
నాన్న బాటలో పయనిస్తాం
నాన్న బాటలో పయనించడానికి ప్రయత్నిస్తామని ప్రముఖ నటుడు సూర్య వ్యాఖ్యానించారు. సీనియర్ నటుడు, సూర్య, కార్తీల తండ్రి, మంచి చిత్రకారుడు అయిన శివకుమార్ 75 వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టిన రోజును గురువారం ఆయన గురించిన విశేషాలతో కూడిన గోల్డెన్ మూమెంట్స్ ఆఫ్ శివకుమార్ ఇన్ తమిళసినిమా పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గిండిలోని ఒక నక్షత్రహోటల్ వేదికై న ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్య మాట్లాడుతూ తన తండ్రి నటుడిగా పరిచయం కానీ 22 ఏళ్ల వయసులో ఆకలి బాధను కూడా లెక్క చేయకుండా గీచిన చిత్రలేఖనాలను ఆయన 75 వ వసంతంలో ప్రజల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.
ఆయన నిరంత శ్రమ, కృషితో తమ నాన్నమ్మ అడవులకు వెళ్లి కట్టెలు కొట్టి సంపాదించిన డబ్బుతో పొట్ట నింపుకుని నటుడిగా ఈ స్థాయికి ఎదిగారని తెలిసారు. ఇక్కడ వక్తలు మీ నాన్నను ఆదర్శంగా తీసుకోవాలని తమకు సలహా ఇస్తున్నారని, అయితే నాన్న జీవన విధానం తమకు సాధ్యం కాదని అన్నారు. ఆయన చిత్రకళాకారుడిగా ఉంటూ అటుపై నటనపై ఆసక్తితో ఆ వైపు దృష్టి సారించారని, షూటింగ్ ముగిసిన తరువాత నాటకాలతో నటనను మరింత మెరుగుపరచుకునే వారని, అలా ఉదయం నుంచి రాత్రి వరకూ శ్రమించారని తెలిపారు.
అందువల్ల నాన్న అడుగుజాడల్లో నడవడానికి తాము ప్రయత్నం మాత్రమే చేయగలం అని పేర్కొన్నారు. నాన్నకు ఇప్పటికీ 500 మందితో సన్నిహితంగా ఉంటారన్నారు. అంత కాకపోయినా తామూ నలుగురు సన్నిహితులను పొందాలని భావిస్తున్నామనని అన్నారు. శివకుమార్ మాట్లాడుతూ తాను గొప్పనటుడినని చెప్పుకోను గానీ, చిత్రకారుడినని చెప్పుకోవడానికి గర్వపడతానని పేర్కొన్నారు. తన 16వ ఏట నుంచి 24 ఏళ్ల మధ్యలో గీచిన చిత్రలేఖనాలను ఇప్పుడు ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని శివకుమార్ అన్నారు.