నయన్ నాతో మాట్లాడితే వారికేంటి
నటుడు ఆర్య గురించి అందరికీ తెలుసు. ఆయనంత జాలీ పర్సన్ కోలీవుడ్‌లో మరొకరు లేరేమో. ఒక నాయకీ తమను కన్నెత్తి చూడడం లేదనే కథానాయకులు చాలా మంది ఉన్నారు. అలాంటిది ఆర్య దృష్టిలో పడడానికి చాలామంది నాయికలు తహతహలాడుతుంటారనేది కోలీవుడ్ వర్గాల మాట. బిరియాని విందుతోనే హీరోయిన్లలను ఆకట్టుకుంటారనేది ఆర్యకున్న ప్రత్యేక ప్రచారం. అలాంటి ఆర్య ప్రస్తుతం మెగామాన్ విజయంతో మంచి జోష్‌లో ఉన్నారు. ఆ చిత్ర దర్శకుడు మగిళ్ తిరుమేణితో కలిసి మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్న ఈ సంచలన నటుడితో మాటా మంతి...
ప్రశ్న: మెగామాన్ విడుదల సమయంలో ఆ చిత్ర నిర్మాతకు మీరు రూ.6 కోట్లు ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం గురించి ఏమంటారు?
జవాబు: మెగామాన్ బ్రహ్మాండంగా రూపొందిన చిత్రం. అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అయితే చిత్ర నిర్మాణ వ్యయం అనుకున్న దానికంటే బాగా పెరిగింది. చిత్ర నిర్మాత నా స్నేహితుడు. అందువలన నేను కొంచెం ఖర్చు చేయాల్సి వచ్చింది. దాన్ని మీడియా రూ.ఆరు కోట్లుగా ప్రచారం చేస్తోంది. మెగామాన్ నా చిత్రం. దాని విడుదల ఆగకూడదని కొంచెం సాయం చేశాను. చిత్రం విజయం సాధించడంతో ఆనందంగా ఉంది.
ప్రశ్న: ఒక నిర్మాతగా చిత్ర నిర్మాణంపై మీ అభిప్రాయం?
జవాబు: నేను అమరకావ్యం చిత్రాన్ని నిర్మించాను. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమాలో జయాపజయాలు పెద్ద విషయాలు కావు. ఒక చిత్రం ప్లాప్ అయితే సినిమా రంగమే వేస్ట్ అని భావించే వాళ్లు ఇక్కడ ఏమీ సాధించలేరు. ఒక చిత్రంలో అపజయం పొందితే మరో చిత్రంలో జయించాలని పట్టుదలతో పని చేసే వారే ఇక్కడ రాణించగలరు.
ప్రశ్న: ప్రస్తుతం సినిమా రంగంలో పోటీతత్వం బాగా పెరిగింది. మీకు భయం అనిపిస్తుందా?
జవాబు: సినిమాలో నిరంతరం బిజీగా ఉండడం సాధారణ విషయం కాదు. నా విషయం చెప్పాలంటే 2005లో నటుడిగా రంగప్రవేశం చేశాను. ఇప్పటి వరకు కథా నాయకుడిగా నిలుదొక్కుకుని కొనసాగుతున్నానంటే నా అభిమానులే కారణం. వారు ఏదో గొప్ప విషయాలు ఉంటాయని ఆశించి నా చిత్రాలు చూడడానికి రారు. రెండున్నర గంటలు సరదాగా చూసి ఎంజాయ్ చేద్దాం అని భావిస్తుంటారు. వారు కోరుకునే అంశాలతో నా చిత్రాలలో అందించడానికి ప్రయత్నిస్తుంటాను.
ప్రశ్న: మిమ్మల్ని ప్రముఖ నాయికలతో కలుపుతూ తరచూ వదంతులు ప్రచారం అవుతుండడానికి కారణం?
జవాబు: ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. నేను సినిమా రంగానికి చెందిన వాడిని. ఇక్కడి వారితోనేగా మాట్లాడగలను. ఇతర రంగాల వారితో ఏమీ మాట్లాడగలను. సహ నటీమణులు సినిమాల గురించి ఏమైనా అడిగినప్పుడు తగిన సమాధానం ఇస్తుంటాను. సదభిప్రాయంతో మాట్లాడడం వలన సహ నటీమణులు నాతో స్నేహంగా మసలుకుంటారు. దీన్ని వక్రంగా చూసేవాళ్లు వదంతులు ప్రచారం చేస్తుంటారు.
ప్రశ్న: ఇతర హీరోయిన్లకంటే నయనతారను ప్రత్యేకంగా చూస్తారని, ఆమెతో ప్రేమాయణం సాగిస్తున్నారన్న ప్రచారం గురించి?
జవాబు: నయనతార మంచి స్నేహితురాలు. ఆమె ప్రవర్తన విధానం నచ్చుతుంది. స్నేహానికి గౌరవం ఇస్తుంది. స్నేహితుడనే భావంతోనే నాతో మసలుకుంటుంది. ఇందులో తప్పేముంది? అయినా నయనతార నాతో మాట్లాడితే ఇతరులకేమిటట. మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మినహా ప్రేమ, గీమా ఏమీ లేదు.
ప్రశ్న: ఇంతకీ పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జవాబు: నటుడు విశాల్ నాకు క్లోజ్ ఫ్రెండ్. అయితే నా కంటే కొంచెం సీనియర్. తను పెళ్లి చేసుకున్న తరువాతే నేను చేసుకోవాలని భావిస్తున్నాను. అయితే విశాల్ తల్లి నాకు ఫోన్ చేసి చెడామడా తిట్టేస్తుంటారు. ఇద్దరూ కలసి నాటకాలాడుతున్నారా? అంటూ చీవాట్లు పెడుతుంటారు. ఏదో విధంగా మేం ఆమెకు కథలు చెబుతూ కాలం నెట్టుకొస్తున్నాం.