాడని కొంతమంది అనుకుంటు న్నారు తప్ప, నా మీద వేరే విధంగా బ్యాడ్ ఒపీనియన్ లేదు. అందుకే, ఇకపై స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కేర్ తీసుకోవాలనుకుంటున్నా.
పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, ప్రభాస్... ఇలా చాలామంది హీరోలకు ఏడో సినిమా హిట్. మరి.. ‘గరం’ మీకు ఏడో సినిమానే కదా..?
నాకు ఏడో నంబర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఏడుకొండలవాడంటే నాకు నమ్మకం. ఈ రోజు ఉదయం (గురువారం) గుడికి వెళ్లి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను. ఇక.. సెవన్త్ నంబర్ సెంటిమెంట్ గురించి చెప్పాలంటే.. నాకా నంబర్ హ్యాపీయే. సెంటిమెంట్ వర్కవుట్ అయితే బాగానే ఉంటుంది. ఆ సెంటిమెంట్‌ని పక్కన పెడితే.. మంచి కథ-దర్శకుడితో సినిమా చేస్తే ఏడో సినిమా కాకపోయినా హిట్టవుతుంది. ‘గరం’లో మంచి కంటెంట్ ఉంది. మదన్‌గారు మంచి దర్శకుడు. చూసినవాళ్లందరూ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
మీ నాన్న సాయికుమార్ తాను పడిన కష్టాల గురించి చెబుతుంటారా?
నాన్నగారి కష్టాలను నేను స్వయంగా చూశాను. మా బాబాయ్ (రవిశంకర్, అయ్యప్ప పి. శర్మ)ల కష్టం కూడా తెలుసు. సోలో హీరోగా అవకాశం తెచ్చుకోవడం కోసం నాన్నగారు పడిన తపన తెలుసు. ‘పోలీస్ స్టోరీ’ హిట్టయ్యాక ఆ విజయం తాలూకు విలువ తెలుసు. మా నాన్నగారు సో గ్రేట్. ఎందుకంటే మా తాతగారు నాన్నకు ఇచ్చినది ఏమీ లేదు. తాతగారు (పీజే శర్మ) కూడా చాలా కష్టాలు పడ్డారు. నాన్నగారు పదో తరగతి టైమ్ నుంచే సంపాదించడం మొదలుపెట్టారు. తాతయ్య, నాన్న కలిసి మా అత్తయ్య పెళ్లి చేశారు. తోడబుట్టిన వాళ్లందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి మా నాన్నగారు. నాన్నగారి జీవితాన్ని విశ్లేషిస్తే మొత్తం త్యాగాలే ఉంటాయి. తోడబుట్టినవాళ్లు బాగుండాలనీ, ఇప్పుడు నా కెరీర్ బాగుండాలనీ.. ఇలా ఎప్పటికప్పుడు నాన్నగారు కుటుంబం కోసం ఆరాటపడుతుంటారు.
మరి.. ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుని ఇప్పుడిలా మీ సినిమాకి పెట్టుబడిగా పెట్టిన విషయంలో మీకు టెన్షన్ అనిపించడం లేదా?
టెన్షన్ ఉంది. సేమ్ టైమ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంది. మంచి కథతో సినిమా చేశాం. పబ్లిసిటీ బాగా చేశాం. నాన్నగారికి ఒక ప్రాజెక్ట్‌ని ప్రజల దగ్గరకు ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసు. రాజీపడకుండా నిర్మించారు. అంతే రాజీపడకుండా ప్రమోట్ చేశారు. నా గత చిత్రాలతో పోల్చితే పబ్లిసిటీ వైజ్‌గా ఈ సినిమా చాలా భారీగా ఉంది. మార్నింగ్ షోకే మంచి టాక్ వస్తే చాలు.. ఇక ఎవరూ ఆపలేరు. అది జరుగుతుందనే నమ్మకంతోనే నాన్నగారు రాజీపడలేదు. పాటలను ఇక్కడే తీద్దామని నేనంటే, నో కాంప్రమైజ్ అంటూ.. మూడు పాటలను ఇటలీలో తీద్దామన్నారు. అలాగే, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల విషయంలో రాజీపడకుండా, మోస్ట్ వాంటెడ్ అనదగ్గ వాళ్లనే తీసుకున్నారు. నా గత చిత్రాల్లో ఏదో ఒక విషయంలో రాజీ పడాల్సి వచ్చేది. నాన్నగారే నిర్మాత కావడంవల్ల ఆ అవసరంలేకుండా పోయింది.
మీ వయసుకి తగ్గట్టుగా మంచి లవ్‌స్టోరీలు చేయొచ్చు కదా..?
ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, ఆషికీ లాంటి లవ్ స్టోరీస్ చేయాలనే ‘ప్యార్ మే పడిపోయానె’ చేశాను. కానీ, అది ఎక్కడో తడబడింది. ఇప్పటికీ నాకో లవ్‌స్టోరీ చేయాలని ఉంది. కానీ, మంచి కథ, దర్శకుడు కుదరాలి.
పాటలు, ఫైట్లు అంటూ కమర్షియల్ మూవీస్‌కే పరిమితమవుతున్నారెందుకు?
చిన్నప్పుడు నేను విపరీతంగా సినిమాలు చూసేవాణ్ణి. ఫైట్స్, సాంగ్స్ లేని సినిమాలకు తీసికెళితే చూడబుద్ధయ్యేది కాదు. హీరో అనేవాడు డ్యాన్సులు చేయాలి.. ఫైట్స్ చేయాలని అనుకునేవాణ్ణి. చిరంజీవిగారు, బాలకృష్ణగారు, నాగార్జునగారు, వెంకటేశ్‌గార్ల సినిమాలు చూసేవాణ్ణి. ‘గ్యాంగ్ లీడర్’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ని ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. హీరో డల్‌గా ఉంటే నాకు నచ్చదు. చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలనుకుంటాను. అందుకే, ఎక్కువగా ఎనర్జిటిక్ క్యారెక్టర్స్ ఎంపిక చేసుకుంటాను.
ఇంతకీ మీ పాప ముచ్చట్లు చెబుతారా?
నా మిసెస్, పాప ఇంకా రాజమండ్రిలో మా అత్తగారింట్లోనే ఉన్నారు. పాప పుట్టి రెండు నెలలు అయ్యుంటుంది. నేను మాత్రం తనతో ఓ పది రోజులు ఉండి ఉంటానేమో. ఎప్పటికప్పుడు వీడియో తీసి మా ఆవిడ పంపిస్తుంటుంది. ‘గరం’ షూటింగ్, ప్రమోషన్స్‌తో బిజీగా ఉండి, పాపను చాలానే మిస్సయ్యాను. పాప వీడియోలు చూస్తే నా టెన్షన్ మొత్తం ఎగిరిపోతుంది.
ఆ వీడియోలు చూస్తే టెన్షన్ మొత్తం ఎగిరిపోతుంది!
Published Thu, Feb 11 2016 10:40 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM
Advertisement