నడిగర్ సంఘానికి హీరో సూర్య విరాళం
తమిళ సినిమా : దక్షిణ భారత నటీనటుల సంఘానికి హీరో సూర్య రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నూతన కార్యవర్గం పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆదివారం చెన్నైలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు విషయాల గురించి వివరించిన సంఘం నిర్వాహకులు సంఘం భవన నిర్మాణం గురించి మాట్లాడుతూ అందుకు నిధి చాలా అవసరం అవుతుందన్నారు. ప్రస్తుతం సంఘానికి 29 లక్షల 37 వేల 17 రూపాయల 84పైసలతో పాటు 87 లక్షల 75 వేలు బ్యాంక్ డిపాజిట్ మాత్రమే ఉందన్నారు.
ఈ వ్యవహారంలో పూర్తిగా ఆడిటింగ్ జరపాల్సి ఉందన్నారు. భవన నిర్మాణం కోసం స్టార్ నైట్ కార్యక్రమాలు లాంటివి చేస్తామని చెప్పారు. యువ నటులంతా కలిసి ఓ చిత్రంలో నటించి దాని ద్వారా నిధిని రాబడతామని, అలాగే స్టార్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని సంఘ కార్యదర్శి విశాల్ వెల్లడించారు. ఈ సమావేశం జరుగుతుండగానే నటుడు సూర్య సంఘానికి 10 లక్షల విరాళం అందించనున్నట్లు సంఘం నిర్వాహకులు వెల్లడించారు.