ఆ మ్యాజిక్కే వేరు!
ఆది ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. నాలుగు రోజుల క్రితం తండ్రిగా ప్రమోటయ్యాడు.
అందుకే ఈ రోజు జరుపుకునే తన బర్త్‌డేను చాలా స్పెషల్‌గా ఫీలవుతున్నాడు.
‘తండ్రి హోదాలో నేను ఫస్ట్ బర్త్‌డే జరుపుకోబోతున్నాను’’ అని సంబరపడిపోతూ చెప్పాడు ఆది.
మదన్ దర్శకత్వంలో ఆది నటించిన ‘గరం’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆది చెప్పిన బర్త్‌డే కబుర్లు...
♦ ఫస్ట్ టైమ్ ఆ యాసలో మాట్లాడా...
‘గరం’ నాకు ఏడో సినిమా. తొలుత వేరే నిర్మాత మొదలుపెట్టారు. ఆయన తప్పుకోవడంతో మేమే టేకోవర్ చేశాం. అమ్మ పి.సురేఖ నిర్మాతగా ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాం. కథ మాకు అంత బాగా న చ్చింది. మదన్‌కు క్లాస్ డెరైక్టర్ అనే ఇమేజ్ ఉంది. కానీ ఆయనలో కూడా మంచి మాస్ డెరైక్టర్ ఉన్నాడని ఈ సినిమా నిరూపిస్తుంది. ఇందులో నా పాత్ర పేరు వరాలబాబు. ముక్కుసూటిగా ఉండే పల్లెటూరు కుర్రాడినన్నమాట. ‘ప్రేమిస్తే చెప్పేయ్..బాధ అనిపిస్తే ఏడ్చేయ్... కోపం వస్తే కొట్టేయ్’ అనే టైప్ క్యారెక్టర్ నాది. నేను ఫస్ట్ టైమ్ తూర్పుగోదావరి జిల్లా యాసలో మాట్లాడాను. ఈ యాస కోసం చాలా కసరత్తులు చేశా. రవితేజ సినిమాలు, రామ్ నటించిన ‘కందిరీగ’ సినిమా చూడమని చాలా మంది సలహా ఇచ్చారు.అవి చూశాను గానీ, నా స్టయిల్ నే ఫాలో అయిపోయాను. నా శ్రీమతిది రాజమండ్రి. అక్కడి వాళ్ల మాటల్లో చిన్నపాటి వెటకారం ఉంటుంది. చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. మా మావగారైతే బాగా జోక్స్ పేలుస్తుంటారు.
♦ మా పేరెంట్స్ మీద గౌరవం పెరిగింది
నా పెళ్లి తర్వాత రిలీజవుతున్న సినిమా ఇదే. అలాగే మా పాప పుట్టాక వస్తున్న మూవీ కూడా ఇదే. నా కూతురు లక్ ఇస్తుందని నమ్ముతున్నా. మా పాపకు ఏం పేరు పెట్టాలనే విషయంలో చాలా పేర్లు పరిశీలిస్తున్నాం. పాప పుట్టాక మా పేరెంట్స్ మీద ఇంకా గౌరవం పెరిగింది. అమ్మా, నాన్న ఎంత బాగా పెంచితే నేనీ స్థాయిలో ఉన్నానా..అనిపిస్తోంది. ఫాదర్‌హుడ్ అనే మ్యాజిక్కే వేరు. ఐయామ్ ఎంజాయింగ్ ఫాదర్‌హుడ్.
♦ కథల ఎంపిక కష్టమే!
ప్రస్తుతం వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘చుట్టాలబ్బాయి’ చేస్తున్నా. ఇంకా చాలా అవకాశాలొస్తున్నాయి కానీ, బెటర్‌వి రావడం లేదు. ఏడాదికి 300 సినిమాలు రిలీజవుతుంటే... అందులో 8-9 సినిమాలు మాత్రమే విజయం సాధిస్తున్నాయి. సో...కథలు ఎంపిక చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటోంది.