
టాలీవుడ్ నటుడు, రచయిత జాన్ కొట్టోలీ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మంగళవారం మృతిచెందారు. మను, ఫలక్‌నుమా దాస్, సమ్మోహనం, రక్తం వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. మను చిత్రంలో నటనకు జాన్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సైన్మా, మిస్టర్ అమాయకుడు, కళాకారుడు వంటి షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా జాన్ యాక్ట్ చేశారు. జాన్ మరణవార్తను దర్శకుడు సాయి రాజేశ్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. జాన్ చాలా గొప్ప నటుడని.. ఆయన మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు.
జాన్ ఆకస్మిక మరణం దురదృష్టకరమని ప్రముఖ హీరో సుధీర్ బాబు అన్నారు. అతని నటన అంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సుధీర్ బాబు సంతాపం తెలిపారు. జాన్ మరణవార్త షాక్ గురిచేసినట్టు నటుడు సత్యదేవ్, నటి గాయత్రి గుప్తా పేర్కొన్నారు.