ఆరు రోజులుగా... ఇంటికి దూరమైన హీరో
చెన్నై వరదల్లో తను తీవ్రంగా నష్టపోయినా.. సామాన్యులకు సాయం చేయడానికి ముందుకు వచ్చిన రియల్ హీరో సిద్దార్థ్, తొలిసారిగా వరదలపై మీడియాతో మాట్లాడాడు. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రకృతి విపత్తుపై ప్రజలు స్పందించిన తీరు తనకు అద్భుతంగా అనిపించిందంటున్నాడు సిద్దార్థ్. ' జీవితంలో తొలిసారిగా నేను నా ఇంటిని కోల్పోయాను.. మూడు స్టూడియోలు, మూడు కార్లు ఈ వరదల్లో పాడైపోయాయి. నా పరిస్థితే ఇలా ఉంటే ఒక్క రోజులో సర్వం కోల్పోయిన సామాన్యుల పరిస్థితి ఏంటి..?' అని చెన్నై వరద పరిస్థితులపై స్పందించాడు.
తన ఇంట్లో నీరు నిలిచిపోవటంతో గత ఆరు రోజులుగా తన ఇంటికి దూరంగా ఉంటున్నాడు సిద్దార్ధ్. అయితే ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు సాయం చేయడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు ముందుకు రావటం ఆనందం గా ఉందన్నాడు. ప్రస్థుతం బాధితులకన్నా సాయం చేసేవారు ఎక్కువగా ఉండటం చాలా ఆనందంగా ఉందన్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం మూలంగానే ఈ స్పందన సాధ్యమైందన్నాడు.
ప్రస్తుతం చెన్నై పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే అయినా.. సోషల్ మీడియాలో మరింత భయానకంగా చూపిస్తారని, అలాంటి ప్రచారాలు మానుకోవాలని చెప్పాడు. ప్రభుత్వం పై వస్తున్న విమర్శలను కూడా సిద్దార్ధ్ ఖండించాడు. ఇంతటి భారీ విపత్తు సంభవించినప్పుడు ఏ ప్రభుత్వమైన అయిదు రోజుల్లో అంత సరిచేయలేదని అందుకు సమయం పడుతుందన్నాడు. ఇదే విషయం పై కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై స్పందించడానికి సిద్దార్ధ్ నిరాకరించాడు.